Skin Tightening Tips । మీరు ఎప్పటికీ యూత్ అనిపించుకోవాలంటే.. ఇవిగో చిట్కాలు!
09 October 2022, 10:18 IST
- Skin Tightening Tips: జుట్టు తెల్లబడితే కావలసిన రంగు వేసుకోవచ్చు, వెంట్రుకలు రాలిపోతే విగ్గుపెట్టి కవర్ చేసుకోవచ్చు, కానీ చర్మంపై ముడతలు వచ్చి ఏజ్ బార్ అయినట్లు కనిపిస్తే ఏం చేయలేం కదా? కానీ దిగులు లేదు, ఈ చిట్కాలు పాటించండి.
Skin Tightening Tips
అందంగా కనిపించాలని, వయసు తక్కువగా కనిపించాలని ఎవరికి ఉండదు? వయసు పెరిగే కొద్దీ మొఖం మీద ఆ ఛాయలు కనిపించడం సహజం. కానీ సరైన సంరక్షణ చర్యలు తీసుకుంటే వృద్ధాప్య ఛాయలను దూరం చేసి ఎల్లప్పుడూ నవయవ్వనంగా కనిపించవచ్చు.
చాలామంది తమ వయసు మూడు పదులు దాటిన తర్వాత ఆరోగ్యం పట్ల గానీ, శారీరక సౌందర్యం పట్ల గానీ ఎక్కువగా శ్రద్ద తీసుకోరు. కొంత మంది వయసు 30 దాటినా ఇంకా 20లోనే ఉన్నట్లుగా కనిపిస్తారు, మరికొంత మంది 20లో ఉన్నా ఏజ్ బార్ అయినట్లు కనిపిస్తారు. మేము ఇంకా యూత్ అని ఎవరికైనా చెప్తే.. నువ్వు యూత్ ఏంట్రా అంటూ ఎగతాళి చేసే పరిస్థితి వస్తుంది.
త్వరగా వృద్ధాప్య ఛాయలు రావాలంటే ధూమపానం, మద్యపానం ఎక్కువగా చేయాలి, వేపుళ్లు, బిర్యానీలు, మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు శరీరం తరచుగా నిర్జలీకరణం చెందుతుంది. క్రమంగా యువకులు కూడా అంకుల్స్ అయిపోవచ్చు.
అలా వద్దూ అనుకుంటే మాత్రం అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ కల్పించి, మానసిక ఒత్తిడిని నివారించటం, రసాయనాలు ఉండే ఉత్పత్తులు వాడటం తగ్గిస్తే బాల ముడతలను నివారించవచ్చు, వయసు తక్కువగా ఉన్నట్లు కనిపించవచ్చు.
తగినంత నీరు తాగండి
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల చర్మం ఎప్పుడూ సజీవంగా కనిపిస్తుంది. ఈ రకంగా వృద్ధాప్య సంకేతాలను దూరం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి రోజులో కనీసం 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలి. పండ్ల రసాలు, ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకుంటూ ఉండాలి. కాలానుగుణంగా స్థానికంగా లభించే పండ్లు తినాలి.
వ్యాయామం చేయండి
వద్దనకుండా వ్యాయామం చేయాల్సిందే. కనీసం తేలికపాటి వ్యాయామాలు, వారాంతంలో ఇంట్లోనే ఇండోర్ వ్యాయామాలు కూడా చేయవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండటం వలన చర్మం బిగుతుగా మారుతుంది. అలాగే కొన్ని ముఖ వ్యాయామాలను ఎంచుకోవాలి, వీటి వల్ల ముఖంలో ముడతలను నివారించవచ్చు.
కొబ్బరి నూనె వాడండి
చర్మానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్-ఇ చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది, ఇది వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. ఇందుకోసం వారానికి రెండు-మూడు సార్లు లేదా తలస్నానానికి గంట ముందు కొబ్బరినూనెతో శరీరానికి మసాజ్ చేయండి.
ఆవాల నూనె
ఆవాల నూనెలో ఉండే విటమిన్-ఇ చర్మాన్ని బిగుతుగా మార్చడంలో మీకు సహాయపడుతుంది. దీని కోసం, ఆవాల నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి, తలస్నానానికి ముందు శరీరం మొత్తానికి అప్లై చేసి, బాగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
అవకాడో ఆయిల్
అవకాడో ఆయిల్ చర్మంలో తేమను నిలుపుకోవడంతోపాటు ముఖాన్ని బిగుతుగా చేస్తుంది. ఈ నూనెలో విటమిన్-ఇ, పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ సులభంగా చర్మంలోకి శోషణ చెంది, చర్మ కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. రోజూ 15 నిమిషాల పాటు అవకాడో నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.
కాఫీ ఫేస్ ప్యాక్
కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెసిపీ చేయడానికి కాఫీ పొడిలో పెరుగు, పంచదార కలిపి ముఖానికి స్క్రబ్ చేస్తూ ఉండాలి, ఫేస్ ప్యాక్ లాలా ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం సహజమైన మెరుపును పొందడంతోపాటు ముడతలు తొలగిపోతాయి.