తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  River Rafting । ఎగసే కెరటాలపై స్వారీ.. భారతదేశంలో రివర్ రాఫ్టింగ్ కోసం ఉత్తమ ప్రదేశాలు ఇవే!

River Rafting । ఎగసే కెరటాలపై స్వారీ.. భారతదేశంలో రివర్ రాఫ్టింగ్ కోసం ఉత్తమ ప్రదేశాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

06 May 2023, 15:04 IST

    • River Rafting: అనేక నదులు ఉన్నందున, భారతదేశం రివర్ రాఫ్టింగ్‌కు హాట్‌స్పాట్‌గా మారుతోంది. మీరు రివర్ రాఫ్టింగ్ థ్రిల్‌ను అనుభవించాలనుకుంటే భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ ప్రదేశాలను ఇక్కడ తెలుసుకోండి.
River rafting
River rafting (Unsplash)

River rafting

River Rafting: ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో వాటర్ స్పోర్ట్స్ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. వేసవి సీజన్ వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయటానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఎగసిపడే అలలతో కూడిన నదులు, కాలువల్లో రివర్ రాఫ్టింగ్ చేయడం థ్రిలింగ్ అనుభూతిని పంచుతుంది. ముంచెత్తే నీళ్లతో రివర్ బెడ్ లో కూర్చొని నీటిపై రాపిడ్‌ల గుండా దూసుకెళ్లడం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. చల్లటి నీటి చినుకులు పలకరిస్తుండగా పడిపడిలేచే మనసులకు పడిలేచే కెరటాలపై స్వారీ చేయడం ఆహ్లాదకరంగా ఉంటుంది.

అనేక నదులు ఉన్నందున, భారతదేశం రివర్ రాఫ్టింగ్‌కు హాట్‌స్పాట్‌గా మారుతోంది. ప్రపంచంలోని అత్యంత ఉత్తేజకరమైన, సుందరమైన రివర్ రాఫ్టింగ్ ప్రదేశాలకు భారతదేశం నిలయంగా ఉంది. ఈ క్రీడను ఔత్సాహికులే కాకుండా పర్యాటకులు ఎవరైనా ఆస్వాదించవచ్చు. మీరు కూడా మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి రివర్ రాఫ్టింగ్‌ ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో మీ సామర్థ్యాన్ని బట్టి గ్రేడ్ I, గ్రేడ్ II, గ్రేడ్ III మొదలైన లెవెల్స్ ఎంచుకోవచ్చు.

మీరు రివర్ రాఫ్టింగ్ థ్రిల్‌ను అనుభవించాలనుకుంటే, ఈ క్రీడను అందించే భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ ప్రదేశాలను ఇక్కడ తెలుసుకోండి.

రిషికేశ్, ఉత్తరాఖండ్

గంగా నది తీరాన ఉన్న రిషికేశ్‌ వైట్-వాటర్ రాఫ్టింగ్ అందించే ఒక ప్రసిద్ధ ప్రదేశం, ఇక్కడ అందించే ర్యాపిడ్‌లు సులభమైన గ్రేడ్ 1 నుంచి సవాళ్లతో కూడిన టాప్ గ్రేడ్ వరకు అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. బ్రహ్మపురి నుండి రిషికేశ్ స్ట్రెచ్ (9 కి.మీ), శివపురి నుండి రిషికేశ్ స్ట్రెచ్ (16 కి.మీ), మెరైన్ డ్రైవ్ నుండి రిషికేశ్ (24 కి.మీ) అలాగే కౌడియాల నుండి రిషికేశ్ స్ట్రెచ్ (36 కి.మీ) నదిలో రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు. ఇది సాహస యాత్రికులకు ప్రసిద్ధ గమ్యస్థానం.

జంస్కార్ నది, లద్దాఖ్

ఇది భారతదేశపు ఒక అంచున రివర్ రాఫ్టింగ్ అందించే రిమోట్ లొకేషన్. హిమాలయాల అందమైన ప్రకృతి దృశ్యాలకు నెలవైన ఈ ప్రదేశంలో జంస్కార్ నదిపై రివర్ రాఫ్టింగ్ ఒక ప్రత్యేకమైన అనుభూతి. నది గడ్డకట్టండం మూలానా ఇక్కడ రాఫ్టింగ్ సీజన్ చాలా తక్కువ. జూలై- ఆగష్ట్ నెలలోనే రాఫ్టింగ్ కు అనుకూలంగా ఉంటుంది. కానీ జీవితంలో మరిచిపోలేని అనుభూతినిస్తుంది.

బియాస్ నది, హిమాచల్ ప్రదేశ్

బియాస్ నది వివిధ రాఫ్టింగ్ గ్రేడ్లతో ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన రాఫ్టింగ్ అనుభవాన్ని అందిస్తుంది. చుట్టూ హిమాలయాలతో కూడిన ప్రకృతి సౌందర్యం కారణంగా ఇది రివర్ రాఫ్టింగ్ కోసం ఒక ప్రముఖ ప్రదేశంగా ప్రాచుర్యం పొందింది.

బ్రహ్మపుత్ర నది, అరుణాచల్ ప్రదేశ్

బ్రహ్మపుత్ర నది భారతదేశంలోనే అత్యంత కఠినమైన, సాహసోపేతమైన రివర్ రాఫ్టింగ్ అనుభవాన్ని అందించే ప్రదేశం. అయినప్పటికీ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించాలంటే, జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయాలి.

కుండలిక నది, మహారాష్ట్ర

పశ్చిమ భారతదేశంలో రాఫ్టింగ్ కోసం హాట్‌స్పాట్‌గా మహారాష్ట్రలోని కోలాడ్ ప్రాంతం ఉంది. వర్షాకాలంలో రివర్ రాఫ్టింగ్ కోసం ఇది ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. కుండలిక అనేది అద్భుతమైన సహ్యాద్రి కొండల నుండి అరేబియా సముద్రం వరకు ప్రవహించే చాలా చిన్న నది. ఇది దక్షిణాన అత్యంత వేగంగా ప్రవహించే నదిగా గుర్తింపు పొందింది.

టాపిక్