Trekking Tips | వీకెండ్‌లో ట్రెక్కింగ్ వెళ్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి!
Trekking: మీరు ట్రెక్కింగ్ వెళ్లే ప్లానింగ్ లో ఉంటే, మీ ట్రెక్ విజయవంతం కావడానికి మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన వస్తువుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Trekking: వీకెండ్ వచ్చిదంటే దగ్గర్లోని కొండ ప్రాంతాలకు ట్రెకింగ్ వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. స్నేహితులతో కలిసి ట్రెక్‌కి వెళ్లడం చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. కొండ పైనుంచి చూస్తే ఆ వీక్షణ ఎల్లప్పుడూ ఎంతో గొప్పగా ఉంటుంది. రోజువారీ జీవితంలోని ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి, ఒకేరకమైన అభిరుచి కలిగిన వారితో కనెక్షన్లు పెంచుకోవడానికి, సాహస కార్యకలాపాలు ఇష్టపడేవారికి ట్రెక్కింగ్ అనేది మంచి అవకాశంగా ఉంటుంది. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించవచ్చు. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవడానికి ఈ ప్రయాణం మీకు సహాయపడవచ్చు.
అయితే అన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొండలు ఎక్కేకొద్దీ ఆయాసం వస్తుంది, కొన్ని కఠిన సవాళ్లు కూడా ఉంటాయి. ట్రెక్కింగ్ వెళ్లేటపుడు మీరు పూర్తి సంసిద్ధంగా ఉండాలి. మీ ట్రెక్ విజయవంతం కావడానికి మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన వస్తువుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Physical Fitness- శారీరక సంసిద్ధత
కష్టతరమైన ట్రెక్‌కు వెళ్లే ముందు శారీరకంగా దృఢంగా ఉండటం, మంచి ఆరోగ్యంతో ఉండటం చాలా అవసరం. కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ , ఎండ్యూరెన్స్ వర్కౌట్‌లు మొదలైన రెగ్యులర్ వ్యాయామాలు మీలో సత్తువ, ఓర్పును పెంపొందించడంలో సహాయపడతాయి. మీరు ట్రెక్కింగ్ వెళ్లే ప్లానింగ్ లో ఉంటే, అంతకు కొన్ని రోజుల ముందుగానే మీ ఇంటి వద్ద లేదా ఏదైనా భవంతి మెట్లు ఎక్కడం దిగటం చేయండి. ప్రతిరోజూ 50-100 మెట్లు ఎక్కడం దిగటం చేస్తే, మీరు మీ ట్రెక్‌ను అవలీలగా పూర్తిచేయగలరు.
Mental Condition- మానసిక సంసిద్ధత
కష్టమైన ట్రెక్‌కు వెళ్లడం సవాలుగా ఉంటుంది, కాబట్టి ట్రెక్కింగ్ కు వెళ్లే ముందు శారీరకంగానే కాదు, మానసికంగానూ మీరు సిద్ధం అవ్వాలి. ఎలా జరుగుతుందో, ఎంత కష్టంగా ఉంటుందో మొదలైన భయాలేమీ పెట్టుకోకుండా ఒక సాహసకృత్యంగా దీనిని స్వీకరించాలి. మీ ఆటిట్యూడ్ సానుకూలంగా ఉంటే మీ ట్రెకింగ్ ఒక సాహసకృత్యం అవుతుంది, అయిష్టతతో వెళ్తే అది అగ్ని పరీక్ష అవుతుంది.
Trekking Wear - వస్త్రాధారణ
మీ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, ట్రెక్ అంతటా సౌకర్యవంతంగా ఉండటానికి వివిధ లేయర్‌లలో దుస్తులు ధరించండి. కాటన్ దుస్తులను మానుకోండి, ఎందుకంటే అది పొడిగా ఉండటానికి ఎక్కువ సమయం పడుతుంది, తడిగా ఉంటే అల్పోష్ణస్థితికి దారితీస్తుంది. మీ ట్రెక్కింగ్ సమయంలో మీ పాదాలను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంచడానికి ధృఢమైన మంచి ట్రెక్కింగ్ బూట్లు ధరించండి.
Navigation- మార్గనిర్దేశనం
మీరు సరైన ట్రాక్‌లో ఉండటానికి, తెలియని ప్రదేశంలో మిమ్మల్ని సరైన మార్గంలో నావిగేట్ చేయడం కోసం మ్యాప్, దిక్సూచి వంటి నావిగేషన్ సాధనాలను కలిగి ఉండటం చాలా అవసరం. పరిజ్ఞానం ఉన్న గైడ్‌ను మీ వెంట తీసుకెళ్లడం మరీ మంచిది. మీ అనుభవ స్థాయి, ఫిట్‌నెస్‌కు సరిపోయే మార్గాన్ని ఎంచుకోండి.
Water and Snacks- ఆహార పానీయాలు
మీ ట్రెక్ మొత్తంలో మిమ్మల్ని హైడ్రేట్ గా , ఎనర్జీగా ఉంచడానికి తగినంత నీరు, ఆకలివేయకుండా స్నాక్స్ తీసుకెళ్లండి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వుల సమతుల్యతను కలిగిన తేలికైన ఆహార పదార్థాలను ఎంచుకోండి.
First Aid Kit- ప్రథమ చికిత్స సామగ్రి
దారిలో ప్రమాదాలు సంభవించవచ్చు, కాబట్టి బ్యాండేజీలు, నొప్పి నివారణలు, యాంటిసెప్టిక్స్ వంటి ప్రథమ చికిత్స సామగ్రిని తీసుకెళ్లడం తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స నైపుణ్యాలను తెలుసుకోవడం కూడా చాలా అవసరం.
సంబంధిత కథనం