Mental Health | మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బుద్ధుని సిద్ధాంతాలు తెలుసుకోండి!-buddha purinma 2023 know buddhism tattva shastra perspectives that helps to improve your mental health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Buddha Purinma 2023 Know Buddhism Tattva Shastra Perspectives That Helps To Improve Your Mental Health

Mental Health | మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బుద్ధుని సిద్ధాంతాలు తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu
May 05, 2023 02:05 PM IST

Buddha Purinma 2023: మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బుద్ధిజంలోని వివిధ పద్ధతులు, అభ్యాసాల గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకోండి.

Buddha Purinma 2023
Buddha Purinma 2023 (Pixabay)

Buddha Purinma 2023: బుద్ధుడు అనగానే ప్రశాంతమైన వదనంతో ఉన్నటువంటి ఒక యోగి రూపం మన కళ్లలో మెదులుతుంది. బుద్ధిజమ్ అనేది ఒక మతం కంటే కూడా ఎలాంటి ఆందోళనలు లేకుండా జీవించడం ఎలాగో నేర్పించే ఒక తత్వశాస్త్రంగా పరిగణిస్తారు. ఐహిక సుఖాలను వదులుకోవడం, కోరికలను త్యజించడం, క్రమశిక్షణతో జీవించడం, ధ్యానంతో ఆత్మను ప్రసన్నం చేసుకోవడం లాంటివి ముఖ్యమైన బౌద్ధ సిద్ధాంతాలు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బుద్ధుని తత్వం ఒక సాధనంగా ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. ఒత్తిడిని ఎదుర్కోవటానికి, జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవటానికి తథాగథుడు చూపిన మార్గం సహాయపడుతుందని వివిధ నివేదికలు పేర్కొన్నాయి.

మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బుద్ధిజంలోని వివిధ పద్ధతులు, అభ్యాసాల గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకోండి.

Mindfulness Meditation- మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్

తత్వశాస్త్ర ప్రధాన అభ్యాసాలలో ఒకటి బుద్ధిపూర్వకమైన ధ్యానం. ఈ అభ్యాసం మనలోని బుద్ధిని తట్టిలేపుతుంది. గతాన్ని, భవిష్యత్తును మరిచిపోయి ప్రస్తుత క్షణాలను మీ పంచేంద్రియాల ద్వారా మీరు అనుభవించగలిగడం ఇందులో ప్రధానం. కొన్ని నిమిషాలు ఈ ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు, భయాలు మాయమవుతాయి. ఒకరి మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఇది గొప్ప సాధనం.

Acceptance- అంగీకారం

బుద్ధుని తత్వశాస్త్రం మీరు జీవిస్తున్న జీవితాన్ని అంగీకరించాలని సూచిస్తుంది. జీవితంలో మార్పు అనేది రావాలి, నా జీవితం ఇలా ఉండకూడదు అని నిరంతరం ప్రయత్నించే బదులు, ఉన్నది ఉన్నట్లుగా జీవించటానికి అంగీకరించడాన్ని నొక్కి చెబుతుంది. తాము అసమర్థులం అనే భావాలతో పోరాడుతున్న వారికి లేదా ఇతరులతో తమను తాము నిరంతరం పోల్చుకునే వ్యక్తులకు, ఈర్ష్యాద్వేషాలతో రగిలుతూ ప్రశాంత కోల్పోయేవారికి ఈ సిద్ధాంతం సహాయపడుతుంది.

Letting Go- పోయేవాటిని పోనివ్వడం

చాలా మంది తమ జీవితంలో ఎవరినైనా కోల్పోయినపుడు లేదా వారికి దూరం అయినపుడు తీవ్రంగా కలత చెందుతారు. ప్రకృతిలో రావటం పోవటం అనేది సహజం, ఏదీ శాశ్వతం కాదు. అనుబంధాలనైనా, కోరికలనైనా త్యజించినపుడు మనసుకు గొప్ప ఊరట లభిస్తుంది, తలపైన భారం దిగిపోతుందని బౌద్ధా సిద్ధాంతాలు సూచిస్తాయి.

Introspection- స్వీయ అవగాహన

స్వీయ-అవగాహన అనేది మీపై మీరే దృష్టి కేంద్రీకరించే సామర్ధ్యం. మీ చర్యలు, ఆలోచనలు లేదా భావోద్వేగాలు మీ అంతర్గత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో అనే ఆత్మపరిశీలనను బోధిస్తుంది. వేరొకరి గుణగణాలు, మంచెచెడులను ఎత్తిచూపే ముందు మన సొంత వ్యవహారశైలిపై అవగాహన కల్పిస్తుంది. ప్రతికూల ఆలోచనలు ఎక్కువ ఉన్నవారికి, ప్రతికూల ప్రవర్తనలను గుర్తించడానికి ఈ సిద్ధాంతం ఒక దారి చూపుతుంది.

Compassion - కరుణ

ఇతరుల పట్ల కరుణ చూపే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది సంబంధాలను మెరుగుపరచడానికి, వ్యక్తుల్లో ఒంటరితనం భావాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఈ అంశాలతో పాటు సమతుల్య జీవితాన్ని గడపడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి పొందడం, వ్యాయామం చేయడం ప్రాముఖ్యతపై బుద్ధిజమ్ నొక్కి చెపుతుంది. ఇవన్నీ మెరుగైన మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

వైశాఖ పౌర్ణమి రోజున సిద్ధార్థ గౌతముడు (Siddhartha Gautama) బోధి చెట్టు కింద జ్ఞానోదయం పొందుతాడు. ఈ ముహూర్తమే బౌద్ధ ధర్మానికి మూలకారణం అయిందని నమ్ముతారు. అనంతరం ఆయన ఒక అధ్యాత్మిక గురువుగా, మహా బుద్ధుడిగా అవతించినట్లు చరిత్ర చెబుతుంది. తదనంతరం ఇదే ముహూర్థాన్ని బుద్ధ పూర్ణిమగా, బుద్ధుని జయంతిగా జరుపుకోవడం ప్రారంభమైంది.

WhatsApp channel

సంబంధిత కథనం