NHRC: భిక్షాటన వృత్తిగా ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కోసం ఎన్ హెచ్ఆర్ సీ సిఫారసులు-nhrc issues advisory for the protection and rehabilitation of individuals engaged in begging ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nhrc: భిక్షాటన వృత్తిగా ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కోసం ఎన్ హెచ్ఆర్ సీ సిఫారసులు

NHRC: భిక్షాటన వృత్తిగా ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కోసం ఎన్ హెచ్ఆర్ సీ సిఫారసులు

HT Telugu Desk HT Telugu
Jul 05, 2024 09:58 PM IST

NHRC advisory: భిక్షాటన వృత్తిగా కొనసాగుతున్నవారిని ఆ వృత్తి నుంచి బయటకు తీసుకువచ్చి, వేరే ఉపాధి కల్పనతో పాటు పునరావాసం కల్పించే లక్ష్యంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మార్గదర్శకాలతో కూడిన ఒక సమగ్ర నివేదికను శుక్రవారం విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భిక్షాటన వృత్తిగా కొనసాగుతున్న వ్యక్తుల పునరావాసం కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పలు మార్గదర్శకాలతో ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. పేద, చదువుకోని పిల్లలు, మహిళలు, వికలాంగులు ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అనేక కీలక సిఫార్సులను ఈ నివేదికలో పొందుపర్చింది. భిక్షాటన వృత్తిగా స్వీకరించడానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. ఎన్హెచ్ఆర్సీ (NHRC) ప్రధాన సిఫారసులు ఇవే..

yearly horoscope entry point

1. సర్వే మరియు డేటా సేకరణ

భిక్షాటనలో నిమగ్నమైన వ్యక్తుల జాతీయ డేటాబేస్‌ను రూపొందించడానికి ప్రామాణిక సర్వే విధానాన్ని అభివృద్ధి చేయాలి. అధికారులు, నోడల్ ఏజెన్సీలు, షెల్టర్ హోమ్‌లు సంబంధిత ఆన్‌లైన్ పోర్టల్‌లో సవివరమైన సమాచారాన్ని క్రమం తప్పకుండా పొందుపర్చాలి. ఆ డేటాబేస్‌లో ఆ వ్యక్తి లింగం, వయస్సు, కుటుంబ స్థితి, ఆరోగ్య సమస్యలు, మునుపటి ఆర్థిక కార్యకలాపాలు వంటి వివరాలు ఉండాలి.

2. పునరావాస చర్యలు

షెల్టర్ హోమ్‌లలో వ్యక్తులకు గుర్తింపు కార్డులను జారీ చేయాలి. ఆ షెల్టర్ హోమ్‌లు ఆరోగ్య సంరక్షణ, రిజిస్ట్రేషన్, ఆర్థిక సేవలతో సహా అవసరమైన సేవలను అందిస్తున్నాయని నిర్ధారించుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలపై సమాచారాన్ని ప్రచారం చేయాలి.

3. ఆరోగ్య సంరక్షణ

షెల్టర్ హోమ్‌లలో సరైన బోర్డింగ్, లాడ్జింగ్, హెల్త్‌కేర్ సేవలను అందించాలి. మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, డి-అడిక్షన్, పునరావాస సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారిని ప్రభుత్వ ఉచిత వైద్య సహాయం, బీమా పథకాలతో లింక్ చేయాలి.

4. విద్య

భిక్షాటనలో పాల్గొనే 6-14 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించేలా చూడాలి. తల్లిదండ్రులు భిక్షాటనలో ఉంటే, వారి 6 సంవత్సరాల లోపు పిల్లలకు బాల్య సంరక్షణ, విద్యను అందించాలి. తల్లిదండ్రులను కూడా ఆ వృత్తి నుంచి బయటకు తీసుకురావాలి.

5. లీగల్, పాలసీ ఫ్రేమ్‌వర్క్

భిక్షాటన నిరోధక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, యాచించడం పూర్తిగా సమసిపోయేలా పని చేయండి. పేదరిక నిర్మూలన చర్యలను చేపట్టాలి. భిక్షాటనలోకి బలవంతంగా ప్రవేశపెట్టడాన్ని నేరంగా పరిగణించి, కఠిన శిక్షలు అమలు చేయాలి. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు చట్టాలను రూపొందించాలి.

6. ఎన్జీవోలు ఇతర సంస్థల సహకారం

నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ కోసం NGOలు, పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగం నుంచి సహకారం తీసుకోవాలి. స్వయం సహాయక బృందాల (SHGలు) ఏర్పాటును ప్రోత్సహించాలి. వారికి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలి.

7. అవగాహన, సున్నితత్వం

భిక్షాటనను నిర్మూలించే విషయంలో అవగాహన పెంచడానికి సమాచారం, విద్య, కమ్యూనికేషన్ మెటీరియల్‌లను అభివృద్ధి చేయాలి. ఈ విషయంలో పురోగతిని పర్యవేక్షించడానికి, వారు భిక్షాటనలోకి తిరిగి రాకుండా నిరోధించడానికి ఫాలో-అప్ మరియు ఆఫ్టర్ కేర్ సేవలను అందించాలి. ఈ సిఫార్సులను యాచించడం యొక్క మూల కారణాలను పరిష్కరించడంతో పాటు వారు అందులోనుంచి బయటకు రావడానికి మద్దతు కల్పించడం, పునరావాసం అందించడం లక్ష్యంగా రూపొందించారు.

Whats_app_banner