Heart Palpitations । గుండెదడగా అనిపించినపుడు, సింపుల్‌గా ఇలా చేయండి!
Heart Palpitations: గుండె సక్రమంగా కొట్టుకోకపోవడం లేదా సాధారణం కంటే వేగంగా కొట్టుకోవడం వల్ల గుండె దడ కలుగుతుంది. గుండెదడను అదుపు చేసే మార్గాలు చూడండి.
World Health Day 2023: ఛాతీలో ఏదైనా అలజడిగా అనిపిస్తుందా? అది గుండె దడ కావచ్చు. గుండె సక్రమంగా కొట్టుకోకపోవడం లేదా సాధారణం కంటే వేగంగా కొట్టుకోవడం వల్ల గుండెదడ కలుగుతుంది. ఆందోళన, ఒత్తిడి, కెఫిన్, ఆల్కహాల్ లేదా కొన్ని ఔషధాల ప్రభావం వంటి అనేక కారణాల వల్ల ఈ గుండె దడ అనేది సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో, దడ అనేది అరిథ్మియా, వాల్వ్ సమస్యలు లేదా గుండె జబ్బు వంటి అంతర్లీన పరిస్థితులకు ఒక సంకేతం కావచ్చు. గుండెకు సంబంధించిన ఏవైనా లక్షణాలు అసాధారణంగా ఉన్నప్పుడు లేదా మీకు అనుమానం ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి నిర్ధారించుకోవడం, తగిన చికిత్స పొందడం చాలా శ్రేయస్కరం.
Ways To Stop Heart Palpitations- గుండెదడను అదుపు చేసే మార్గాలు
గుండెదడను ఆపడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీకు మీరుగా గుండె దడ వలన కలిగే అసౌకర్యం నుంచి బయటపడే వీలు ఉంటుంది.
శ్వాస వ్యాయామాలు
లోతైన శ్వాస తీసుకోవడం, శ్వాస వ్యాయామాలు (Breathing Exercises) చేయడం అనేది శరీరాన్ని శాంతపరచడానికి, ఆందోళనను తగ్గించడానికి సులభమైన, ప్రభావవంతమైన మార్గం. నెమ్మదిగా, లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా, మీరు మీ హృదయ స్పందన రేటును నియంత్రించవచ్చు, అలాగే దడ తీవ్రతను తగ్గించవచ్చు. మీరు ఒక చోట కూర్చోవడానికి లేదా పడుకోవడానికి నిశ్శబ్దమైన, ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోండి. ఆపైన ముక్కు ద్వారా నెమ్మదిగా, లోతైన శ్వాసను తీసుకోండి. కొన్ని సెకన్ల పాటు అలాగే ఊపిరి బిగపట్టి, అనంతర నోటి ద్వారా శ్వాసను వదలండి. ఇలా కొన్ని సార్లు ఈ అభ్యాసాన్ని పునరావృతం చేయండి.
హైడ్రేటెడ్‌గా ఉండండి
నిర్జలీకరణం (Dehydration) కూడా గుండె దడకు కారణమవుతుంది, గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది, గుండె దడ నివారించవచ్చు. హైడ్రేటెడ్ గా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలని గుర్తు పెట్టుకోండి.
ఒత్తిడిని తగ్గించండి
ఒత్తిడి, ఆందోళనలను గుండెదడను ప్రేరేపిస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ లేదా మైండ్‌ఫుల్‌నెస్ అభ్యాసాలు మొదలైన రిలాక్సేషన్ టెక్నిక్‌లను ప్రయత్నించండి. సంగీతం వినడం, చదవడం లేదా కుటుంబంతో సమయం గడపడం, స్నేహితులతో మాట్లాడటం వంటివి మీకు గుండె దడను తగ్గించి ఊరట భావాలను కలిగిస్తాయి.
ఉద్దీపనలను నివారించండి
కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానీయాలు గుండె దడను ప్రేరేపిస్తాయి. ఆల్కహాల్, కెఫిన్, పొగాకు వంటివి తగ్గించుకుంటే మంచిది. మీకు తరచుగా గుండె దడ, గుండెలో ఇబ్బందిగా అనిపించినపుడు ఇలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండటం ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగినవారవుతారు.
రెగ్యులర్ వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, దడ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే.. అతిగా వ్యాయామం, తీవ్రమైన వ్యాయామాలు చేయకూడదు. గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నప్పుడు వ్యాయామాలు చేయడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. వైద్యులను సంప్రదించి మీకు సరైన వ్యాయామాలను ఎంచుకోండి. సైక్లింగ్, చురుకైన నడక లేదా ఈత వంటి 30 నిమిషాల మితమైన-తీవ్రతతో కూడిన వ్యాయామాలు సహాయపడతాయి.
గుండె దడ మామూలుగానే అనిపించే ఒక భయానక పరిస్థితి. పైన పేర్కొన్న మార్గాల ద్వారా గుండెదడను అదుపు చేయవచ్చు. అయితే మీరు తరచుగా లేదా తీవ్రమైన దడను ఎదుర్కొంటుంటే, వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
సంబంధిత కథనం