Curdled Milk | పాలు విరిగిపోతే పారేయకండి, ఇలా ఉపయోగించండి!
Curdled Milk: పాలు పగిలిపోయాయా? అయితే చింతించకండి. పాలు విరిగిపోయినా వాటిని వాడవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
Curdled Milk: పాలు ఆరోగ్యకరమైన పానీయం అని అందరికీ తెలుసు. పాలు ఉడకబెట్టడం, టీ-కాఫీలు చేసుకోవడం అనేది ప్రతిరోజూ అందరి ఇళ్లలో జరిగేదే. అయితే పాలు మరిగించే క్రమంలో కొన్నిసార్లు అది విరిగిపోతుంది, పెరుగు లాగా మారిపోతుంది. దీంతో చేసేదేంలేక చాలా మంది విరిగిన పాలను పారేస్తారు. అయితే పాలు పెరుగుగా మారేయని వాటిని పారేయాల్సిన అవసరం లేదు. వీటితో ఏం చేయవచ్చు అని తెలుసుకునే ముందు అసలు పాలు ఎందుకు విరిగిపోతాయి, విరగకుండా ఉండేందుకు ఏమైనా చిట్కాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం.
పాలు అనేవి ఫ్యాట్, ప్రోటీన్లు, నీరు కలిసిన ఒక మిశ్రమం. ఇలాంటి ద్రావణంను ఎమల్షన్ అని పిలుస్తారు. ఎమల్షన్ వేడి చేసినపుడు వాటిలోని పదార్థాలు విడిపోతాయి. పాలు వేడిచేసినపుడు కూడా వాటిలోని పదార్థాలు విడిపోతూ ఉంటాయి. అంచుల వెంబండి నూనెలాగా ఫ్యాట్ తేలుతుంది. నీరు ఆవిరవుతుంది, మిగతాది చిక్కటి ప్రోటీన్ పదార్థం దగ్గరకు వస్తుంది. ప్రోటీన్ అణువులు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. అయితే రసాయనిక చర్య జరిగినపుడు లేదా వాటి pH మారినపుడు ప్రోటీన్లు దగ్గరకు చేరి గడ్డలు కడతాయి, పైకి తేలుతాయి, దీనినే మనం పాలు విరిగిపోవడం లేదా పెరుగుగా మారటం అంటాం.
సింపుల్‌గా చెప్పాలంటే పాలలో ఏదైనా కలిసినపుడు అవి విరిగిపోతాయి. ఉదాహరణకు, నిమ్మరసం కలిస్తే పాల pH మారుతుంది, అది పెరుగవుతుంది.
Curdled Milks Uses- విరిగిన పాలు ఎలా ఉపయోగించవచ్చు
- విరిగిన పాలను కాటేజ్ చీజ్, పెరుగు, హార్డ్ చీజ్ వంటి అనేక ఇతర పాలపదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.
- పాలు విరిగిపోయి పుల్లని పెరుగుగా మారినపుడు దానిని చర్మ సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. ముఖానికి ఫేస్ మాస్క్ లాగా వాడుకోవచ్చు. దీనిని 'లాక్టిక్ యాసిడ్ ఫేషియల్' అంటారు. పొడిచర్మం కలవారు విరిగిన పాలను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచుకొని ఆరిన తర్వాత కడుక్కుంటే ముఖం మృదువుగా, నిగారింపుగా మారుతుంది.
- మాంసాన్ని మెరినేట్ చేయడానికి, పదార్థాలను బేకింగ్ చేయడానికి, సలాడ్లలో కలపడానికి విరిగిన పెరుగు వాడవచ్చు.
- విరిగిన పాలు సహజమైన యాంటిసెప్టిక్, పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కోసం దీనిని వాడవచ్చు. టైఫాయిడ్ జ్వరము, పేగులో మంట, అపెండిక్స్ మంట, పెద్దప్రేగు ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి జున్ను పాలను తీసుకోవాల్సిందిగా సూచిస్తారు.
- విరిగిన పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. ముఖ్యంగా టొమాటో మొక్కల పోషణకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
- మీ ఇంట్లో పెంపుడు జంతువులకు ఆహారంగా ఉపయోగించవచ్చు.
గమనిక: పాలు చెడిపోయినపుడు కూడా విరిగిపోతాయి. దీనిని నిస్సందేహంగా పారేయండి. ఎందుకంటే, ఎక్కువ రోజులు నిల్వచేసిన పాలలో బ్యాక్టీరియా వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇది కుళ్లిపోయిన వాసనతో ఉంటుంది. వీటిని తాగితే జీర్ణ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి కాలం చెల్లిన పాలను ఏ రకంగా తీసుకున్నా అది ఆరోగ్యానికి హానికరం.
చిట్కా: శుభ్రమైన గిన్నెల్లో పాలు వేడి చేయడం, ఎక్కువ సార్లు వేడిచేయడం, కార్న్ ఫ్లోర్ లాంటి పిండిని కలపడం మొదలైన చిట్కాలతో పాలు విరిగిపోకుండా చేయవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్