Typhoid Fever । టైఫాయిడ్ జ్వరం ప్రాణాంతకమైనది.. దీని లక్షణాలు, నివారణ మార్గాలు చూడండి!-typhoid fever causes symptoms treatment and safety precautions to prevent this infection ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Typhoid Fever । టైఫాయిడ్ జ్వరం ప్రాణాంతకమైనది.. దీని లక్షణాలు, నివారణ మార్గాలు చూడండి!

Typhoid Fever । టైఫాయిడ్ జ్వరం ప్రాణాంతకమైనది.. దీని లక్షణాలు, నివారణ మార్గాలు చూడండి!

HT Telugu Desk HT Telugu
Jan 19, 2023 01:01 PM IST

Typhoid Fever: స్కూలుకు వెళ్లే పిల్లలు తరచుగా టైఫాయిడ్ జ్వరం బారినపడతారు. ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు సోకుతుంది, లక్షణాలు, నివారణ మార్గాలు ఇక్కడ చూడండి.

Typhoid Fever
Typhoid Fever (Unsplash)

Typhoid Fever: టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు చాలా బలహీనంగా అనిపిస్తుంది, మంచం మీద నుంచి లేవలేము, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఉంటుంది, ఆకలి వేసినప్పటికీ ఏది తినాలనిపించదు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది ప్రాణాంతకం కూడా కావొచ్చు. ముఖ్యంగా 3 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తరచూ టైఫాయిడ్ జ్వరాల బారినపడుతున్నారు. ఎందుకంటే ఇది అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను తినడం వల్ల సంభవిస్తుంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు రోడ్డుపై కనిపించే ఆహారాలకు ఆకర్షితమై ఈ టైఫాయిడ్ జ్వరాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ప్రతీ 30 మంది పిల్లల్లో కనీసం 5 మంది టైఫాయిడ్ బారినపడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.

నివేదికల ప్రకారం, ఈ టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తాగడం లేదా ఆహారం తినడం ద్వారా వ్యాపించే ఒక సంక్రమణ వ్యాధి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎనిమిది మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ప్రతీ ఏటా 1,28,000 నుండి 1,61,000 మంది టైఫాయిడ్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచం మొత్తంలో టైఫాయిడ్ కారణంగా నమోదయ్యే మరణాలలో 40% కంటే ఎక్కువ మరణాలు భారతదేశంలోనే సంభవించడం గమనార్హం. అందువల్ల ఈ టైఫాయిడ్ జ్వరాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, బెంగుళూరులోని ఆస్టర్ CMI హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ పరిమళ వి తిరుమలేష్ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ లక్షణాలు, జాగ్రత్తల గురించి తెలిపారు. టైఫాయిడ్ సోకినపుడు అధిక జ్వరం, భయం, అలసట, విరేచనాలు మొదలైన లక్షణాలు ఉంటాయి. పరిస్థితి విషమించినపుడు ఇది పేగులో రక్తస్రావం లేదా న్యుమోనియాకు దారితీయవచ్చు, ఈ రెండూ ప్రాణాంతకమైనవే. టైఫాయిడ్ వ్యాప్తి చెందే ప్రధాన మార్గాలు కలుషితమైన ఆహారం, పానీయాలు తీసుకోవడం.

Typhoid Safety Precautions- టైఫాయిడ్ నివారణ మార్గాలు

  • ఏదైనా తినే ముందు, నోటిని తాగేముందు కచ్చితంగా సబ్బు, నీటితో చేతులు శుభ్రపరుచుకోవాలి.
  • కలుషితమైన నీటిని తాగకూడదు. శుద్ధమైన బాటిల్ నీరు తాగాలి లేదా నీటిని మరిగించుకొని తాగాలి.
  • వీలైతే బాటిల్ వాటర్ తాగండి లేదా కనీసం ఒక నిమిషం పాటు నీటిని మరిగించండి.
  • అపరిశుభ్రమైన పరిసరాలలో తినడం మానుకోండి, పరిశుభ్రత లేని తోపుడు బండ్లు, వీధి ఆహారాలకు దూరంగా ఉండాలి.
  • ఉడకని పండ్లు లేదా కూరగాయలు తినవద్దు.
  • ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి, గది ఉష్ణోగ్రత వద్ద నిల్వచేసిన ఆహారానికి దూరంగా ఉండండి.

రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోకపోతే, వారితో పాటుగా వారు తాకిన ఆహార పదార్థాలు, నీటిని తాగిన ప్రతీ ఒక్కరు టైఫాయిడ్ బారినపడవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని తాగడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, పరిశుభ్రత పాటించడం ద్వారా టైఫాయిడ్ జ్వరాన్ని నివారించవచ్చు. టైఫాయిడ్‌ రాకుండా టీకాలు కూడా వేసుకోవడం మంచిదని డాక్టర్ పరిమళ తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం