Camel Milk For Diabetes । పచ్చి ఒంటె పాలు తాగితే మధుమేహం తగ్గుతుందా? స్టడీ తేల్చిందిదే!
Camel Milk For Diabetes: మధుమేహం ఉన్న వారు పాలు తాగవచ్చా? పచ్చి ఒంటె పాలను తాగితే మధుమేహం నయం అవుతుందా? దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పాటించాల్సిన సాధారణ నియమం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. ఈ ఒక్కటి చాలు మనం ఎలాంటి రోగాన్నైనా జయించటానికి. అందుకే అంటారు మనం తినే ఆహారమే ఔషధం, అదే విషం కూడా అని. కానీ నేటి కల్తీ ప్రపంచంలో ఆరోగ్యకరమైన ఆహారం కనుగొనడం ఒక్కోసారి ఊహించలేనిదిగా అనిపిస్తుంది. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు అనేవి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న మూడు సాధారణ ప్రాణాంతక వ్యాధులు. వీటిని ఎదుర్కోవటానికి సరైన ఆహారం తీసుకోవడం కీలకం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు తమ ఆహారం విషయంలో కచ్చితమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది.
మధుమేహులకు పాలు తాగడం సిఫార్సు చేస్తారు, అయితే తక్కువ కేలరీలు, కొవ్వులు కలిగిన పాలను ఎంచుకోవడం ఉత్తమం. అయితే ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పచ్చి ఒంటె పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివని పలు నివేదికలు తెలిపాయి. ఒంటె పాలలో యాంటీఆక్సిడెంట్లు, ఇమ్యునోగ్లోబులిన్లు, లాక్టోఫెర్రిన్ పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి, ఇతర వ్యాధులను తట్టుకునే రక్షణ కవచంగా కూడా పనిచేస్తాయి.
Camel Milk For Diabetes- మధుమేహానికి ఒంటె పాలు
ఒంటె పాలలో ప్రోటీన్, కాల్షియం, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఒంటె పాలలో కార్బోహైడ్రేట్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. పైగా, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు కారణమయ్యే లాక్టోస్ మోతాదు కూడా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల ఇది డయాబెటిక్ రోగులకు మంచిది. ముఖ్యంగా టైప్ 1 అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పచ్చి ఒంటె పాలు తీసుకోవడం మేలని అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఒంటె పాలు తీసుకున్న వారిలో మధుమేహం మెరుగైన తగ్గుదలను నమోదు చేసినట్లు గుర్తించడమైనది. అధ్యయనం సమయంలో, మధుమేహం ఉన్న 20 మంది రోగులు 2 నెలల పాటు 500 ml ఒంటె పాలను సేవించారు. ఈ ఒంటె పాలు వారి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడంతో పాటు, గ్లైసెమిక్ నియంత్రణకు కూడా దోహదపడినట్లు అధ్యయన ఫలితాలను వెల్లడించారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒంటె పాలను పచ్చిగా తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ పాలను మరిగించడం వల్ల ఈ పాలలోని ఔషధ గుణాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఒంటె పాలను పాశ్చరైజేషన్ చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ రోజూ రెండు కప్పులు లేదా 500 ml పచ్చి ఒంటె పచ్చి పాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయని చెబుతున్నారు.
గమనిక: పచ్చి ఒంటె పాలు ప్రయోజనకరమైనవి, సురక్షితమైనవి అని అధ్యయనాలు చెబుతున్నాయి, అయినప్పటికీ మీరు ఒంటె పాలను తీసుకునే ముందు తప్పకుండా మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే ఒంటె పాలలో విటమిన్ కె సహా ఇతర ఖనిజాలు కూడా గణనీయమైన స్థాయిలో ఉంటాయి, ఇవి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: గాడిదపాలు లీటరుకు రూ. 10 వేలు!
సంబంధిత కథనం