Donkey Day | గాడిదలకూ ఓ రోజు.. నేడు ప్రపంచ గాడిదల దినోత్సవం!
'అడ్డగాడిదలా పెరిగావ్' అంటూ గాడిదతో పోలిస్తూ తిడుతుంటారు. ఏం గాడిదలంటే అంత అలుసా? గాడిదలకు ప్రాణం లేదా? వాటికి మనస్సు లేదనుకుంటున్నారా? అందుకే గాడిదల దుస్థితిని తెలియపరచటానికి, గాడిదకు సరైన ఆరోగ్యం, చికిత్సపై అవగాహన కల్పించడానికి మే8న ప్రపంచ గాడిదల దినోత్సవంగా పాటిస్తున్నారు.
గాడిద అనేది గుర్రం లాంటి ఒక జంతువు. ఇవి కూడా గురం కుటుంబానికి చెందినవిగానే చెప్తారు. అయితే గాడిదకు ఎక్కువ గౌరవం గానీ, ప్రాముఖ్యతను గానీ ఇవ్వరు. వాస్తవానికి గాడిద ఎంతో కష్టజీవి. మనుషులు ఎన్నో రకాలుగా ఈ జంతువును వాడుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో మనుషుల్ని గాడిదతో పోలుస్తూ తిడతారు. తెలుగులో 'అడ్డగాడిదలా తిరుగుతున్నావ్', 'కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట', 'గాడిద గుడ్డేం కాదు' అనేవి చాలా పాపులర్ తిట్లు. అలాగే 'వసుదేవుడంతటివాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట' అని కూడా తెలుగు సంభాషణల్లో విరివిగా ఉపయోగిస్తారు.
గాడిదలు గుర్రం కంటే చాలా శక్తివంతమైనవి. అందుకే వీటిని బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. మారుమూల కొండ ప్రాంతాలకు వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు, గతంలో చాకలివారు తాము ఉతికిన బట్టలను గాడిదలతో మోయించేవారు. కొన్ని చోట్ల వ్యవసాయ పనులకు, కూలి పనులకు కూడా గాడిదలను ఉపయోగిస్తారు. మేకలు, గొర్రెల మందలో వాటికి రక్షణగా గాడిదను ఉంచుతారు . ఇలా మనుషులకు ఎంతో సహాయకారిగా ఉండే ఈ జీవిని వాడుకొని వదిలేస్తారు గానీ వీటి ఆరోగ్యాన్ని పట్టించుకునేవారు లేరు. అందుకే వీటి సంరక్షణ ఇంకా వీటి ఆరోగ్యానికి సంబంధించిన చికిత్సలపై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మే 8వ తేదీని 'ప్రపంచ గాడిదల దినోత్సవం' (World Donkey Day) గా ప్రకటించారు.
గాడిదలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు
- గాడిదలు చాలా బలమైనవి, తెలివైనవి. గాడిదలకు అపురూపమైన జ్ఞాపకశక్తి ఉంది. ఇవి తిరిగిన ప్రాంతాలను, ఇతర గాడిదలను సుమారు 25 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకోగలవు.
- గాడిదలు కొన్ని సార్లు మొండిగా ప్రవర్తిస్తాయి. అయితే ఇందుకు ఒక కారణం కూడా ఉంది. ఎప్పుడైతే అది ప్రమాదం అని పసిగడుతుందో దాని స్వీయరక్షణ కోసం ఎటూ కదలకుండా అలాగే నిల్చుండిపోతుంది. అప్పుడు ఎవరు ఎంత లాగినా, బెదరగొట్టినా గాడిద అది ఉన్నస్థానం నుంచి అస్సలు కదలదు గాక కదలదు.
- గాడిదలో ఉన్న మరో ప్రత్యేకమైన అంశం దాని అరుపు. ఎలాంటి అవరోధాలు ఒక ఎడారి లాంటి ప్రాంతంలో ఏదైనా ఒక గాడిద అరిస్తే సుమారు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గాడిద ఆ పిలుపును ఉంటుంది. అంత గొప్ప గొంతు దానిది.
- గాడిద ఒక గుర్రం లాగా అనవసరంగా బెదరదు, ఆశ్చర్యపోదు. గాడిద తదేకంగా గమనిస్తుంది. దాని ఆలోచన మేరకే నడుచుకుణ్టుంది. ఎవరైనా గాడిదకు ట్రైనింగ్ ఇవ్వాలంటే అతడి ద్వారా తనకు రక్షణ ఉంటుంది అని అది నమ్మినపుడే అతడి మాట వింటుంది.
- గంగిగోవు పాలు గరిటెడు చాలు, కడవనైతేనేమి ఖరము పాలు అని పద్యం ఉంది. కానీ ప్రపంచంలోనే గాడిద పాలు ఎంతో ఖరీదైనవి ఇండియాలోనే గాడిదపాలు లీటరుకు రూ. 10 వేలకు చొప్పున అమ్ముడయిన సందర్భాలు ఉన్నాయి. అంటే కడవ పాలుంటే లక్షధికారి కావొచ్చు. కొన్నిచోట్ల గాడిద పాలను ఆయుర్వేద ఔషధాలలో వినియోగిస్తారు.
- గాడిద సంఘజీవి. తన తోటి గాడిదలతో అవి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సంచరిస్తాయి. గాడిదలు 50 సంవత్సరాలకు పైగా జీవించగలవు.
ఇది గాడిద ఘనకీర్తి. కాబట్టి ఏ జీవిని చిన్నచూపు చూడొద్దు. ప్రకృతిలో ప్రతి జీవికి సమాన హక్కులు, స్వేచ్ఛగా జీవించే హక్కులు ఉంటాయి అని చెప్పటం ఈరోజుకు ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.
వీలైతే గాడిదలను పెంచుకోండి డ్యూడ్స్.. మహా అయితే ఇవి మీకోసం పనిచేసి పెడతాయి.
సంబంధిత కథనం