Esophageal Cancer । చిల్డ్ బీర్, సిగరెట్, వేడివేడి స్టఫ్.. అన్నవాహిక క్యాన్సర్ కోసం మంచి కాంబినేషన్!-get to know 5 daily habits that are increasing your risk of esophageal cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Esophageal Cancer । చిల్డ్ బీర్, సిగరెట్, వేడివేడి స్టఫ్.. అన్నవాహిక క్యాన్సర్ కోసం మంచి కాంబినేషన్!

Esophageal Cancer । చిల్డ్ బీర్, సిగరెట్, వేడివేడి స్టఫ్.. అన్నవాహిక క్యాన్సర్ కోసం మంచి కాంబినేషన్!

HT Telugu Desk HT Telugu
Jan 31, 2023 04:31 PM IST

Esophageal Cancer: కొన్ని జీవనశైలి అలవాట్లు అన్నవాహిక క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి కారకం అవుతాయని వైద్యులు అంటున్నారు. ఆ అలవాట్లు ఏమిటి, ముప్పు నుంచి బయటపడటం ఎలా తెలుసుకోండి.

Esophageal Cancer
Esophageal Cancer (getty images)

క్యాన్సర్ అనేది వ్యాధులన్నింటిలో అత్యంత భయంకరమైన వ్యాధి. శరీరంలో క్యాన్సర్ అభివృద్ధి చెందే భాగాన్ని బట్టి దానికి ఆ పేరు ఉంటుంది. నివేదికల ప్రకారం, సుమారు 200 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు ఉన్నాయి. క్యాన్సర్ ను వెంటనే గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. చికిత్స చేయకపోతే, అది ఇతర శరీర భాగాలకు వ్యాపించి చివరికి మరణానికి దారి తీస్తుంది. క్యాన్సర్ బారినపడి ప్రారంభ దశలోనే చికిత్స తీసుకున్న చాలా మంది ప్రాణాలతో బయటపడగలిగారు, క్యాన్సర్ ఉన్నప్పటికీ వారి ఆయుర్దాయం పెరిగింది. అందుకే క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) గా నిర్వహిస్తున్నారు.

అనేక రకాల క్యాన్సర్లలో ఈసోఫాగియల్ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది అన్నవాహిక లోపలి శ్లేష్మం పొరలో మొదలయ్యే క్యాన్సర్. అన్నవాహిక మీ గొంతు నుండి పొట్టకు వెళ్లే పొడవైన గొట్టం లాంటి భాగం. మీరు మింగిన ఆహారాన్ని మీ కడుపుకు తరలించడంలో ఇది సహాయపడుతుంది.

అన్నవాహిక క్యాన్సర్‌కు కారకం మీరు అనుసరించే జీవనశైలి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ రకమైన క్యాన్సర్ స్త్రీలతో పోలిస్తే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. ధూమపానం, ఆల్కహాల్, క్రానిక్ యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) వంటి అలవాట్లు అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి… అని డాక్టర్ అమిత్ మిగ్లానీ, డైరక్టర్ & HOD - గ్యాస్ట్రోఎంటరాలజీ, ఏషియన్ హాస్పిటల్ ఫరీదాబాద్ పేర్కొన్నారు.

Esophageal Cancer Causes- అన్నవాహిక క్యాన్సర్‌కు కారకాలు

అన్నవాహిక క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచే జీవనశైలి అలవాట్ల గురించి డాక్టర్ మిగ్లానీ వివరంగా చెప్పారు. ఆ అలవాట్లు ఏవో మీరు తెలుసుకోండి, దీనికి పరిష్కారం కూడా ఈ కింద చూడండి.

1. ఆహారం

మీరు తినే కొన్ని రకాల ఆహార పదార్థాల కారణంగా అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ప్రాసెస్ చేసిన మాంసం తింటే అన్నవాహిక క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుంది. మరోవైపు, తాజా పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి, ఇవి అన్నవాహిక క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.

2. చాలా వేడి పానీయాలు తాగడం

మీరు చాలా వేడివేడిగా టీ లేదా కాఫీలను తాగడం, వేడి నీరు, ఇతర వేడి పానీయాలు తాగడం వలన అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదానికి కారణం కావచ్చునని ఇటీవలి అధ్యయనం కనుగొంది. వాటిలోని కెఫిన్, యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల చాలా వేడిగా తాగకుండా, గోరువెచ్చగా తాగాలని సిఫారసు చేస్తున్నారు.

3. పొగాకు- మద్యం

కొంతమంది మద్యం సేవిస్తూ సిగరెట్లు కాలుస్తుంటారు. అయితే ఈ కాంబినేషన్ చాలా డేంజర్ అని వైద్యులు అంటున్నారు. ఇది అన్నవాహికతో సహా అనేక రకాల క్యాన్సర్‌లకు కారణం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లు పీల్చడం, పొగాకు నమలడం వంటివి అన్నవాహిక క్యాన్సర్‌కు ముఖ్యమైన ప్రమాద కారకం. పొగాకు వాడకం మాదిరిగానే, ఎవరైనా ఎంత ఎక్కువ ఆల్కహాల్ తాగితే, వారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.

4. ఊబకాయం

అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయులకు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఉండటం దీనికి కొంత కారణం. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే GERD అనే చాలా సాధారణమైన వ్యాధి, ఈ సమస్య ఉన్న ప్రతీ ఒక్కరికి అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే అవకాశం లేదు.

5. తగినంత వ్యాయామం చేయకపోవడం

మనల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా సాధారణ మోతాదులో శరీరానికి శ్రమ కల్పించడం ద్వారా కూడా వ్యాధులను దూరంగా ఉంచుకోవచ్చు. ఇది అన్నవాహిక క్యాన్సర్‌ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం