Diabetic-Friendly Chicken Curry | చికెన్ కర్రీని ఇలా వండుకొని తినండి.. రుచికరం, ఆరోగ్యకరం!
Diabetic Friendly Chicken Recipe: కోడికూర అంటే మీకు ఇష్టమా? కేలరీలు ఎక్కువ పెరుగుతాయని తినలేకపోతున్నారా? అయితే తక్కువ కేలరీలు, ఎక్కువ పోషక విలువలతో చికెన్ కూరను ఇలా వండుకొండి. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ.
మధుమేహం ఉన్నప్పుడు శరీరం ఇన్సులిన్‌ను తయారు చేయడంలో గానీ, లేదా సరిగ్గా వినియోగించడంలో గానీ సమస్య ఉంటుంది. ఫలితంగా మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది వారి ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి మధుమేహం ఉన్నవారు తినే తిండి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మాంసాహారం తినేవారైతే, మటన్ లాంటి కఠినమైన ప్రోటీన్ల పదార్థాలను తినకపోవడమే మంచిది. అయితే చికెన్ లీన్ ప్రోటీన్ కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఆరోగ్యకరమైన రీతిలో వండినటువంటిది, మితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక్కడ తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు కలిగినటువంటి డయాబెటిక్ ఫ్రెండ్లీ చికెన్ రెసిపీని అందిస్తున్నాము. మిరియాలు, పసుపు, వంటి సుగంధ ద్రవ్యాలతో, తాజా కూరగాయలను కలిపి వండే ఈ చికెన్ వంటకం ఎంతో రుచికరంగానే కాకుండా, ఆరోగ్యకరంగానూ ఉంటుంది. మీరూ ఒకసారి ఇలా ప్రయత్నించండి.
Diabetic Friendly Chicken Recipe కోసం కావలసినవి
- 500 గ్రాముల చికెన్
- 2 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె
- 1 ఉల్లిపాయ
- 2 వెల్లుల్లి రెబ్బలు
- 2 స్పూన్ గరం మసాలా
- 1 స్పూన్ కరివేపాకు
- 1/2 కొత్తిమీర కట్ట
- 2-3 టమోటాలు
- 2 క్యారెట్లు
- 1/2 ఎర్ర క్యాప్సికమ్, సగానికి తగ్గించబడింది,
- 2 స్పూన్ మిరియాలు
- 1 పచ్చి మిర్చి
- ఉప్పు రుచికోసం కొద్దిగా
హెల్తీ చికెన్ కర్రీ రెడీ వండే విధానం
- ముందుగా చికెన్‌ను బాగా శుభ్ర చేసి మిరియాల పొడి, పసుపు, ఉప్పుతో మెరినేట్ చేయండి. అరగంట పాటు పక్కన పెట్టండి.
- అనంతరం డీప్ ఫ్రైయింగ్ పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను చిలకరించి మెరినేట్ చేసిన చికెన్ ముక్కలను 5 నిమిషాల పాటు లేదా ముక్కలు బ్రౌన్ అయ్యే ఉడికించండి, ఆపై పాన్ నుండి తీసివేసి పక్కన పెట్టండి.
- ఇప్పుడు మీడియం వేడి మీద మిగిలిన నూనెను వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మసాలాలు, కరివేపాకు వేసి వేయించండి. ఆపై టొమాటోలు వేసి కూడా వేయించండి.
- ఇప్పుడు అర కప్పు నీరు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర కాడలతో సహా వేసి అవి ఉడికేంత వరకు ఆవిరి మీద మరిగించాలి.
- అనంతరం చికెన్ ముక్కలు వేసి మరో 10-15 నిమిషాల పాటు ఉడికించాలి.
అంతే, ఆరోగ్యకరమైన చికెన్ కర్రీ రెడీ. దీనిని బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ రైస్ లేదా, జొన్నరొట్టె పుల్కాలతో తినాలి.
సంబంధిత కథనం