Millet Egg Fried Rice । మిల్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్.. రుచికరం, ఆరోగ్యకరం!
Millet Egg Fried Rice: మిల్లెట్లలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. దీనితో ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటే రుచికరం, ఆరోగ్యకరం కూడా. రెసిపీని ఇక్కడ చూడండి.
Rice Recipes: ఎప్పుడూ ఒకే రకమైన అన్నం తినాలనిపించనపుడు, ఆ అన్నంను ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటారు. చాలా మందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. అయితే ఇందుకోసం ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే సులభంగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ రైస్ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని అందిస్తున్నాం. అదెలా అంటే, సాధారణ బియ్యంతో వండే అన్నంకు బదులు, ఇక్కడ మిల్లెట్లను ఉపయోగించి వండటం ఈ వంటకం ప్రత్యేకత. ఇది మరింత ఆరోగ్యకరమైనది, ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇది రుచిలో మిమ్మల్ని నిరాశ పరుస్తుందని అనుకోకండి. సరిగ్గా వండితే చాలా రుచికరంగా కూడా ఉంటుంది.
ఫ్రైడ్ రైస్ సరిగ్గా కుదరాలంటే.. ముందుగా మిల్లెట్లను కొన్ని గంటలు నీటిలో నానబెట్టి వండిన తర్వాత ఫ్రిజ్ లో ఉంచాలి. ఫ్రైడ్ రైస్ చేసేటపుడు నేరుగా ఫ్రిజ్ లో నుంచి తీసిన వండిన మిల్లెట్లను ఉపయోగించాలి. ఇప్పుడు రెసిపీని తెలుసుకోండి.
Millet Egg Fried Rice Recipe కోసం కావలసినవి
- 3 ½ కప్పులు వండిన, చల్లబరిచిన మిల్లెట్
- 3 టేబుల్ స్పూన్లు వెన్న
- 2 గుడ్లు
- 2 క్యారెట్లు
- 1 టీస్పూన్ వెల్లుల్లి తురుము
- 1 ½ టీస్పూన్లు అల్లం తురుము
- ½ కప్పు పచ్చి బఠానీలు
- 1 ఉల్లిపాయ
- 2 నుండి 3 టేబుల్ స్పూన్లు సోయా సాస్
- 1 టీస్పూన్ నువ్వుల నూనె
- రుచికి తగినంత ఉప్పు, కారం
మిల్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
- ముందుగా ఒక పెద్ద స్కిల్లెట్‌లో 1 టేబుల్ స్పూన్ వెన్నని అధిక వేడి మీద కరిగించండి. అందులో గుడ్లు పగలగొట్టి, గిలకొట్టండి. గుడ్లు ఫ్రై అయిన తర్వాత వాటిని పాన్ నుండి తీసివేసి పక్కన పెట్టండి.
- ఇప్పుడు మరో 1 టేబుల్ స్పూన్ వెన్న వేడిచేయండి. అందులో వెల్లుల్లి, అల్లం, క్యారెట్ ముక్కలు, బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, 1 నిమిషం పాటు కలుపుతూ వేయించండి.
- అనంతరం మరో 1 టేబుల్ స్పూన్ వెన్నను వేయండి. అది కరుగుతున్నప్పుడు, వేడిని కొద్దిగా తగ్గించి, వండిన మిల్లెట్‌ను వేసి వేయించాలి, సోయాసాస్ వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించండి.
- ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి, పైనుంచి ఫ్రై చేసిన గుడ్లు, నువ్వుల నూనె వేసి, ఉప్పు,కారం వేసి బాగా కలపండి.
అంతే, మిల్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.
సంబంధిత కథనం