Fennel Seeds Benefits : ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందేందుకు ఖాళీ కడుపుతో సోంపు గింజలు తీసుకోండి-consume fennel seeds on empty stomach to get amazing benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fennel Seeds Benefits : ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందేందుకు ఖాళీ కడుపుతో సోంపు గింజలు తీసుకోండి

Fennel Seeds Benefits : ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందేందుకు ఖాళీ కడుపుతో సోంపు గింజలు తీసుకోండి

Anand Sai HT Telugu
Mar 26, 2024 09:30 AM IST

Fennel Seeds Benefits In Telugu : సోంపు గింజలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మీరు చాలా ఉపయోగాలు పొందవచ్చు.

సోంపు గింజల ప్రయోజనాలు
సోంపు గింజల ప్రయోజనాలు (Unsplash)

భారతదేశంలో సోంపు గింజలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా మంది భోజనం తర్వాత సోంపు గింజలను నోట్లో వేసుకుని నమలడం అలవాటు. అయితే ఈ సూపర్ గింజలతో ఇదొక్కటే కాదు.. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సోంపు గింజల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే వీటిని ఉదయంపూట ఖాళీ కడుపుతో తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

భారతీయ వంటకాల్లో సోంపును వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. సోంపు మౌత్ ఫ్రెషనర్‌గా కూడా వాడుతారు. ఇందులో చాలా పోషకాలున్నాయి. కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు దొరుకుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.

మలబద్ధకం

సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది అనేక జీర్ణ సమస్యల నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పనిచేస్తుంది. ఉదయం పూట సోంపు గింజలను తప్పకుండా తీసుకోండి. అయితే వీటిని నేరుగా మీరు తినవచ్చు. లేదంటే నీటిలో కలిపి తీసుకోవచ్చు.

రోగనిరోధక శక్తి

సోంపులో విటమిన్ సి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు గింజలు తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది మీ మెుత్తం ఆరోగ్యానికి శ్రేయస్కరంగా ఉంటుంది. సోంపును ప్రతిరోజూ కొద్ది మెుత్తంలో తీసుకుంటే మీ రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది.

కాల్షియం పెరుగుతుంది

చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతారు. ఇవి బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం. ఎముకలలో కాల్షియం ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇది బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులను దూరం చేస్తుంది.

రక్తహీనతను నయం చేస్తుంది

సోంపులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం కొరతను కలిగించదు. ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది. సోంపు తీసుకోవడం వలన మీ శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. తద్వారా మెుత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

సోంపు గింజలు సాధారణంగా సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. ఇది బరువు పెరగడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలి.

బరువు తగ్గేందుకు

మీరు పొట్ట కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలను నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే వడగట్టి తాగాలి. దీంతో శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది. నిజానికి ఈ గింజలను 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టి ఉంచితే అందులోని పోషకాలు నీటిలో కలిసిపోయి శరీరానికి మేలు చేస్తాయి.

బెల్లంతో సోంపు

తీపి ఆహారాలతో బరువు పెరుగుతారు. కొందరికి తీపిని ఎక్కువగా తినాలని ఉంటుంది. తీపి కోరికలను నియంత్రించడం కష్టం కాబట్టి మీరు బదులుగా వేయించిన సోంపు గింజలను తినవచ్చు. ఇది ఆరోగ్యంగా, తీపిగా ఉండటానికి మీరు దీనికి బెల్లం పొడిని జోడించవచ్చు.

సోంపు టీ

సోంపు గింజలను తినడం ఇష్టంలేనివారు.. దీనిని టీ రూపంలో తీసుకోవచ్చు. ఇది ఆకలి బాధలను సమర్థవంతంగా అరికడుతుంది. బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. ఈ టీతో జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. దీని కోసం మీరు ఒక కప్పు నీటిలో ఒక చిటికెడు సోంపుని మరిగించి తాగాలి.

Whats_app_banner