Breast Cancer: మీరు తెలియకుండా చేసే ఓ చిన్న తప్పు.. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచేస్తుంది, జాగ్రత్త
Breast Cancer: మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడడానికి మనం చేసే కొన్ని తప్పులు కారణం అవుతున్నాయి.
Breast Cancer: ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలంటే తరచూ వ్యాయామం చేస్తూ ఉండాలి. కానీ వ్యాయామం చేసే వారి సంఖ్య తక్కువగానే ఉంది. దీనివల్లే ఎన్నో అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి. ఏ మహిళలైతే ఎలాంటి వ్యాయామం చేయకుండా ఎక్కువ సేపు కూర్చోవడానికి, పడుకోవడానికి ఇష్టపడతారో... వారు రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆఫీసులో పని చేస్తున్న మహిళలు ఎక్కువ సేపు కూర్చొని ఒకే భంగిమలో పనిచేస్తారు. ఇలా చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సాధారణ మహిళలతో పోలిస్తే రోజులో ఎక్కువ సేపు కూర్చునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం పెరుగుతుందని కొత్త అధ్యయనం తేల్చింది.
ఈ అధ్యయనాన్ని జపాన్లోని క్యోటో యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించారు. కేవలం కూర్చోవడమే కదా అని మీకు అనిపించవచ్చు, కానీ ఆ కూర్చోవడమే మీకు రొమ్ము క్యాన్సర్‌ను తెచ్చి పెట్టడం అనేది భయపెట్టే అంశమే. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాల పనితీరు మారిపోతుంది. ఇది రక్త ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రోజుకు ఏ మహిళలైతే ఏడుగంటలకు పైగా కూర్చుంటారో, వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి గంటలు గంటలు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి వాకింగ్, రన్నింగ్ వంటివి చేయడం చాలా అవసరం. అధ్యయనంలో భాగంగా 36 వేల మంది మహిళలపై పరిశోధన చేశారు. వీరిలో 35 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఉన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం 18 ఏళ్ల నుండి 64 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు కచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మీరు వారానికి కనీసం 150 నుండి 300 నిమిషాల వరకు వ్యాయామానికే కేటాయించాలి. ఇటీవల ఒక అధ్యయనం వ్యాయామం చేయడానికి ఏది ఉత్తమ సమయమో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అధ్యయనం ప్రకారం ఉదయమే వ్యాయామానికి ఉత్తమ సమయం. ఉదయం చేసే వ్యాయామం బరువును త్వరగా తగ్గిస్తుంది. దాదాపు 5,280 మందిపై అమెరికాలో ఈ అధ్యయనాన్ని నిర్వహించి, ఈ ఫలితాన్ని తేల్చారు. కాబట్టి మహిళలు ఒకే చోట ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో నడవడం, ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం చాలా అవసరం.