Betel Leaves Usage: తమలపాకులను ఇలా తింటే వైద్యుడి అవసరమే ఉండదు
తమలపాకుల్లో ఉన్న ఔషధ గుణాలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇంతకీ వాటిని ఎలా తినాలో ఇక్కడ తెలుసుకోండి.
తమలపాకును కేవలం పూజా కార్యక్రమాల్లో భాగంగానే చూస్తారు. లేదా కిళ్లీల రూపంలో నమిలేస్తారు. నిజానికి ఇది ఆరోగ్యాన్ని అందించే ఔషధం. వీటిని ఔషధంగానే ఆయుర్వేదంలో భావిస్తారు. రోజుకో యాపిల్ తింటే వైద్యుడు అవసరం ఉండదని అంటారు పెద్దలు. అలాగే మీరు రోజుకు రెండు తమలపాకులు నమలండి చాలు... వైద్యుడి అవసరం చాలా తక్కువగా పడుతుంది. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని నిరూపించాయి.
మన పూర్వీకులు తమలపాకులని అధికంగా నమిలేవారంట. అందుకే వారు ఆరోగ్యంగా ఉన్నారని చెబుతారు. కానీ ఇప్పుడు తమలపాకులను నేరుగా తినే వారి సంఖ్య తగ్గిపోయింది. వాటిలో సున్నము, పొగాకు, స్వీట్‌నర్‌లు వంటివి చుట్టి నములుతున్నారు. ఇలా నమలడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కేవలం ఆకుల్ని మాత్రమే నమిలితే ఎంతో ఆరోగ్యం. ఆకుల్ని తినే ముందు చివర ఉన్న తొడిమను తీసి పడేయాలి. వాటిని తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో ఆ తొడిమ సంతానం కలగకుండా అడ్డుకుంటుందని అంటారు.
తమలపాకుతో ఇవీ ఉపయోగాలు
- తమలపాకులో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం ఉంది. ఎందుకంటే ఈ ఆకుల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. రోజుకు రెండు ఆకులు తినడం వల్ల మన శరీరానికి తగినంత విటమిన్ సి అందుతుంది.
- అలాగే తమలపాకు ఆకుల్లో కాల్షియం కూడా అధికమే. దీనికి కాస్త సున్నాన్ని కలిపి తింటే క్యాల్షియం మరింతగా శరీరానికి చేరుతుంది. కానీ సున్నాన్ని ప్రతిరోజూ తినడం ఆరోగ్యకరం కాదు. కాబట్టి కేవలం ఆకులు మాత్రమే తింటే మంచిది.
- బాలింతల్లో పాలు అధికంగా పడాలంటే తమలపాకులు వక్క పెట్టి, చిటికెడు సున్నం వేసి కలిపి నమలాలి. ఆ రసాన్ని మింగడం వల్ల శరీరంలో వేడి కూడా తగ్గుతుంది.
- తమలపాకు తినడం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది. తలనొప్పి కూడా తగ్గుతుంది.
- తమలపాకుల్లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, కాపర్, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఖనిజాలు నిండుగా ఉంటాయి. శరీరంలో ఉన్న అదనపు ఉప్పును, నీటిని తొలగించే శక్తి దీనికి ఉంటుంది. అలాగే నొప్పిని తగ్గించే సామర్థ్యం కూడా ఎక్కువే.
- మానసిక ఆందోళనతో బాధపడేవారు రోజూ తమలపాకులను తినడం అలవాటు చేసుకోవాలి.
- అధిక రక్తపోటును తగ్గించే శక్తి తమలపాకులకు ఉంది. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ చేరితే వాటి ఎదుగుదలను నిరోధించే శక్తి తమలపాకుల్లో ఉంది.
- తమలపాకులు డిప్రెషన్‌తో పోరాడే శక్తిని ఇది మీకు అందిస్తుంది.
- మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు తమలపాకులను తినడం మంచిది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
- తమలపాకు రసాన్ని మయన్మార్, వియత్నాం వంటి దేశాల్లో అధికంగా వినియోగిస్తారు. అక్కడ దీన్ని ఔషధంగా భావిస్తారు. ఇంట్లో ఒక తమలపాకు మొక్కను పెంచుకోవడం సులువు. ఇలా పెంచడం ఇంటికి కూడా శుభదాయకం. రోజులో ఏదో ఒక సమయంలో రెండు ఆకులను తుంచి నమలడం అలవాటు చేసుకోండి.