AP MLC Results: క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం
AP MLA quota MLC Elections: ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. టీడీపీ తరపున బరిలో ఉన్న పంచుమర్తి అనురాధ గెలిచారు. దీంతో అధికార వైసీపీకి మరో షాక్ తగిలినట్లు అయింది.
AP MLC Results Updates: AP: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు. ఆమెకు 23 ఓట్లు పోలయ్యాయి. వాస్తవానికి టీడీపీ బలం 19 కాగా… ఈ ఎన్నికలో ఏకంగా 23 ఓట్లు లభించాయి. ఫలితంగా ఆమె విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలిపోతున్నాయి.
ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ.. అదే జోరుతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని భావించింది. పార్టీ అధినేత చంద్రబాబు… స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో పార్టీ తరపున నిలబెట్టిన అనురాధ గెలుపునకు బాటలు వేసినట్లు అయింది.
ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో 154 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ నుంచి సొంతంగా గెలిచిన 151మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఆ పార్టీకి ఎదురు తిరిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి ఆత్మ సాక్షిగా ఓటేస్తామని ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ సొంతంగా 149మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఒక్కో అభ్యర్థి గెలుపుకి 22మంది ఎమ్మెల్యేల బలం అవసరం.
అయితే తెలుగుదేశం చేతిలో 19 ఓట్లు ఉంటే.. మరో నాలుగు ఓట్లు అదనంగా వచ్చాయి. అందులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు పడినా.. ఆమె ఓట్ల సంఖ్య 21కి చేరినట్టు అవుతుంది. కానీ ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ నుంచి రెండు ఓట్లు క్రాస్ అయ్యాయని తెలుస్తోంది. ఫలితంగా వైసీపీ నుంచి ఓట్లు వేసిన ఆ ఇద్దరు ఎవరు అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక తాజా విజయంతో తెలుగుదేశం పార్టీ… అధికార వైసీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో మూడు సీట్లు కోల్పోయిన వైసీపీకి… ఈ ఫలితం కూడా రుచించే పరిస్థితి లేదు. మరోవైపు చంద్రబాబు ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక వైసీపీ నుంచి బరిలో ఉన్న మర్రి రాజశేఖర్, పెనుమత్స సత్యనారాయణ రాజు తో పాటు మరో ముగ్గురు విజయం సాధించారు. జయ మంగళ వెంకట రమణ, కోలా గురువులు విషయంలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా ఒక్కరిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
సంబంధిత కథనం