MLC Election Results : టీడీపీ-జనసేన పొత్తు పొడుస్తుందా? అందులో బీజేపీ చేరుతుందా?-mlc election results sync with the public mood in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mlc Election Results : టీడీపీ-జనసేన పొత్తు పొడుస్తుందా? అందులో బీజేపీ చేరుతుందా?

MLC Election Results : టీడీపీ-జనసేన పొత్తు పొడుస్తుందా? అందులో బీజేపీ చేరుతుందా?

HT Telugu Desk HT Telugu
May 05, 2023 03:19 PM IST

AP MLC Election Results : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి విజయం దక్కింది. అయితే జనసేన పార్టీ మద్దతుతోనే సాధ్యమైందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయా? ఈ కూటమిలోకి బీజేపీ వెళ్తుందా?

పవన్ కల్యాణ్, చంద్రబాబు(ఫైల్ ఫొటో)
పవన్ కల్యాణ్, చంద్రబాబు(ఫైల్ ఫొటో)

'నాయకత్వ సామర్థ్యం నిర్ణయాలు తీసుకోవడంలో ఉండదు, కానీ ఆ నిర్ణయాల నుండి సానుకూల ఫలితాలను పొందడంలో ఉంటుంది.'

2019లో టీడీపీని ఓడించిన తర్వాత.. జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ విజయ పరంపరను కొనసాగించింది. కానీ తాజాగా ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికల ఫలితాలు.. అధికార పార్టీకి పెద్ద కుదుపు, రాబోయే కష్టకాలానికి సంకేతం అనడంలో సందేహం లేదు. స్థానిక సంస్థలు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ గెలుచుకున్నప్పటికీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను గెలుచుకుంటామని చెప్పుకుంటున్న విశ్వాసానికి ఈ ఫలితాలు షాక్ ఇచ్చినట్టైంది.

మరోవైపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకు.. తమ పార్టీ పూర్వ వైభవాన్ని పొందుతుందో లేదో అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు పెద్ద ఊపునిచ్చాయి. 108 నియోజక వర్గాల్లోని ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. వైఎస్సార్‌సీపీ గెలుస్తామని ధీమాతో ఉన్నప్పటికీ.. టీడీపీ దెబ్బ కొట్టింది.

ఈ ఫలితం బీజేపీని సందిగ్ధంలో పడేసినట్టైంది. జనసేనతో పొత్తు ఉందని వార్తలు ఉన్నా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసైనికులు బీజేపీకి బదులుగా టీడీపీ అభ్యర్థిని ఎంచుకున్నారు. ఇప్పటికీ ఆ పార్టీ రాష్ట్రంలోని ఎన్నికల్లో తడబడుతోంది. ఓ రకంగా బీజేపీ ఆలోచనలో పడింది.

ఈ ఫలితాలు ప్రజల మానసిక స్థితికి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యావంతులైన ఓటర్లు, టీడీపీ-జనసేన మధ్య కుదిరిన రహస్య అవగాహన ఒప్పందంగా చర్చ ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీల అధికారిక కలయికకు ఛాన్స్ ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయి.

మొత్తంమీద ఫలితాలు టీడీపీ, జనసేన కూటమి ఆకట్టుకునే ప్రదర్శనను చూపిస్తాయని చర్చ నడుస్తోంది. ఇది YSRCPకి హెచ్చరికగా వెళ్తోంది. పవన్ కళ్యాణ్‌పై విశ్వాసం ఉంచిన BJPకి కూడా ఒక సందేశం వెళ్లినట్టైంది. దాదాపు టీడీపీ-జేఎస్పీ ఏకతాటిపైకి వచ్చిన ఈ ఫలితాలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో ఆలోచన చేసి JSP-TDP కూటమిలో చేరేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తుందా? లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా నిలబడుతుందా?

పవన్ ను చాలా కాలం పాటు విస్మరించడం ద్వారా BJP ఎక్కడో తప్పు చేసినట్టుగా కనిపించింది. అది ఇప్పుడు టీడీపీలో చేరాలనే పవన్ సూచనలకు కట్టుబడి ఉండవచ్చు లేదా రాష్ట్రంలో ఒంటరిగా ఉండవచ్చు. ఎందుకంటే MLC ఫలితాలను బట్టి టీడీపీ పొత్తును పవన్ ఇష్టపడవచ్చు. YSRCP తీవ్రంగా ప్రచారం చేసినప్పటికీ.. విద్యావంతుల మద్దతును పొందడంలో విఫలమైంది.

ఎక్కువ ప్రచారం పొందిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపలేదని కూడా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నాలుగేళ్ల పాలనతో పాటు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సంక్షేమ పథకాలతో విద్యావంతులైన యువత సంతోషంగా లేరని అర్థమవుతోంది. సంక్షేమ పథకాలు ఎన్నికల ఫలితాల్లో పాజిటివ్ గా రాలేకపోవచ్చని, పేదల అనుకూల ఇమేజ్‌పైనే ఆధారపడితే 175 సీట్ల లక్ష్యం ఎండమావిగా మారుతుందని ఈ ఫలితాలు వైఎస్‌ జగన్‌కు సందేశాన్నిచ్చాయి. .

ప్రస్తుత MLC ఎన్నికల ఫలితాలు కొన్ని ప్రశ్నలు సంధించాయి: ప్రజలు ఇప్పటికీ జగన్ ప్రభుత్వం పట్ల సంతోషంగా లేరా? రాబోయే ఎన్నికల్లో అధికార మార్పును కోరుకుంటున్నారా? గత ఎన్నికల్లో CBN ఎదుర్కొన్న విధంగా జగన్ ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యతిరేక ముప్పు వస్తుందా?

గత నాలుగేళ్ళలో జగన్ పాలనలో ప్రజాభిమానం వైపు మొగ్గు చూపడం, అభివృద్ధి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదని చర్చ ఉంది. పేదల అనుకూల ప్రతిష్టపైనే ఆధారపడటం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, మధ్యతరగతి, విద్యావంతులను పూర్తిగా దూరం చేస్తుందనడంలో సందేహం లేదు.

దీనికితోడు అనేక షరతులలో సంక్షేమ కార్యక్రమాల నుంచి చాలా మందిని తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల అమరావతి రాజధాని, పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది.

వన్ మ్యాన్ షోలా పని చేసే జగన్ శైలి టీమ్‌వర్క్‌ను నాశనం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇదే పార్టీని విచ్ఛిన్నం చేసిందని కొంతమంది అంటారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇది పార్టీ నాయకులను, శాసనసభ్యులను, మంత్రులను తగ్గిస్తుందని ఆరోపణ ఉంది.

ఒంటరిగా పోటి చేయాలని YSRCP ఎప్పటి నుంచో టీడీపీకి సవాళ్లు విసురుతోంది. ఇలాంటి హెచ్చరికల మధ్య ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి జాగ్రత్త వహించారు CBN. అయితే సాయం చేసేందుకు JSP ఉందని గ్రహించి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇప్పుడు ఊపిరి తీసుకోవచ్చు టీడీపీ. 2019 ఎన్నికల వంటి మరో ఎన్నికల ఎదురుదెబ్బను దీని ద్వారా నివారించొచ్చు.

తనను సీఎం చేయాలనే డిమాండ్‌తో సహా సీట్ల పంపకంలో పెద్దగా చెప్పుకోదగ్గ స్థితిలో ఉన్నానని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. అయితే ఎమ్మెల్సీ ఫలితాలతో పవన్ కొంచెం అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పుడు ఊహించని విజయాన్ని టీడీపీ రుచి చూసింది. కూటమికి ముఖ్యమంత్రిగా ఉండాలనే పవన్ డిమాండ్‌ను తోసిపుచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు ఉల్లాసంగా ఉన్నప్పటికీ, ఊహించని ఎన్నికల అదృష్టం తర్వాత ఫలిస్తుందో లేదో చూడాలి. పేదల పక్షపాతిగా జగన్ వ్యక్తిగత ఇమేజ్ ఇప్పటికీ SCలు, మైనారిటీలు, OBCలలోని కొన్ని వర్గాలలో ప్రభావితం కాలేదని వాదనలు ఉన్నాయి.

MLC ఎన్నికల ఫలితాల కారణంగా వైసీపీకి ఎదురుదెబ్బతో ప్రజల మూడ్‌ మారినా.., మారకపోయినా, అది వైఎస్ జగన్‌కు కాస్త నెగెటివ్ సందేశాన్ని అందజేస్తుంది. అతి విశ్వాసం నుండి బయటపడటానికి ఇది సమయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. చంద్రబాబు, పవన్ ఆత్మవిశ్వాసంతో ఉండటానికి ఓ అవకాశం దొరికింది. TDP-JSP కూటమిలో చేరడంపై BJP పునరాలోచించడానికి ఒక కారణాన్ని అందించింది.

Whats_app_banner

సంబంధిత కథనం