ApMlcElections: నేడే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు..ఓటింగ్‌పై పార్టీల్లో టెన్షన్-ap mlc elections polling for seven mlc seats in andhra pradesh today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Mlc Elections Polling For Seven Mlc Seats In Andhra Pradesh Today

ApMlcElections: నేడే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు..ఓటింగ్‌పై పార్టీల్లో టెన్షన్

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 05:50 AM IST

ApMlcElections: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మరికాసేట్లో జరుగనున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు స్థానాలకు అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఎన్నిక నేడే
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఎన్నిక నేడే

ApMlcElections: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల మధ్య ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం పోలింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కోసం ఇప్పటికే అధికార పార్టీ పలుమార్లు మాక్ పోలింగ్ నిర్వహించింది. అసెంబ్లీ సమావేశాల్లో పలు దఫాలుగా నిర్వహించిన పోలింగ్ ప్రక్రియలో కొందరు ఎమ్మెల్యేలు పొరపాట్లు చేయడంతో పలుమార్లు మాక్ పోలింగ్ నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

అసెంబ్లీలో నిర్వహించిన మాక్ పోలింగ్ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు పొరపాట్లు చేశారు. దీంతో గురువారం జరిగే పోలింగ్‌‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త పడుతున్నారు. బుధవారం రాత్రికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు విజయవాడ చేరుకున్నారు. నగరంలోని పలు హోటళ్లలో వారికి బస ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు చేయి జారిపోతారనే భయం వైసీపీని వేధిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 175మంది సభ్యులున్నారు. వీరిలో 151మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి అధికారికంగా 23మంది సభ్యులు ఉండగా, జనసేనకు మరొకరు ఉన్నారు. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలను ఏడు బృందాలుగా విభజించారు. ఒక్కో బృందంలో 22మంది ఎమ్మెల్యేలను ఉంచారు. వారంతా ఖచ్చితంగా పోలింగ్‌లో పాల్గొనేలా చూస్తున్నారు.

వైసీపీకి సొంతంగా గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మరో నలుగురు టీడీపీ సభ్యుల బలం కూడా ఉంది. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్‌, రాపాక వరప్రసాద్ టీడీపీ, జనసేన తరపున గెలిచినా అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారు.

టీడీపీకి ప్రస్తుతం 19మంది సభ్యుల బలమే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి గెలవడానినికి 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కానున్నాయి. టీడీపీకి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ తరపున పంచుమర్తి అనురాధ పోటీలో నిలిచారు.

అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ 1లో ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుంది. ఐదు గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. ఖాళీ అవుతున్న ఏడు స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా, టీడీపీ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది.

ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు కావాల్సిన బలాన్ని సమకూర్చుకునేందుకు టీడీపీ శ్రమిస్తోంది. చివరి నిమిషంలో అయినా తమకు కావాల్సిన మద్దతు దక్కుతుందని ఆ పార్టీ భావిస్తోంది. వైసీపీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేల రూపంలో తమకు గెలుపు లభిస్తుందనే ఆశ టీడీపీలో మిణుకుమిణుకుమంటోంది.

WhatsApp channel