Telugu News  /  Andhra Pradesh  /  Kotamereddy Sridhar Reddy Surrenders His Security For Reducing His Gun Mens By District Police
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamereddy Security : గన్‌మెన్‌లను సరెండర్ చేసిన కోటంరెడ్డి….

05 February 2023, 11:42 ISTHT Telugu Desk
05 February 2023, 11:42 IST

Kotamereddy Security నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి భద్రత కుదించడంపై భగ్గుమన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే నలుగురు గన్ మాన్ లలో ఇద్దరనీ తొలగించారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన కానుకకు తాను కూడా ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని ప్రకటించారు. తనకు కేటాయించిన ఇద్దరు గన్‌మెన్‌లు కూడా అవసరం లేదని, ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Kotamereddy Security ప్రభుత్వం భద్రతను కుదించడంపై భగ్గుమన్న కోటంరెడ్డి తనకు అసలు సెక్యూరిటీ అవసరం లేదని గన్‌మెన్‌లను తిప్పి పంపారు. గన్‌మెన్‌ల విషయంలో నెల్లూరు పోలీసులు అబద్ధాలు ఆడుతున్నారని, ట్యాపింగ్ విషయంలో తాను చేసిన ఆరోపణలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. మరింత కసితో ఇంకా ముందుకు పోతానని సవాల్ విసిరారు. కార్యకర్తలు, అభిమానులే రక్ష అని తాడో పేడు తేల్చుకుంటానని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

అంతకు ముందు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి భద్రతను అధికారులు కుదించారు. భద్రతా సిబ్బందిని 2+2 నుంచి 1+1కి తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పత్రంపై కోటంరెడ్డి సంతకం చేశారు. అటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కూడా పోలీసులు భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. పార్టీ వీడేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే భద్రత కుదించినట్లు ఆరోపిస్తున్నారు.

మరోవైపు పార్టీ నాయకులపై విమర్శలు చేసినందుకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. సజ్జలను విమర్శించినందుకు తనను బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి దూషించాడని, సజ్జల కోసం తనకు ఆడియో ​కాల్స్​ వస్తే నెల్లూరు నుంచి మీకు వీడియో కాల్స్ వస్తాయని హెచ్చరించారు. బెదిరింపు కాల్స్​ ఎన్ని వచ్చినా భయపడేదే లేదన్నారు. రికార్డు చేస్తున్నారని తెలిసినా మాట్లాడానని. తాను భయపడనని నన్ను, నా తమ్ముడిని కొట్టేసుకుంటూ తీసుకెళ్తారా, రండి చూద్దామన్నారు.

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల కోటరీ నుంచి బెదిరింపు కాల్‌ మాట్లాడాడని, వాళ్ళ మాటలకు బెదిరింపులకు వణికే వాళ్లం కాదన్నారు. ఇక నెల్లూరు రూరల్‌ నుంచి నేరుగా వీడియో కాల్స్‌ వస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. అవసరమైతే హత్యాయత్నం కేసు కూడా పెట్టుకోవాలన్నారు.

మంత్రి కాకాణిపై కూడా కోటంరెడ్డి మండిపడ్డారు. ''మంత్రి పదవిని ఇప్పించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శిస్తే కాకాణికి కోపం వచ్చినట్లుందన్నారు. కోర్టులో పోయిన ఫైల్స్ సంగతి చూసుకోవాలని కాకాణికి కోటంరెడ్డి సూచించారు.

మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోనే తమ ప్రయాణమని నెల్లూరు మేయర్‌ పొట్లూరి స్రవంతి ప్రకటించారు. అవసరమైతే నెల్లూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తానన్నారు. తాను కార్పొరేటర్‌, మేయర్‌గా తాను ఎదగడానికి కోటంరెడ్డే కారణమని స్పష్టం చేశారు. 'కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎటుంటే అటే నడుస్తామని తేల్చి చెప్పారు. శ్రీధర్ తోనే రాజకీయ ప్రయాణం' అని చెప్పారు.

టాపిక్