MLC Election Tension: ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో వైసీపీకి క్రాస్ ఓటింగ్ భయం..-ysrcp had cross voting fear in mla quota mlc elections and tdp has confidence on victory
Telugu News  /  Andhra Pradesh  /  Ysrcp Had Cross Voting Fear In Mla Quota Mlc Elections And Tdp Has Confidence On Victory
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీల్లో  టెన్షన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీల్లో టెన్షన్

MLC Election Tension: ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో వైసీపీకి క్రాస్ ఓటింగ్ భయం..

20 March 2023, 7:28 ISTHT Telugu Desk
20 March 2023, 7:28 IST

MLC Election Tension: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ పెద్దలు కంగారు పడుతున్నారు.ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లోను గెలిచి తీరాలని భావిస్తున్నా, ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలాల నేపథ్యంలో పరిస్థితులు ఎంత వరకు అనుకూలిస్తాయనే ఆందోళన ఆ పార్టీని వేధిస్తోంది.

MLC Election Tension: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పరాజయం పాలైన నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ చిన్న పొరపాటూ జరక్కుండా అధికార వైఎస్సార్సీపీ తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఈనెల 23న ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా ఉంచారని ప్రచారం జరుగుతుంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో గెలుపు కోసం ప్రత్యర్థులు గాలం వేస్తారనే అనుమానాలతో ఎవరు జారిపోకుండా జాగ్రత్త పడుతోంది.

అధికార పార్టీలో అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా అని జిల్లాలలో ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఖాళీలు ఉంటే పోటీలో ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు. అన్ని స్థానాలను గెలుచుకోవాలని వైసీపీ భావించినా చివరి నిమిషంలో అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ నామినేషన్ వేశారు.

మరోవైపు వైసీపీ నుంచి ఒక్క ఓటు చేజారినా ఫలితాలపై ప్రభావంచూపుతుందనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇప్పటికే ఆత్మ ప్రభోదానుసారం ఓటేస్తామని కోటంరెడ్డి, ఆనం ప్రకటించారు. వీళ్ళు కాక ఇంకెవరైనా ఉన్నారా అని ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరు పార్టీల ఎమ్మెల్సీలకు విప్ జారీ చేశారు. ఏడో స్థానాన్ని గెలుచుకోడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కాపాడుకోడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది.

ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు…

వైసీపీ తరఫున బరిలో దింపిన ఏడుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికీ 22మంది ఎమ్మెల్యేల చొప్పున కేటాయించారు.. వీరిని ఏడు బృందాలుగా విభజించి ప్రతి బృందానికీ ఓ ఎమ్మెల్యేను సమన్వయకర్తగా నియమించారు. టీడీపీ తరఫున గెలుపొంది తర్వాత వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన నుంచి గెలిచి ప్రస్తుతం రాజోలు వైకాపా సమన్వయకర్తగా ఉన్న రాపాక వరప్రసాద్‌ను కూడా వైసీపీ బృందాల్లో సభ్యులుగా చేర్చినట్లు తెలిసింది.

అటు వైఎస్సార్సీపీని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిలను జాబితాల్లోకి తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులవారీగా విభజించిన ఎమ్మెల్యేల బృందాల్లో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు ఉండేలా విభజించారు. ఆదివారం ఈ ఏడు బృందాలు వేర్వేరుగా మాక్‌ పోలింగ్‌లో పాల్గొన్నాయి.

ఎమ్మెల్సీలకు మాక్ పోలింగ్….

ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఈ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో బృందాల్లోని ఎమ్మెల్యేలతో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు.

నమూనా బ్యాలెట్‌పై ఓట్లను సక్రమంగా వేశారా లేదా అనే వివరాలను పరిశీలించారు. శనివారం నిర్వహించిన మాక్‌ పోలింగ్‌లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పొరపాట్లు చేసినట్లు గుర్తించారు. ఇలాంటి పొరపాట్లు 23న జరిగే అసలైన పోలింగ్‌లో దొర్లితే ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఆదివారం అభ్యర్థుల వారీగా మళ్లీ మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు ఓటింగ్‌పై అవగాహన కల్పించారు. సోమవారం మరోసారి పూర్తిస్థాయిలో మాక్‌పోలింగ్‌ చేపట్టనున్నారు. 23న పోలింగ్‌ నేపథ్యంలో 22న రాత్రి ఎమ్మెల్యేలందరితో విందు భేటీని నిర్వహించనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కావడంతోో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరి కదలికలను ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కష్టం అనే పరిస్థితి ఉన్నవారు, పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించిన నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీపై అసంతృప్తితో ఉన్నవారు, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండని వారు.. ఇలా పలు కారణాలతో కొందరిపై వైకాపా అధిష్ఠానం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే, ఇంకొందరు ఇంటెలిజెన్స్‌ పర్యవేక్షణలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు టీడీపీ మాత్రం ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పోటీకి దింపిన అభ్యర్ధి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.