తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final Pitch: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు పిచ్‌లు.. ఇదీ కారణం

WTC Final Pitch: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు పిచ్‌లు.. ఇదీ కారణం

Hari Prasad S HT Telugu

07 June 2023, 8:28 IST

google News
    • WTC Final Pitch: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు పిచ్‌లు తయారు చేయించింది ఐసీసీ. దీని వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బుధవారం (జూన్ 7) నుంచి ఈ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోయే ది ఓవల్ గ్రౌండ్
డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోయే ది ఓవల్ గ్రౌండ్ (Action Images via Reuters)

డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోయే ది ఓవల్ గ్రౌండ్

WTC Final Pitch: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఐసీసీ రెండు పిచ్‌లను తయారు చేయించింది. ఇంగ్లండ్ లో శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ జరిగే ఓవల్ పిచ్ ను ధ్వంసం చేస్తామని కూడా ఆందోళనకారులు హెచ్చరించారు.

దీంతో ముందు జాగ్రత్తగా ఐసీసీ రెండు పిచ్‌లను తయారు చేయించింది. కొత్తగా శిలాజ ఇంధనాలు ఉత్పత్తి చేయడం, లైసెన్సులు ఇవ్వడం వెంటనే నిలిపేయాలని ఈ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల ఆందోళనలు లండన్ లో జరుగుతున్న ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముప్పుగా పరిణమించాయి. మ్యాచ్ జరుగుతున్న కెన్నింగ్టన్ ఓవల్ మైదానం దగ్గర భద్రతను భారీగా పెంచారు.

ఇక ప్రత్యామ్నాయ పిచ్ తయారు చేయించడానికి ఐసీసీ తమ ప్లేయింగ్ కండిషన్స్ లోని సెక్షన్ 6.4కు కూడా మార్పులు చేయడం గమనార్హం. ఒకవేళ ప్రస్తుతం ఆడుతున్న పిచ్ కు ఏదైనా జరిగితే.. ముందుగా దాని పరిస్థితిని అంచనా వేస్తారు. దానిపై ఆట కొనసాగించవచ్చా లేదా అన్నది చూస్తారు. ఒకవేళ పిచ్ బాగానే ఉంటే కొనసాగిస్తారు. లేదంటే ముందుగానే సిద్ధం చేసిన మరో పిచ్ ను పరిశీలించి దానిపై ఆటను కొనసాగిస్తారు.

ఈ విషయంలో ఇండియా, ఆస్ట్రేలియా కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ ఇద్దరి అనుమతీ తీసుకున్నారు. ఒకవేళ పిచ్ దెబ్బతింటే ఇద్దరు కెప్టెన్ల అనుమతితో మరో పిచ్ పై మ్యాచ్ కొనసాగిస్తారు. లేదంటే రద్దు చేస్తారు. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి జూన్ 11 వరకూ జరగనుంది. ఒకవేళ వర్షం కురిస్తే మ్యాచ్ ఫలితం కోసం రిజర్వ్ డే కూడా ఉంటుంది.

ఓవల్ మైదానం 140 ఏళ్ల చరిత్రలో జూన్ లో టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. దీంతో ఇక్కడి పిచ్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా బౌన్స్, స్వింగ్ కు ఇంగ్లండ్ పిచ్, కండిషన్స్ అనుకూలిస్తాయి. ఓవల్ కూడా అందుకు భిన్నమేమీ కాదు. అయితే ఈ పిచ్ మరింత తాజాగా కనిపిస్తుండటంతో బౌన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తదుపరి వ్యాసం