Wtc Final Oval Records: ఓవల్‌లో ఆస్ట్రేలియాకు చెత్త రికార్డ్ - లోయెస్ట్ సక్సెస్ రేట్ ఇక్కడే
01 June 2023, 16:12 IST
Wtc Final Oval Records: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా జరుగనున్నది. కాగా ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియా సక్సెస్‌రేట్ తక్కువగా ఉండటం అభిమానులను కలవరపెడుతోంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
Wtc Final Oval Records: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ ) ఫైనల్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరుగనున్న సంగతి తెలిసింది. ఈ ఫైనల్ కోసం ఒకరిద్దరూ మినహా టీమ్ ఇండియా మెయిన్ ప్లేయర్స్ అందరూ ఇంగ్లాండ్ చేరుకున్నారు. అందరికంటే ముందుగానే ఇంగ్లాండ్ బయలుదేరిన కోహ్లి, రోహిత్‌శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్నారు. వారి నెట్‌ప్రాక్టీస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజేత ఎవరన్నది క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఫైనల్ మ్యాచ్ జరుగునున్న ఓవల్ పిచ్‌పై ఆస్ట్రేలియాకు మెరుగైన రికార్డ్ లేదు. ఇంగ్లాండ్‌లోని మిగిలిన స్టేడియాలతో పోలిస్తే ఓవల్‌లోనే ఆస్ట్రేలియా విజయాల శాతం అతి తక్కువగా ఉండటం గమనార్హం. ఓవల్ పిచ్‌పై గత యాభై ఏళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే ఆస్ట్రేలియా విజయాల్ని అందుకున్నది.
మొత్తంగా ఓవల్ స్టేడియంలో 38 టెస్ట్‌లు ఆడిన ఆస్ట్రేలియా కేవలం ఏడింటిలో మాత్రమే విజయాల్ని అందుకున్నది. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా సక్సెస్ రేటు 18. 42 శాతం మాత్రమే కావడం గమనార్హం. లార్డ్స్‌లో ఆస్ట్రేలియా సక్సెస్ రేటు 39.72 శాతం ఉంది. హెడింగ్లేలో 34, ట్రెండ్‌బ్రిడ్జ్‌లో 30 శాతం సక్సెస్ రేటు ఉంది.
అన్నింటికంటే అతి తక్కువ సక్సెస్ రేటు ఓవల్ స్టేడియంలోనే ఉండటం ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. ఇండియా కూడా ఓవల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలోనే విజయాల్ని సాధించింది. చివరలో 2021లో 157 పరుగుల భారీ ఆధిక్యంతో ఇండియా విజయాన్ని సాధించడం ఊరటనిచ్చే అంశంగా ఫ్యాన్స్ భావిస్తోన్నారు.