Kumble on Rayudu: అంబటి రాయుడుకి కోహ్లి, రవిశాస్త్రి అన్యాయం చేశారు: కుంబ్లే షాకింగ్ కామెంట్స్
Kumble on Rayudu: అంబటి రాయుడుకి కోహ్లి, రవిశాస్త్రి అన్యాయం చేశారంటూ కుంబ్లే షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2019 వరల్డ్ కప్ లో రాయుడు కచ్చితంగా ఉండాల్సిందని ఈ టీమిండియా మాజీ కోచ్ అన్నాడు.
Kumble on Rayudu: హైదరాబాద్ బ్యాటర్ అంబటి రాయుడు ఇక క్రికెట్ ఫీల్డ్ లో కనిపించడు అన్న విషయం తెలుసు కదా. మొన్న ఫైనల్ తో ఐపీఎల్ కు కూడా రాయుడు గుడ్ బై చెప్పాడు. అయితే అతనికి ఉన్న టాలెంట్ కు, టీమిండియాలో వచ్చిన అవకాశాలకు అసలు పొంతనే లేదు. కెరీర్ తొలినాళ్లలో సచిన్ అంతటివాడు అవుతాడని అనుకున్నా.. తాను వేసిన తప్పటడుగులతో రాయుడుకి తగిన గుర్తింపు రాలేదు.
అయితే 2019 వరల్డ్ కప్ లో కచ్చితంగా ఆడతాడని అనుకున్నా.. చివరి నిమిషంలో అతన్ని కాదని విజయ్ శంకర్ కు అవకాశం ఇచ్చారు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఆడటానికి అతన్ని ఎంతో ముందుగానే సిద్ధం చేసినా.. తీరా వరల్డ్ కప్ సమయానికి పక్కన పెట్టారు. ఇప్పుడీ విషయాన్నే మరో మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తీవ్రంగా తప్పుబట్టాడు.
కోహ్లి, శాస్త్రి చేసిన అతి పెద్ద తప్పు అదే అని కుంబ్లే స్పష్టం చేశాడు. "రాయుడు 2019 వరల్డ్ కప్ కచ్చితంగా ఆడాల్సింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అది చాలా పెద్ద తప్పు. చాలా కాలంగా అతన్ని ఆ రోల్ కోసం సిద్ధం చేశారు. తర్వాత జట్టులో నుంచి అతని పేరు కనిపించకుండా పోయింది. అది చాలా ఆశ్చర్యం కలిగించింది" అని ఐపీఎల్ ఫైనల్ తర్వాత జియో సినిమాలో మాట్లాడుతూ కుంబ్లే అన్నాడు.
2018 సెప్టెంబర్ నుంచి 2019 మార్చి మధ్య కాలంలో టీమిండియా వన్డే టీమ్ నాలుగో స్థానంలో రాయుడు నిలకడగా రాణించాడు. వరల్డ్ కప్ లో ఆ స్థానం రాయుడిదే అని అందరూ భావించారు. కానీ తీరా టోర్నీ కోసం టీమ్ ఎంపిక సమయంలో రాయుడు స్థానంలో ఆల్ రౌండర్ కావాలంటూ విజయ్ శంకర్ ను తీసుకున్నారు. ఆ నాలుగో నంబర్ లో సరైన ప్లేయర్ లేకపోవడం 2019 వరల్డ్ కప్ లో టీమిండియా కొంప ముంచింది.
ఇండియన్ టీమ్ తరఫున రాయుడు 55 వన్డేలు, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. 2018 ఐపీఎల్లో 602 పరుగులు చేసిన తర్వాత అతడు టీమిండియా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఆరు నెలల కాలంలో 21 వన్డేలు కూడా ఆడాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 639 రన్స్ చేశాడు. అంత బాగా రాణించినా కూడా వరల్డ్ కప్ జట్టులో రాయుడికి అవకాశం ఇవ్వకపోవడం అతనికే కాదు ఎవరికీ మింగుడు పడలేదు.
తనను ఎంపిక చేయకపోవడంపై అలిగిన రాయుడు రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. తర్వాత మళ్లీ మనసు మార్చుకున్నాడు. విజయ్ శంకర్ 3డీ ప్లేయర్ అని అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అనడంపై రాయుడు ఓ సెటైర్ కూడా వేశాడు. వరల్డ్ కప్ చూడటానికి 3డీ గ్లాసెస్ కొన్నాను అని రాయుడు ట్వీట్ చేయడం విశేషం. ఆ తర్వాత రాయుడు ఎప్పుడూ మళ్లీ ఇండియాకు ఆడలేదు. అతని అంతర్జాతీయ కెరీర్ అర్దంతరంగా ముగిసిపోయింది.
సంబంధిత కథనం