Ben Stokes on Ashes: యాషెస్‌లోనూ ఆస్ట్రేలియాను బజ్‌బాల్‌తోనే కొడతాం: బెన్ స్టోక్స్-ben stokes on ashes says they will stick to bazball style of cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ben Stokes On Ashes: యాషెస్‌లోనూ ఆస్ట్రేలియాను బజ్‌బాల్‌తోనే కొడతాం: బెన్ స్టోక్స్

Ben Stokes on Ashes: యాషెస్‌లోనూ ఆస్ట్రేలియాను బజ్‌బాల్‌తోనే కొడతాం: బెన్ స్టోక్స్

Hari Prasad S HT Telugu
May 31, 2023 10:02 PM IST

Ben Stokes on Ashes: యాషెస్‌లోనూ ఆస్ట్రేలియాను బజ్‌బాల్‌తోనే కొడతామని అన్నాడు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు ముందు ఐర్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది ఇంగ్లండ్ టీమ్.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (AFP)

Ben Stokes on Ashes: టెస్ట్ క్రికెట్ కు ఇంగ్లండ్ నేర్పిన స్టైల్ బజ్‌బాల్. కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వచ్చిన తర్వాత ఆ టీమ్ టెస్ట్ క్రికెట్ ను కూడా టీ20ల్లాగా ఆడేస్తోంది. ఈ స్టైల్ తోనే ప్రత్యర్థులను వరుసగా చిత్తు చేస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లోనూ ఆస్ట్రేలియాను తాము ఈ బజ్‌బాల్ తోనే కొడతామని కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పాడు.

గత 12 మ్యాచ్ లలో 10 మ్యాచ్ లను ఇంగ్లండ్ ఈ స్టైల్లోనే గెలిచింది. జూన్ 16 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే అంతకుముందు గురువారం (జూన్ 1) నుంచి ఐర్లాండ్ తో నాలుగు రోజుల టెస్టు జరగనుంది. దీంతో యాషెస్ సిరీస్ కు కూడా తమ టీమ్ ప్రస్తుత వ్యూహానికే కట్టుబడి ఉండాలని కెప్టెన్ స్టోక్స్ పిలుపునిచ్చాడు.

"ఇదే కొనసాగతుందా అన్న ప్రశ్నకు నాకు నేనే సమాధానం ఇచ్చుకుంటున్నాను. ఓ జట్టుగా, వ్యక్తులుగా మాలోని అత్యుత్తమ ఆటతీరు కనబరచడానికి ఓ మార్గాన్ని మేము కనుగొన్నామన్నది స్పష్టం. అందులో విజయాన్ని రుచి చూశాం. ఇది ప్రతిసారీ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు గెలుస్తాం. ఓడుతాం. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ప్లేయర్స్ కు సరిపడే ఓ కొత్త ఫార్ములాను మేము కనిపెట్టాం. ప్రత్యర్థిని బట్టి అది మారదు" అని స్టోక్స్ స్పష్టం చేశాడు.

2021-22 సీజన్ లో ఆస్ట్రేలియా గడ్డపై ఇదే యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ 0-4తో కోల్పోయింది. 17 నెలల తర్వాత ఇప్పుడు తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇంగ్లండ్ కు వచ్చింది. అయితే అప్పటి ఇంగ్లండ్ టీమ్ కు, ఇప్పటి టీమ్ కు అసలు పొంతనే లేదు. బజ్‌బాల్ స్టైల్ దూకుడైన ఆటతీరుతో టెస్టుల్లోనూ ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధిస్తోంది.

యాషెస్ సిరీస్ ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, ఈ సిరీస్ కోసం తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు స్టోక్స్ చెప్పాడు. ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం లేదని, అయితే తాము తమ ఆటపైనే ద్రుష్టి సారిస్తున్నట్లు తెలిపాడు.

Whats_app_banner

సంబంధిత కథనం