Bazball: ఇంగ్లండ్‌ ఆడుతున్న సరికొత్త క్రికెట్‌.. అసలేంటిది? టెస్ట్‌ క్రికెట్‌ను ఎలా మార్చబోతోంది?-what is bazball that changed england cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bazball: ఇంగ్లండ్‌ ఆడుతున్న సరికొత్త క్రికెట్‌.. అసలేంటిది? టెస్ట్‌ క్రికెట్‌ను ఎలా మార్చబోతోంది?

Bazball: ఇంగ్లండ్‌ ఆడుతున్న సరికొత్త క్రికెట్‌.. అసలేంటిది? టెస్ట్‌ క్రికెట్‌ను ఎలా మార్చబోతోంది?

Hari Prasad S HT Telugu
Jul 06, 2022 02:45 PM IST

Bazball: ఈ మధ్య క్రికెట్‌లో బాగా వినిపిస్తున్న పదం ఇది. ఇంగ్లండ్ టీమ్ పరిచయం చేసిన ఈ బజ్‌బాల్‌ క్రికెట్‌పై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ స్టైల్‌తోనే ఆ టీమ్‌ భారీ స్కోర్లను కూడా సులువుగా చేజ్‌ చేస్తోంది.

<p>ఇంగ్లండ్ క్రికెట్ కు దూకుడు నేర్పిన కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ జోడీ</p>
ఇంగ్లండ్ క్రికెట్ కు దూకుడు నేర్పిన కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ జోడీ (Action Images via Reuters)

న్యూఢిల్లీ: టెస్ట్‌ క్రికెట్‌లో కొన్నాళ్ల కిందట వరకూ ఇంగ్లండ్‌ పరిస్థితి దారుణంగా ఉండేది. యాషెస్‌ సిరీస్‌లో ఘోర ఓటమి తర్వాత అటు కెప్టెన్‌, ఇటు కోచ్‌ ఇద్దరూ మారిపోయారు. కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌, దూకుడుకు మారుపేరైన బ్రెండన్‌ మెకల్లమ్‌ వచ్చాడు. కొత్తగా కెప్టెన్‌ అయిన బెన్‌ స్టోక్స్‌ స్టైల్ కూడా అదే. ఈ ఇద్దరూ కలిసి ఇంగ్లండ్‌ క్రికెట్‌నే మార్చేశారు. 1990, 2000నాటి ఆస్ట్రేలియా టీమ్‌ను గుర్తు చేస్తూ టెస్ట్‌ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది.

వరల్డ్‌ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌పై భారీ స్కోర్లును సులువుగా చేజ్‌ చేసి మూడు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆ టీమ్‌.. ఇప్పుడు ఇండియాపైనా 378 రన్స్‌ భారీ టార్గెట్‌ను మంచినీళ్లు తాగినంత ఈజీగా కొట్టేసింది. దీనికే ఇప్పుడు బజ్‌బాల్‌ (Bazball) స్టైల్‌ క్రికెట్‌ అని పేరు పెట్టారు. ఈ ఏడాది మేలోనే ఇంగ్లండ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టిన మెకల్లమ్‌ తన స్టైల్‌ను టీమ్‌కు అలవాటు చేయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకోలేదు.

అటాకింగ్‌ మెంటాలిటీతో బౌలర్లపై ఒత్తిడి పెంచడం ఇప్పుడు ఇంగ్లండ్‌ బ్యాటర్లు అలవర్చుకున్న స్టైల్‌. అతని రాకకు ముందు 17 టెస్టుల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఇంగ్లండ్‌.. మెకల్లమ్‌ వచ్చిన తర్వాత నాలుగు టెస్టులూ గెలిచింది. టెస్ట్‌ క్రికెట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసి.. మ్యాచ్‌పై పట్టు బిగించడం చాలా టీమ్స్‌ పాటించే స్టైల్‌. కానీ ఇంగ్లండ్‌ రూట్‌ మాత్రం సెపరేటుగా ఉంది.

న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లోనూ 277, 299, 296 టార్గెట్లను చేజ్‌ చేసిన ఆ టీమ్‌.. ఇండియాపై ఏకంగా 378ను కూడా సాధించేసింది. న్యూజిలాండ్‌పై సిరీస్‌తో బజ్‌బాల్‌ పదం వాడటం మొదలుపెట్టిన క్రికెట్ పండితులు.. ఇండియాపై గెలిచిన తర్వాత దీనిని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

అసలేంటీ బజ్‌బాల్‌ (Bazball)?

టెస్ట్‌ క్రికెట్‌ అంటే చాలా నెమ్మదిగా సాగే ఫార్మాట్‌. కానీ ఈ ఫార్మాట్‌లోనూ దూకుడుగా ఆడి రన్స్‌ చేయడం ఈ బజ్‌బాల్‌ స్టైల్‌. బ్రెండన్‌ మెకల్లమ్‌ తాను ఆడే రోజుల్లో ఎలా అయితే దూకుడుగా ఉంటూ బౌలర్లపై ఒత్తిడి తెచ్చేవాడో.. ఇప్పుడు టీమ్‌కు కూడా అదే నేర్పిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల తమపై ఉన్న ఒత్తిడిని మెల్లగా ప్రత్యర్థిపైకి వెళ్తోంది. ఇంగ్లండ్‌ వరుసగా నాలుగు టెస్టుల్లోనూ ఈ బజ్‌బాల్‌ స్టైల్‌తోనే విజయాలు సాధించింది. ఏది ఏమైనా గెలవాలన్న దృక్పథమే ఈ స్టైల్‌ సీక్రెట్‌.

ఆ టెస్ట్‌తోనే బజ్‌బాల్‌ (Bazball) మొదలు

ఇంగ్లండ్ క్రికెట్‌లో ఈ బజ్‌బాల్ ప్రారంభమైంది న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లోనే. ఆ మ్యాచ్‌లోనే 69 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయిన దశలో ఓవైపు జో రూట్‌ జాగ్రత్తగా ఆడుతూ సెంచరీ చేయగా.. మరోవైపు బెన్‌ స్టోక్స్‌ (90) దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఇక రెండో టెస్ట్‌లో 299 రన్స్‌ టార్గెట్‌నూ ఇదే స్టైల్లో చేజ్‌ చేశారు. ఆ చేజింగ్‌లో బెయిర్‌స్టో కేవలం 77 బాల్స్‌లోనే 136 రన్స్‌ చేయగా.. కెప్టెన్‌ స్టోక్స్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 553 రన్స్‌ చేసినా చివరికి ఓటమి తప్పలేదు.

మూడో టెస్ట్‌లోనూ అదే తీరు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 17 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మరోసారి బెయిర్‌స్టో 157 బాల్స్‌లోనే 162 రన్స్‌ చేసి ఇంగ్లండ్‌కు 360 స్కోరు అందించాడు. ఇక 296 రన్స్‌ చేజింగ్‌లో ఓలీ పోప్‌ (82), జో రూట్‌ (86) హాఫ్‌ సెంచరీలతో కేవలం 54 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ మ్యాచ్‌ను ముగించింది. తాజా ఇండియాపైనా ఈ బజ్‌బాల్‌ స్టైల్‌తోనే 378 రన్స్‌ను 76.4 ఓవర్లలోనే చేజ్‌ చేసింది. ఈసారి కూడా బెయిర్‌స్టో, రూట్‌ సెంచరీలతో చెలరేగారు.

ఒకప్పుడు టెస్ట్‌ క్రికెట్‌కు కూడా దూకుడు నేర్పిన టీమ్‌గా ఆస్ట్రేలియాకు పేరుండేది. లాంగర్‌, హేడెన్‌, గిల్‌క్రిస్ట్‌, పాంటింగ్‌లాంటి వాళ్లు ప్రత్యర్థులను చీల్చి చెండాడి ఉక్కిరిబిక్కిరి చేసేవారు. ఇప్పుడు ఇంగ్లండ్‌ కూడా అప్పటి ఆస్ట్రేలియాను తలపిస్తూ టెస్ట్‌ క్రికెట్‌లో దూకుడును మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఈ బజ్‌బాల్‌ స్టైల్‌ను మిగతా టీమ్స్‌ కూడా అందిపుచ్చుకుంటే సాంప్రదాయ క్రికెట్‌కు ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదని కచ్చితంగా చెప్పొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం