IPL franchises: మీ టీమ్ వదిలేసి రండి.. కోట్లు ఇస్తాం: ఆరుగురు ఇంగ్లండ్ ప్లేయర్స్‌కు ఐపీఎల్ ఫ్రాంఛైజీల గాలం
IPL franchises: మీ టీమ్ వదిలేసి రండి.. కోట్లు ఇస్తాం అంటూ ఇంగ్లండ్ ప్లేయర్స్ కు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు గాలం వేస్తున్నాయి. క్రికెట్ ను కూడా మెల్లగా ఫుట్‌బాల్ లాగా చేసే దిశగా ఈ ఫ్రాంఛైజీల ఓనర్లు ప్రయత్నిస్తున్నారు.
IPL franchises: ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. ఇందులో ఆడటానికి ఎలాంటి ప్లేయర్ అయినా ఆసక్తి చూపుతాడు. ముఖ్యంగా వేలంలో కోట్ల ధర పలికే మరో లీగ్ ఎక్కడా లేదు. ఇప్పటికే ఈ లీగ్ వల్ల తమ అంతర్జాతీయ కెరీర్లను కొందరు ముందుగానే వదిలేశారు. తాజాగా ఆరుగురు ఇంగ్లండ్ ప్లేయర్స్ కు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు గాలం వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ది టైమ్స్ లండన్ రిపోర్టు ప్రకారం.. ఒక్కో ప్లేయర్ కు 50 లక్షల పౌండ్ల వరకూ ఈ ఫ్రాంఛైజీలు ఆఫర్ ఇస్తున్నాయట. అంటే మన కరెన్సీ ప్రకారం ఏడాదికి సుమారు రూ.50 కోట్లు. కేవలం ఐపీఎల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఏడాది పొడుగునా జరిగే వివిధ లీగ్స్ లో ఆ ప్లేయర్స్ పాల్గొనేలా ఒప్పందం కుదర్చుకోవాలన్నది ఈ ఫ్రాంఛైజీల ఆలోచన.
ఏడాదంతా లీగ్స్‌లోనే..
ఈ ఫ్రాంఛైజీలకు ఒక్క ఐపీఎల్లోనే కాకుండా సౌతాఫ్రికా, యూఏఈ, అమెరికాలోని లీగ్స్ లో కూడా టీమ్స్ ఉన్నాయి. ఐపీఎల్ రెండు నెలలుగా కాకుండా మిగతా సమయంలో ఆయా లీగ్స్ లో ఆడించాలని ఫ్రాంఛైజీలు చూస్తున్నట్లు ది టైమ్స్ వెల్లడించింది. ఇక సౌదీ కూడా మరో భారీ లీగ్ కు ప్లాన్ చేస్తోంది. ఇందులోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఐపీఎల్లోని పది ఫ్రాంఛైజీలు అదే పనిలో ఉన్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఆరుగురు ఇంగ్లండ్ ప్లేయర్స్ తో సంప్రదింపులు కూడా జరిగాయట. ఈసీబీ లేదా ఇంగ్లిష్ కౌంటీని వదిలేసి పూర్తిగా ఓ ఇండియన్ ఫ్రాంఛైజీ దగ్గర చేరిపోయేలా ఒప్పందం కుదుర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఏడాదంతా ఇలాంటి లీగ్స్ లోనే ప్లేయర్స్ ఆడితే.. ఇక భవిష్యత్తులో ఏ ప్లేయర్ కూడా తమ నేషనల్ టీమ్ కు ఆడే పరిస్థితి ఉండదు.
ఫుట్‌బాల్ దారిలో..
ప్రస్తుతం ఫుట్‌బాల్ లో ఇదే పరిస్థితి ఉంది. టాప్ ప్లేయర్సంతా ఏడాది మొత్తం తమ క్లబ్స్ కే ఆడుతుంటారు. వరల్డ్ కప్, యూరో కప్, కోపా అమెరికాలాంటి టోర్నీల్లోనే నేషనల్ టీమ్స్ కు ఆడతారు. ఫుట్‌బాల్ లో రెండు దేశాల మధ్య ఆట అసలే ఉండదు. రానురాను క్రికెట్ ను కూడా అదే దిశగా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోట్ల ఆశ చూపిస్తూ ఉంటే.. ఇక ఏ యువ క్రికెటర్ కూడా తమ దేశానికి ఆడటానికి ముందుకు రాడు.
నిజానికి ఐసీసీ కూడా ఈ ఫ్రాంఛైజీ క్రికెట్ పై పరిమితి విధించాలన్న ఆలోచనలో ఉంది. ఒక ప్లేయర్ పరిమిత స్థాయిలోనే లీగ్స్ లో ఆడాలన్న నిబంధన తీసుకురావాలని భావిస్తోంది. అయితే అలా చేస్తే భవిష్యత్తులో మరింత మంది యువ క్రికెటర్లు ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించి ఫ్రీ ఏజెంట్లుగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ లీగ్స్ ను నియంత్రించడం ఐసీసీకి కూడా సవాలుగా మారనుంది.
సంబంధిత కథనం