ఫుట్‌బాల్‌లాగా క్రికెట్‌ ఎందుకు పాపులర్‌ కాలేకపోయింది? కొన్ని దేశాల్లోనే ఎందుకు?-why cricket is not as much popular as football in the world ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  ఫుట్‌బాల్‌లాగా క్రికెట్‌ ఎందుకు పాపులర్‌ కాలేకపోయింది? కొన్ని దేశాల్లోనే ఎందుకు?

ఫుట్‌బాల్‌లాగా క్రికెట్‌ ఎందుకు పాపులర్‌ కాలేకపోయింది? కొన్ని దేశాల్లోనే ఎందుకు?

Hari Prasad S HT Telugu
Dec 21, 2021 04:25 PM IST

ఇంగ్లండ్‌లోనూ ఫుట్‌బాల్‌ తర్వాతే క్రికెట్‌. మరి ఇండియాలో ఓ మతంగా చూసే క్రికెట్‌కు ప్రపంచంలో ఎందుకీ దుస్థితి? ఫుట్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదా? క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంలో ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌ విఫలమైందా? ఫుట్‌బాల్‌ను ఫిఫా ఎలా ఇంతలా పాపులర్‌ చేసింది?

ఇండియాలాంటి చాలా కొన్ని దేశాల్లోనే క్రికెట్‌కు ఈ స్థాయి అభిమానం
ఇండియాలాంటి చాలా కొన్ని దేశాల్లోనే క్రికెట్‌కు ఈ స్థాయి అభిమానం (AFP)

క్రికెట్‌, ఫుట్‌బాల్‌.. ప్రపంచంలో ఎక్కువ మంది అభిమానులు ఉన్న స్పోర్ట్స్‌లో ఈ రెండూ ముందుంటాయి. కానీ ఫుట్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌కు ప్రపంచ దేశాల్లో ఉన్న క్రేజ్‌ ఎంత? భారత ఉపఖండం వదిలేస్తే.. ప్రపంచంలో క్రికెట్‌ బాగా పాపులర్‌ అయిన దేశాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందులోనూ ఒక్క ఆస్ట్రేలియాను మినహాయిస్తే క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, కరీబియన్‌ దీవుల్లో (వెస్టిండీస్‌) మిగతా అన్ని స్పోర్ట్స్‌లో క్రికెట్‌ ఒకటి తప్ప.. క్రికెట్‌దే టాప్‌ ప్లేస్‌ అని కాదు. 

ఇంగ్లండ్‌లోనూ ఫుట్‌బాల్‌ తర్వాతే క్రికెట్‌. మరి ఇండియాలో ఓ మతంగా చూసే క్రికెట్‌కు ప్రపంచంలో ఎందుకీ దుస్థితి? ఫుట్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదా? క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంలో ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌ విఫలమైందా? ఫుట్‌బాల్‌ను ఫిఫా ఎలా ఇంతలా పాపులర్‌ చేసింది? సాకర్‌ చేస్తున్న ఒప్పులేంటి? క్రికెట్‌ చేస్తున్న తప్పులేంటి?

క్రికెట్‌.. డబ్బుకే దాసోహం

ఈ విమర్శ చాలా ఘాటుగా అనిపిస్తున్నా క్రికెట్‌ విశ్వవ్యాప్తం కాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. అలాగని ఫుట్‌బాల్‌లో డబ్బు లేదా అంటే.. క్రికెట్‌ కంటే ఎన్నో రెట్ల డబ్బు అక్కడ ఉంది. ఓవైపు ఆటను అమ్ముకుంటేనే మరోవైపు ప్రపంచంలో నలుమూలలకూ పాకడంలో ఫుట్‌బాల్‌ సక్సెసైంది. ఇక్కడే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) విఫలమవుతోంది. ఒకవిధంగా క్రికెట్‌ కొన్ని దేశాలకే పరిమితమైతే చాలు అన్నట్లుగా ఐసీసీ ధోరణి ఉంది. గత దశాబ్ద కాలంగా క్రికెట్‌ను పూర్తిగా వాణిజ్యపరం చేయడంపైనే ఐసీసీ దృష్టిసారించింది. 2019 వరల్డ్‌కప్‌ దీనికి నిదర్శనం. 

ఎప్పుడో 1992 వరల్డ్‌కప్‌లో వాడిన రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌ను ఈ వరల్డ్‌కప్‌లో ఐసీసీ మరోసారి తీసుకొచ్చింది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం.. క్రికెట్‌లోని పెద్ద టీమ్స్‌ అయిన ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, సౌతాఫ్రికాలాంటివి కచ్చితంగా ప్రపంచకప్‌లో తలపడేలా చూడటమే. పెద్ద టీమ్స్‌ మధ్య మ్యాచ్‌లకే ఎక్కువ వ్యూయర్‌షిప్‌ ఉంటుంది. తద్వారా ఎక్కువ డబ్బు పోగేసుకోవచ్చు. అదే చిన్న టీమ్స్ ఆడటం వల్ల ఆర్థికంగా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఐసీసీ చేసిన ఈ ఆలోచనే.. 2019లో టీమ్స్‌ సంఖ్యను 10కి తగ్గేలా చేసింది. ఆ పది క్రికెట్‌ ఆడే ప్రధాన దేశాలే. ఈ టీమ్స్‌ అన్నీ ఒకటితో ఒకటి తలపడ్డాయి. ఫలితం.. కమర్షియల్‌గా టోర్నీ సక్సెస్‌. ఐసీసీకి డబ్బులే డబ్బులు.

కొత్త దేశాలకు విస్తరణ ఎక్కడ?

1975లో జరిగిన తొలి క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో శ్రీలంక, ఈస్ట్‌ ఆఫ్రికాలాంటి అప్పటికి టెస్ట్‌ హోదా లేని దేశాలు ఆడాయి. ప్రపంచంలోని అన్ని ఖండాలకు క్రికెట్‌ను పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశారు. కానీ ఆ తర్వాత ఈ లక్ష్యం క్రమంగా కనుమరుగవుతూ వచ్చింది. 2019కి వచ్చేసరికి ఐసీసీ అనుబంధ దేశాలు ఒక్కటి కూడా వరల్డ్‌కప్‌లో ఆడలేదు. 

పైగా క్రికెట్‌ను ఎంతో కొంత ఆఫ్రికాలో పాపులర్‌ చేసిన ఐసీసీ శాశ్వత సభ్యదేశాలు జింబాబ్వే, కెన్యా.. ఈ వరల్డ్‌కప్‌కు అసలు అర్హత సాధించలేకపోయాయి. అటు యూఏఈ, కెనడా, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా వంటి అనుబంధ దేశాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి ఐసీసీ ఏమాత్రం కృషి చేయడం లేదు. ఈ టీమ్స్‌ ఎప్పుడోసారి వరల్డ్‌కప్‌ ఆడటం, ఆ తర్వాత కనుమరుగైపోవడం చూస్తున్నాం.

పెద్ద టీమ్స్‌దే క్రికెట్‌

వరల్డ్‌కప్‌లాంటి విశ్వవేదికలపై ఆడే అవకాశం క్రికెట్‌లో పెద్ద టీమ్స్‌కు ఈజీగా దక్కుతుంది. ఎందుకంటే ఐసీసీ ర్యాంకుల్లో టాప్‌ 8లో నిలిచిన టీమ్స్‌ నేరుగా క్వాలిఫై అయిపోతాయి. తక్కువ ర్యాంకు ఉన్న టీమ్స్‌ను పక్కన పెట్టేస్తున్నారు. ఏ స్పోర్ట్‌లో అయినా ఎంత ఎక్కువ మందికి అవకాశం ఇస్తే అది అంత పాపులర్‌ అవుతుంది. కానీ క్రికెట్ ఈ విషయంలో ఎప్పుడూ ఫెయిలైందనే చెప్పాలి. దశాబ్దాలుగా చిన్న దేశాలను చిన్నచూపు చూస్తూనే ఉంది. ఇక క్రికెట్‌ కేలండర్‌లో ఏడాదంతా ఏవో రెండు పెద్ద టీమ్స్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం కూడా వాణిజ్యపరమైన అంశమే. అదే 1990ల్లో అయితే మూడు లేదంటే నాలుగు దేశాల టోర్నీలైనా జరిగేవి. 

వాటిలో జింబాబ్వే, కెన్యా వంటి చిన్న దేశాలకు ఆడే అవకాశం దక్కేది. ఇలాంటి దేశాలు తరచూ పెద్ద దేశాలతో ఆడుతుండటం వల్ల అక్కడి టీమ్స్ మెరుగవుతాయి. మెల్లగా ఆ దేశాల్లో క్రికెట్‌పై ఆసక్తి పెరుగుతుంది. మరింత మంది ఆ ఆట వైపు చూసేలా ఇది ప్రోత్సహిస్తుంది. కానీ ఐసీసీకిగానీ, క్రికెట్‌లోని బీసీసీఐలాంటి ప్రధాన బోర్డులకుగానీ అలాంటి ఆలోచనే లేదు. ఎంతసేపూ ఉన్న ఆ కొన్ని దేశాల్లోనే క్రికెట్‌ను ప్రోత్సహించడం, సాధ్యమైనంత డబ్బు పిండుకోవడం అలవాటుగా మారిపోయింది.

ఫుట్‌బాల్‌ను చూసి నేర్చుకోవాల్సిందే

అదే సమయంలో ఫుట్‌బాల్‌ ఇందుకు పూర్తి భిన్నంగా వెళ్తోంది. ప్రతి ఫిఫా వరల్డ్‌కప్‌కూ ఆ గేమ్‌కు ఉన్న క్రేజ్‌ పెరుగుతూ వస్తోంది. 1974లో అంటే క్రికెట్‌ తొలి వరల్డ్‌కప్‌ జరగడానికి ఏడాది ముందు ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడిన టీమ్స్‌ సంఖ్య 16. ఆ తర్వాత అది 32కు చేరింది. 2026 వరల్డ్‌కప్‌ నుంచి వీటిని 48కి పెంచుతున్నారు. అన్ని ఖండాల్లోని దేశాలకూ సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రపంచకప్‌ అన్న పదానికి అసలైన నిర్వచనం ఫిఫా ఇస్తోంది. 

ఫుట్‌బాల్‌ను కేవలం యూరప్‌, దక్షిణ అమెరికాలకే పరిమితం చేయకుండా ఆసియా, ఉత్తర అమెరికా, ఆఫ్రికాల్లోనూ ఆదరణ పెరిగేలా ఫిఫా చర్యలు తీసుకుంటోంది. ఇక ఫుట్‌బాల్‌లో ఉన్న మరో గొప్పతనం ఏంటంటే.. ఒక్క ఆతిథ్య దేశం మినహాయించి అంతకుముందు ఛాంపియన్‌ అయినా కూడా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావాలంటే అర్హత టోర్నీల్లో ఆడాల్సిందే. 

ఈ అర్హత టోర్నీల ద్వారా కూడా పెద్ద టీమ్స్‌తో ఆడే అవకాశం చిన్న చిన్న టీమ్స్‌కు దక్కుతుంది. తద్వారా అవి కూడా రాటుదేలుతున్నాయి. ప్రతి ఏటా తమ సభ్య దేశాల సంఖ్యను పెంచుకోవడంపైనే ఫిఫా దృష్టి సారించింది. పేరుకి ఐసీసీలోనూ 104 దేశాలకు సభ్యత్వం ఉంది. కానీ అందులో రెగ్యులర్‌గా క్రికెట్‌ ఆడే దేశాలు ఎన్ని? ఫుట్‌బాల్‌లో అలా కాదు. సభ్య దేశాలన్నీ ఈ ఆటను ఆడేలా ఫిఫా ప్రోత్సహిస్తోంది. అటు యురోపియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్స్‌ కూడా గేమ్‌ విశ్వవ్యాప్తం కావడంలో తమ వంతు సాయం చేస్తున్నాయి. 

ఇంగ్లిష్‌, స్పానిష్‌ లీగ్స్‌లో ఆడే విదేశీ ఆటగాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్రికెట్‌లోనూ ఆయా బోర్డులు ఐపీఎల్‌ను చూసి తమకు తాము కొత్తకొత్త లీగ్స్‌ ప్రారంభిస్తున్నా.. అన్నింట్లోనూ స్థానిక ఆటగాళ్లకే పెద్దపీట వేస్తున్నారు. ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల శాతం 35 కాగా.. బిగ్‌బాష్‌ లీగ్‌లో కేవలం 11 మాత్రమే. ఇక ఫుట్‌బాల్‌లో ప్లేయర్స్‌ జాతీయ జట్టుకు ఆడే రోజులు ఒక కేలండర్ ఏడాదిలో చాలా చాలా తక్కువ. 

2019లో అయితే ఇది కేవలం 50 రోజులు మాత్రమే. సాకర్‌ ప్లేయర్స్‌ 80 శాతం రోజులు క్లబ్స్‌కే ఆడుతుంటారు. అదే క్రికెట్‌లో ఇది రివర్స్‌లో ఉంటుంది. ఇలా ఫుట్‌బాల్‌తో పోలిస్తే ఏరకంగా చూసినా క్రికెట్‌ వివిధ దేశాలకు విస్తరించకుండా, అదొక విశ్వక్రీడగా మారకుండా ఆగిపోతోంది. నిజానికి క్రికెట్‌ను ఎదగకుండా ఆ క్రికెట్‌ పాలకులే చేస్తున్నారనడం కరెక్టేమో.

WhatsApp channel

సంబంధిత కథనం