Ben Stokes: ముందే క్రీజు వదిలితే ఈ పనిష్మెంట్ ఇవ్వండి.. బెన్ స్టోక్స్ అదిరిపోయే సలహా
Ben Stokes: ముందే క్రీజు వదిలితే ఈ పనిష్మెంట్ ఇవ్వండి అంటూ బెన్ స్టోక్స్ అదిరిపోయే సలహా ఇచ్చాడు. బౌలర్ బాల్ వేయక ముందే నాన్ స్ట్రైకర్ క్రీజు వదలడం చాలా కాలంగా క్రికెట్ లో వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే.
Ben Stokes: నాన్ స్ట్రైకర్ ను బౌలర్ రనౌట్ చేయడంపై చర్చ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇది కూడా ఓ సాధారణ రనౌటే అని ఎంసీసీ కూడా తేల్చినా వివాదం రేగుతూనే ఉంది. తాజాగా ఐపీఎల్లో లక్నో, ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్.. లక్నో బ్యాటర్ రవి బిష్ణోయ్ ను ఇలాగే రనౌట్ చేయడానికి ప్రయత్నించాడు. అది మిస్ అయినా.. మరోసారి అలాంటి రనౌట్ పై చర్చ మాత్రం మొదలైంది.
బిష్ణోయ్ తీరు చూసిన తర్వాత క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ఓ ట్వీట్ చేశాడు. "బిష్ణోయ్ ముందుగానే క్రీజు వదలడానికి ప్రయత్నించాడు. ఇప్పటికే ఎవరైనా నాన్ స్ట్రైకర్ ను రనౌట్ చేయొద్దు అనే వాళ్లు ఉన్నారా?" అని అతడు ట్వీట్ చేయడం విశేషం. దీనిపై ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, సీఎస్కే టీమ్ మెంబర్ బెన్ స్టోక్స్ స్పందించాడు.
ఇలా చేసిన వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని, ఎవరైనా అలా చేస్తే ఆ జట్టుకు ఆరు పరుగుల పెనాల్టీ వేయాలని అతడు చెప్పడం విశేషం. "ఇది ఎలా ఉంటుంది హర్షా? అంపైర్ విచక్షణ మేరకు ఇలా ముందుగానే క్రీజు వదిలే వారికి 6 పరుగుల పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి వివాదం లేకుండా బ్యాటర్లకు ఈ పెనాల్టీ అడ్డుకట్ట వేస్తుంది" అని స్టోక్స్ ట్వీట్ చేశాడు.
నిజానికి గతేడాది సెప్టెంబర్ లో ఇండియా వుమన్ క్రికెటర్ దీప్తి శర్మ.. ఇంగ్లండ్ క్రికెటర్ ఛార్లెట్ ను ఇలాగే రనౌట్ చేసినప్పుడు ఇదే బెన్ స్టోక్స్.. హర్షా భోగ్లేతో వాగ్వాదానికి దిగాడు. ఇది ఇంగ్లిష్ వాళ్లకు తప్పుగా అనిపించవచ్చు.. ఎందుకంటే వాళ్లు క్రికెట్ ను ఏలారు కదా అంటూ భోగ్లే చేసిన ట్వీట్ వైరల్ అయింది. దీనిపై స్టోక్స్ స్పందిస్తూ.. ఇది తప్పని ఇంగ్లిష్ వాళ్లే కాదు.. ప్రపంచమంతా చెప్పిందన్నాడు.
సంబంధిత కథనం