Du Plessis Longest Six: ఐపీఎల్ 2023లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన డుప్లెస్సి.. ఎన్ని మీటర్లో తెలుసా?
Du Plessis Longest Six: ఐపీఎల్ 2023లో లాంగెస్ట్ సిక్స్ కొట్టాడు ఫ్లాఫ్ డుప్లెస్సి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అయిన డుప్లెస్సి ఈ రికార్డు సిక్స్ కొట్టాడు.
Du Plessis Longest Six: ఐపీఎల్ 2023లో లాంగెస్ట్ సిక్స్ రికార్డు నమోదైంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి ఈ రికార్డు క్రియేట్ చేశాడు. అతని దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. ఈ మ్యాచ్ లో డుప్లెస్సి 46 బంతుల్లోనే 79 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఆ ఐదు సిక్స్ లలో ఒకటి ఈ సీజన్ లోనే అతి భారీ సిక్స్ కావడం విశేషం.
అది ఏకంగా 115 మీటర్ల దూరం వెళ్లింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో ఏకంగా 15 సిక్స్ లు నమోదయ్యాయి. మ్యాక్స్‌వెల్ అత్యధికంగా ఆరు సిక్స్ లు కొట్టగా, డుప్లెస్సి 5, కోహ్లి 4 సిక్స్ లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ నమోదైన లాంగెస్ట్ సిక్స్ 125 మీటర్లు కావడం విశేషం. 2008లో జరిగిన తొలి సీజన్ లో ఆల్బీ మోర్కెల్ ఈ అతి భారీ సిక్స్ కొట్టాడు.
అప్పటి నుంచి ఈ రికార్డు అతని పేరిటే ఉంది. తాజాగా లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ లో డుప్లెస్సి 115 మీటర్ల దూరం కొట్టాడు. ఈ బాల్ చిన్నస్వామి స్టేడియం బయట పడటం విశేషం. బ్యాక్ ఫుట్ పై డుప్లెస్సి ఎంతో బలంగా ఈ షాట్ ఆడాడు. ఆ షాట్ చూసి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న మ్యాక్స్‌వెల్ తో పాటు విరాట్ కోహ్లి కూడా షాక్ తిన్నారు.
ఈ ముగ్గురి విధ్వంసంతో ఆర్సీబీ 20 ఓవర్లో 2 వికెట్లకు 212 రన్స్ చేసింది. డుప్లెస్సి 79 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లి 44 బంతుల్లో 61 రన్స్ చేయగా.. మ్యాక్స్‌వెల్ 29 బంతుల్లోనే 59 రన్స్ చేశాడు. ఆర్సీబీ బ్యాటర్ల దెబ్బకు లక్నో బౌలర్ అవేష్ ఖాన్ 4 ఓవర్లలోనే 53 రన్స్ సమర్పించుకున్నాడు.