WTC final prize money: డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్‌మనీ రివీల్ చేసిన ఐసీసీ.. ఎన్ని కోట్లో తెలుసా?
WTC final prize money: డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్‌మనీ రివీల్ చేసింది ఐసీసీ. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఇంగ్లండ్ లోని ఓవల్ లో ఈ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
WTC final prize money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఐసీసీ ప్రైజ్ మనీ రివీల్ చేసింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ఈ మ్యాచ్ లో విజేతకు 16 లక్షల డాలర్ల (రూ.13.22 కోట్లు) ప్రైజ్ మనీ దక్కనుంది. ఇక ఈ ఫైనల్లో ఓడిపోయిన జట్టుకు అందులో సగం అంటే 8 లక్షల డాలర్లు (సుమారు రూ.6.6 కోట్లు) దక్కుతాయి.
జూన్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. జూన్ 12వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. విజేతకు గదతోపాటు ఈ భారీ ప్రైజ్ మనీ కూడా దక్కనున్నట్లు ఐసీసీ శుక్రవారం (మే 26) వెల్లడించింది. డబ్ల్యూటీసీ మొత్తం ప్రైజ్ మనీ గత సైకిల్ లో ఉన్నంతే ఉండనుంది. 2019-21తో ముగిసిన డబ్ల్యూటీసీ సైకిల్ లో మొత్తం ప్రైజ్ మనీ 38 లక్షల డాలర్లు(రూ.31.4 కోట్లు)గా ఉంది.
2021లో జరిగిన ఫైనల్లో ఇండియాను ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ కు గదతోపాటు 16 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. రెండో స్థానంలో నిలిచిన ఇండియాకు 8 లక్షల డాలర్లు దక్కాయి. ఈసారి కూడా ఈ ప్రైజ్ మనీల్లో ఎలాంటి మార్పూ లేదు.
ఈసారి మూడోస్థానంలో నిలిచిన సౌతాఫ్రికాకు 4.5 లక్షల డాలర్లు.. నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ కు 3.5 లక్షల డాలర్లు, ఐదోస్థానంలో నిలిచిన శ్రీలంకకు 2 లక్షల డాలర్లు దక్కనున్నాయి. ఇక 6 నుంచి 9వ స్థానాల వరకూ ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ లకు తలా లక్ష డాలర్లు అందిస్తారు.
మరోవైపు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇండియా ట్రైనింగ్ మొదలుపెట్టింది. ఈ ఫైనల్ కోసం ఇప్పటికే తొలి బ్యాచ్ ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే. కోచ్ రాహుల్ ద్రవిడ్ తోపాటు అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, ఇతర సపోర్ట్ స్టాఫ్ ఇంగ్లండ్ వెళ్లారు. మిగిలిన టీమ్ ఐపీఎల్ ముగిసిన తర్వాత అక్కడికి వెళ్తుంది.
సంబంధిత కథనం