Dukes ball in WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో డ్యూక్స్ బాల్.. ఈ బాల్ ప్రత్యేకత ఏంటి? బ్యాటర్లకు కష్టాలేనా?
Dukes ball in WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో డ్యూక్స్ బాల్ వాడనున్నారు. మరి ఈ బాల్ ప్రత్యేకత ఏంటి? దీనితో బ్యాటర్లకు కష్టాలేనా? అసలు ఈ డ్యూక్స్ బాల్ కు.. ఎస్‌జీ, కూకాబుర్రా బాల్స్ కు తేడా ఏంటి? ఒకసారి చూద్దాం
Dukes ball in WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఎందుకు చాలా కఠినమైన మ్యాచో ఇప్పుడు అందరికీ తెలిసి వస్తోంది. ఈ ఫైనల్ ఆడబోయే టీమ్స్ కు హోమ్ అడ్వాంటేజ్ ఉండకూడదని ఇంగ్లండ్ లో వేదికను ఏర్పాటు చేశారు. ఇక ఇందులో వాడే బాల్ కూడా ఇండియా, ఆస్ట్రేలియాకు అలవాటు లేనిదే.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం డ్యూక్స్ బాల్ వాడుతున్నారు. ఈ బాల్ ను ఇంగ్లండ్ లోనే వాడతారు. సాధారణంగా ఇండియాలో అయితే ఎస్‌జీ బాల్స్, ఆస్ట్రేలియాలో అయితే కూకాబుర్రా వాడతారు. కానీ ఏ జట్టుకూ ఎలాంటి అదనపు లబ్ధి ఉండకూడన్న ఉద్దేశంతో ఇంగ్లండ్ కండిషన్స్ లో డ్యూక్స్ బాల్ తో ఈ ఫైనల్ నిర్వహిస్తున్నారు. మరి ఈ డ్యూక్స్ బాల్ ప్రత్యేకత ఏంటి? దీనివల్ల ఎవరు ఇబ్బంది పడబోతున్నారు?
ఏంటీ డ్యూక్స్ బాల్ ప్రత్యేకత?
క్రికెట్ లో వాడే ఎస్‌జీ, కూకాబుర్రాలతో పోలిస్తే డ్యూక్స్ ప్రత్యేకం. ఇది సుదీర్ఘ సమయం పాటు బౌలర్లు స్వింగ్ చేసేలా సహకరిస్తుంది. అంటే ఈ డ్యూక్స్ బంతితో బౌలింగ్ చేయడానికి ప్రపంచంలోనే ఏ పేస్ బౌలర్ అయినా ఇష్టపడతాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ లో స్వింగ్ కు అనుకూలించే కండిషన్స్ లో ఈ డ్యూక్స్ బంతితో బ్యాటర్లకు కష్టాలు తప్పవు.
డ్యూక్స్, ఎస్‌జీ బాల్స్ రెండూ బౌలర్లకు ఎక్కువ సమయం పాటు అనుకూలిస్తాయి. ఈ రెండు బాల్స్ నే చేతులతోనే కుడతారు. అదే కూకాబుర్రాను మాత్రం మెషీన్ తో కుడతారు. దీనివల్ల డ్యూక్స్ పై ఉండే సీమ్ ఎక్కువ కాలం పాటు దెబ్బతినకుండా ఉంటుంది. అదే కూకాబుర్రా సీమ్ మాత్రం త్వరగా సాఫ్ట్ గా మారి బ్యాటర్లకు అనుకూలిస్తుంది.
డ్యూక్స్ బాల్స్ లో లక్క ఎక్కువగా ఉండి ఓవైపు ఎక్కువ సమయం పాటు మెరుపు ఉంటుంది. దీనివల్ల బాల్ స్వింగ్ అవుతూ ఉంటుంది. ఇక ఇంగ్లండ్ లోని కండిషన్స్ బంతికి సహజంగానే స్వింగ్ కు అనుకూలిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో డ్యూక్స్ బాల్స్ వల్ల బ్యాటర్లకు మరిన్ని కష్టాలు తప్పవు. అందులోనూ ఈ బాల్స్ తో ఆడే అలవాటు ఇండియా, ఆస్ట్రేలియా ప్లేయర్స్ కు లేదు.
ఇండియా, ఆస్ట్రేలియా జట్లలో మంచి బౌలర్లు ఉండటంతో బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. ఆస్ట్రేలియా టీమ్ లో కమిన్స్, స్టార్క్, బోలాండ్ ఉండగా.. ఇండియన్ టీమ్ లో షమి, సిరాజ్, శార్దూల్ ఉన్నారు. నిజానికి 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఇదే డ్యూక్స్ బాల్ వాడినప్పుడు న్యూజిలాండ్ పేసర్లను ఎదుర్కోవడానికి ఇండియన్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మరి ఈసారి ఆస్ట్రేలియా పేసర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
సంబంధిత కథనం