Cricket Balls | ఎస్‌జీ, డ్యూక్స్‌, కూకాబుర్రా.. ఈ బాల్స్ మధ్య తేడాలు ఏంటి?-what are the differences among sg dukes and kookabuura balls used in cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket Balls | ఎస్‌జీ, డ్యూక్స్‌, కూకాబుర్రా.. ఈ బాల్స్ మధ్య తేడాలు ఏంటి?

Cricket Balls | ఎస్‌జీ, డ్యూక్స్‌, కూకాబుర్రా.. ఈ బాల్స్ మధ్య తేడాలు ఏంటి?

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 08:20 PM IST

Cricket Balls.. క్రికెట్‌లో ప్రస్తుతం వివిధ దేశాల్లో వాడుతున్న ఎస్‌జీ, డ్యూక్స్‌, కూకాబుర్రా బాల్స్‌ కూడా ఆయా దేశాల్లో ఉన్న వాతావరణ, పిచ్‌ పరిస్థితులను బట్టి మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపుతాయి. వన్డేలు, టెస్టుల్లో వాడే రెడ్‌, వైట్‌, పింక్‌ బాల్స్‌ను కూడా ఆయా దేశాల్లో ఈ కంపెనీలే తయారు చేస్తాయి.

<p>ఇంగ్లండ్‌లో తయారయ్యే డ్యూక్స్‌ బాల్స్‌ ఇవే</p>
ఇంగ్లండ్‌లో తయారయ్యే డ్యూక్స్‌ బాల్స్‌ ఇవే (PA Images via Getty Images)

Cricket Balls.. క్రికెట్‌ అనేది ఓ విచిత్రమైన ఆట. ఇది ఆడటానికి ప్లేయర్స్‌కు తగిన స్కిల్స్‌ మాత్రమే ఉంటే సరిపోదు. గేమ్‌లో వాడే బాల్స్‌, పిచ్‌, వాతావరణ పరిస్థితులు కూడా ఫలితంపై ప్రభావం చూపుతాయి. అందుకే క్రికెట్‌లో ప్రస్తుతం వివిధ దేశాల్లో వాడుతున్న ఎస్‌జీ, డ్యూక్స్‌, కూకాబుర్రా బాల్స్‌ కూడా ఆయా దేశాల్లో ఉన్న వాతావరణ, పిచ్‌ పరిస్థితులను బట్టి మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపుతాయి. వన్డేలు, టెస్టుల్లో వాడే రెడ్‌, వైట్‌, పింక్‌ బాల్స్‌ను కూడా ఆయా దేశాల్లో ఈ కంపెనీలే తయారు చేస్తాయి. ఈ బాల్స్‌ను ఎవరు తయారు చేస్తారు? ఏ దేశంలో ఏ రకం బాల్‌ వాడతారు? ఈ మూడు రకాల బాల్స్‌ మధ్య ఉన్న తేడాలు ఏంటి? ఏ బౌలర్‌ ఏ కంపెనీ బాల్‌ను ఉపయోగించడానికి ఇష్టపడతాడన్న ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

ఎస్‌జీ బాల్స్‌

ఈ ఎస్‌జీ బాల్స్‌ను కేవలం ఇండియాలోనే వాడతారు. మీరట్‌లోని సాన్స్‌పరీల్‌ గ్రీన్‌ల్యాండ్స్‌ (ఎస్‌జీ) కంపెనీ 1950 నుంచి ఈ బాల్స్‌ను తయారు చేస్తోంది. ఈ సంస్థను 1931లో స్థాపించారు. కేదార్‌నాథ్‌, ద్వారకానాథ్‌ ఆనంద్‌ అనే అన్నదమ్ములు ఈ కంపెనీ వ్యవస్థాపకులు. ఇండియాలో జరిగే టెస్టులు, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు బాల్స్‌తోపాటు క్రికెట్‌ బ్యాట్లను కూడా ఈ సంస్థ తయారు చేస్తుంది.

కూకాబుర్రా బాల్స్‌

కూకాబుర్రా స్పోర్ట్ అనే ఆస్ట్రేలియా కంపెనీ ఈ బాల్స్‌ను తయారు చేస్తోంది. క్రికెట్‌తోపాటు హాకీ పరికరాలను కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. ఆస్ట్రేలియాలో తయారయ్యే ఈ కూకాబుర్రా బాల్స్‌ను ఆస్ట్రేలియాతోపాటు న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వేలలో వాడతారు.

డ్యూక్స్‌ బాల్స్‌

ఇంగ్లండ్‌లోని డ్యూక్‌ కుటుంబం 1760లో స్థాపించిన బ్రిటిష్‌ క్రికెట్‌ బాల్స్‌ లిమిటెడ్‌ ఈ డ్యూక్స్‌ బాల్స్‌ను తయారు చేస్తోంది. 1987లో ఈ సంస్థను భారత వ్యాపారవేత్త దిలీప్‌ జజోడియా కొనుగోలు చేశారు. ఈ డ్యూక్స్‌ బాల్స్‌ను ఇంగ్లండ్‌తోపాటు వెస్టిండీస్‌, ఐర్లాండ్‌లలో వాడతారు.

ఎస్‌జీ, డ్యూక్స్‌, కూకాబుర్రా మధ్య తేడా ఏంటి?

మూడు దేశాల్లో తయారయ్యే ఈ మూడు రకాల బాల్స్‌ మధ్య ప్రధానంగా స్టిచింగ్‌, సీమ్‌లో తేడాలు ఉంటాయి. డ్యూక్స్‌, ఎస్‌జీ బాల్స్‌ను చేతులతోనే కుడతారు. కూకాబుర్రా బాల్స్‌ లోపలి రెండు వరుసల కుట్లను చేతులతో, బయటి వరుసలను మెషీన్‌ సాయం వేస్తారు. ఈ మూడు బాల్స్‌లో డ్యూక్స్‌ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. డ్యూక్స్‌ బాల్‌లో ఆరు వరుసల స్టిచింగ్‌ వెనక్కి, ముందుకు ఉంటుంది. అందువల్ల ఈ బాల్‌ మిగతా రెండు రకాల బాల్స్‌తో పోలిస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. 

స్వింగ్‌ ఎక్కువగా కావాలకునే బౌలర్లు ఎస్‌జీ, కూకాబుర్రా కంటే ఎక్కువగా డ్యూక్స్‌ బాల్‌ వాడటానికే ఇష్టపడతారు. ఇంగ్లండ్‌లో ఉండే వాతావరణం, పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఈ డ్యూక్స్‌ బాల్స్‌ను ఉపయోగించి ఇంగ్లండ్‌ బౌలర్లు జేమ్స్‌ ఆండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్ మంచి స్వింగ్‌ రాబట్టడం మనం చూస్తూనే ఉంటాం. అదే ఇండియాలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్కడి పిచ్‌లు గట్టిగా ఉండి, టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమైన రెండు, మూడు రోజుల్లోనే వాటిపై పగుళ్లు రావడం చూస్తుంటాం. ఇది స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. 

చేతులతో గట్టిగా కుట్లు వేసిన ఎస్‌జీ బాల్స్‌ ఇండియా పిచ్‌లపై బాగా పనికొస్తాయి. ఇక బౌన్స్‌ ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలాంటి దేశాల్లో కూకాబుర్రా బాల్స్‌ ఉపయుక్తంగా ఉంటాయి. ఈ కూకాబుర్రా బాల్స్‌పై ఉండే సీమ్‌ త్వరగా ఊడిపోయినా.. పిచ్‌పై ఉండే బౌన్స్‌ను బౌలర్లు ఉపయోగించుకుంటారు.

ఇండియన్‌ ప్లేయర్స్‌ ఛాయిస్‌ ఏంటి?

ఇండియాలో మొదటి నుంచీ ఎస్‌జీ బంతులనే వాడుతున్నారు. ఈ బాల్‌తోనే హోమ్‌ కండిషన్స్‌లో ఇండియా తిరుగులేని టీమ్‌గా నిలిచింది. అయినా ఈ మధ్య కాలంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితోపాటు పేస్‌బౌలర్లు ఉమేష్‌ యాదవ్‌, జస్‌ప్రీత్ బుమ్రాలాంటి వాళ్లు డ్యూక్స్‌ బాల్స్‌పై మనసు పారేసుకున్నారు. ఎస్‌జీ బాల్స్ త్వరగా పాడవుతున్నాయని కోహ్లి ఫిర్యాదు చేస్తుండగా.. మంచి స్వింగ్‌ అందించే డ్యూక్స్‌ బాల్స్‌తో తాము బౌలింగ్‌ ఎంజాయ్‌ చేస్తున్నామని ఉమేష్‌, బుమ్రా అంటున్నారు. 

 

ఒకప్పుడు ఇండియన్‌ టీమ్‌ అంటే స్పిన్నర్లదే రాజ్యం. కానీ క్రమంగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ పేస్‌ బౌలర్లు కూడా ఇండియాలో పుట్టుకొస్తున్నారు. దీంతో సహజంగా వీళ్లు తమకు ఎక్కువ అనుకూలంగా ఉండే డ్యూక్స్‌ బాల్స్ వైపు చూస్తున్నారు. అయితే ప్లేయర్స్‌ డిమాండ్స్‌ను పరిగణలోకి తీసుకొని ఎస్‌జీ బాల్స్‌ను కూడా మరింత మెరుగ్గా, మన్నికగా తయారు చేస్తామని సదరు సంస్థ చెబుతోంది.

 

Whats_app_banner

సంబంధిత కథనం