Pat Cummins: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బుధవారం (జూన్ 7) నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగనున్న విషయం తెలుసు కదా. ఈ మ్యాచ్ లో బరిలోకి దిగబోయే తమ తుది జట్టు ఏదో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పేశాడు. గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ ను తీసుకోనున్నట్లు తెలిపాడు.
ఇప్పటి వరకూ 7 టెస్టుల్లో 13.42 సగటుతో 28 వికెట్లు తీసిన బోలాండ్.. ప్రాక్టీస్ సెషన్ లోనూ రాణించినట్లు కమిన్స్ వెల్లడించాడు. "గతంలో ఇంగ్లండ్ లో బంతి బాగా స్వింగ్ అయ్యేది. ప్రతి బంతికి వికెట్లు తీయాలని బౌలర్లు తహతహలాడేవారు. స్కాటీ (స్కాట్ బోలాండ్)లాంటి బౌలర్ సింపుల్ గేల్ ప్లాన్ అంటే సరైన స్థానాల్లో బంతులు వేయడం, ఓపిగ్గా ఎదురుచూడటం చేస్తే వికెట్లు వాతంటవే వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అతడు నెట్స్ లో బాగా బౌలింగ్ చేశాడు. ఎప్పుడు బౌలింగ్ చేసినా బాగానే చేస్తున్నాడు" అని కమిన్స్ చెప్పాడు.
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ విభాగంలో కమిన్స్, స్టార్క్ తోపాటు బోలాండ్ ఉంటాడు. నేథన్ లయన్ ఒక్కడే స్పిన్నర్. ఇక ఓపెనర్ గా డేవిడ్ వార్నర్ దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అతడు ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. పాకిస్థాన్ తో సొంతగడ్డపై జరగబోయే సిరీసే తన కెరీర్లో చివరిదని చెప్పిన వార్నర్.. ఈ ఫైనల్లో సత్తా చాటాలని చూస్తున్నాడు.
మార్కస్ హ్యారిస్ బదులు ఎంతో అనుభవం ఉన్న వార్నర్ తోనే ఫైనల్లో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. ఓపెనర్ల తర్వాత లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ ఉండనున్నారు.
ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిడ్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నేథన్ లయన్, స్కాట్ బోలాండ్
సంబంధిత కథనం