Shani dev: శని చూపు పడని దేవుళ్లు ఇద్దరే? వాళ్ళు ఎవరో తెలుసా?
30 January 2024, 16:00 IST
- Shani dev: పరమ శివుడి దగ్గర నుంచి ప్రతీ ఒక్క దేవతకి శని ప్రభావం ఉందని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఇద్దరికి మీద మాత్రం శని ప్రభావం పడలేదని అంటారు. ఇంతకీ ఆ దేవుళ్ళు ఎవరో తెలుసా?
శని చూపు పడని దేవుళ్ళు
Shani dev: ప్రతి మనిషి మీద ఏదో ఒక సమయంలో శని చూపు పడుతుంది. జీవితంలో ఒక్క సారైనా శని దోషం పడుతుంది. అది దేవతలైన సరే మానవులైన సరే. అందరికీ శనీశ్వరుడి వల్ల సమస్యలు ఏర్పడతాయి. కానీ ఇప్పటి వరకు దేవతల్లో ఇద్దరికీ మాత్రమే శనీశ్వరుడి ప్రభావం పడలేదని శాస్త్రాలు చెబుతున్నాయి.
లేటెస్ట్ ఫోటోలు
మహా శివుడు దగ్గర నుంచి దేవతలు, రుషులు అందరూ కూడా శని వల్ల ఒక్కసారైనా ఇబ్బంది పడిన వాళ్ళే. శని ప్రభావం పడితే వారికి కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. అదే శని చల్లని చూపు ఉంటే పేదవాడు కూడా రాజు కాగలుగుతాడు. అలాగ శనీశ్వరుడి ప్రభావం మాత్రం ఇద్దరి మీద పడలేదని పురాణాలు చెబుతున్నాయి. విఘ్నాలు తొలగించే వినాయకుడు, శ్రీరాముని పరమ భక్తుడు హనుమంతుడి మీద శని ప్రభావం పడలేదని పురాణాలు చెబుతున్నాయి.
హనుమంతుడి కథ
రామాయణంలోని ఒక కథ ద్వారా శనీశ్వరుడి ప్రభావం హనుమంతుడి మీద పడలేదని అంటారు. శని ఎంత ప్రయత్నించినా కూడా హనుమంతుడిని ఏమి చేయలేకపోయాడట. ఇంతకీ ఆ కథ ఏమిటంటే.. రావణుడు లంకలో బంధీగా ఉన్న సీతమ్మ తల్లిని రక్షించేందుకు హనుమంతుడు సముద్రంలో ఒక మార్గం నిర్మించాడు. అది నిర్మించేతప్పుడు శనీశ్వరుడు హనుమంతుడి దగ్గరకి వచ్చాడు. శని సహాయం చేసేందుకు వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడి మీద శని తన ప్రభావం చూపించేందుకు వచ్చినట్టు శని భగవానుడు చెప్పాడట.
హనుమంతుడి తల మీద కూర్చున్న శని అతను చేసే పనులకి ఆటంకాలు కలిగించాలని చూశాడట. అయితే హనుమంతుడు తన తలని కాదని కాలు భాగాన పట్టుకోమని శనీశ్వరుడికి చెప్పాడు. అప్పుడు శని హనుమంతుడి కాలు పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆకారం మార్చుకోగల శక్తి సామర్థ్యాలు కలిగిన హనుమంతుడి ఒక్కసారిగా తన శక్తితో భారీ ఆకారంగా మారిపోయాడు దీంతో శనీశ్వరుడు హనుమంతుడి కాలి కింద అణచివేయబడ్డాడు. దాని వల్ల శనీశ్వరుడు తప్పించుకోవడానికి వీలు పడకపోవడంతో తిప్పలు పడ్డాడు.
ఈ కథకి సంబంధించి చిత్రాలు తమిళనాడులోని చెంగల్పట్టు కోదండరాముని ఆలయం మీద శిల్పాల రూపంలో ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అలా శని గ్రహ ప్రభావం నుంచి హనుమంతుడి తప్పించుకున్నాడు. అందుకే హనుమంతుడిని పూజిస్తే వారి మీద శనీశ్వరుడి ప్రభావం కూడా తొలగిపోతుందని అంటారు.
వినాయకుడికి సంబంధించి మరొక కథ
వినాయకుడు కూడా శని ప్రభావం కలగని దేవుడిగా చెప్తారు. కానీ దీనికి సంబంధించి మరొక కథ పురాణాలలో ఉంటుంది. ఒకనాడు పార్వతీ దేవి తయారు చేసిన వినాయకుడిని చూసేందుకు అందరూ దేవతలు వస్తారు. వినాయకుడి ముగ్ధ మనోహరమైన మోము చూసి అందరూ మెచ్చుకుంటారు. కానీ శని మాత్రం వినాయకుడి వైపు చూడడు. అందుకు కారణం శని దేవుడికి ఉన్న శాపం. ఎవరి మీద అయితే శని చూపు పడుతుందో వాళ్ళు కష్టాలు అనుభవిస్తారని శాపం పొందాడు.
అందువల్ల శని వినాయకుడిని చూడకపోయే సరికి ఆగ్రహించిన పార్వతీ దేవి తన కొడుకుని చూడాల్సిందేనని పట్టు బట్టిందట. దీంతో చేసేది లేక శని వినాయకుడిని చూశాడు. ఫలితంగా శని చూపు పడటంతో శివుడు వల్ల వినాయకుడు తల కోల్పోయాడని పురాణాలు చెబుతాయి.