Shani dosha nivarana: శని బాధలు తొలగడానికి, శని అనుగ్రహం పొందడానికి పుష్యమాసం చాలా ప్రత్యేకమైనది-pushya month is very special to get rid of shanis afflictions and get shanis grace ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Dosha Nivarana: శని బాధలు తొలగడానికి, శని అనుగ్రహం పొందడానికి పుష్యమాసం చాలా ప్రత్యేకమైనది

Shani dosha nivarana: శని బాధలు తొలగడానికి, శని అనుగ్రహం పొందడానికి పుష్యమాసం చాలా ప్రత్యేకమైనది

HT Telugu Desk HT Telugu
Jan 25, 2024 11:00 AM IST

Shani dosha nivarana: శని చెడు దృష్టి పడితే ఆ వ్యక్తి అనేక బాధలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని దోషాల నుంచి విముక్తి పొందటం కోసం పౌర్ణమి రోజు ఇలా చేయండి.

శని దోష నివారణలు
శని దోష నివారణలు (stock photo)

Shani dosha nivarana: ఏ వ్యక్తి అయితే జాతకంలో ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావాలతో బాధపడుతున్నారో ఎవరికైతే శని దోషాలు ఇబ్బంది కలిగిస్తున్నాయో.. అలాగే శని మహర్దశ శని అంతర్దశతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి పుష్యమాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఈ పుష్యమాసంలో శనివారాలు లేదా పుష్య పౌర్ణమి రోజు నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం శనికి సంబంధించినటువంటి దానాలు ఆచరించడం వల్ల శని దోషాలు తొలగుతాయని చిలకమర్తి తెలిపారు. పుష్యమాసంలో శనివారాలు దశరథ స్తోక్త్ర శని స్తోత్రాలు వంటివి పఠించడం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, నలచరిత్ర చదవడం వంటివి ఆచరించడం వల్ల శనిదోషాలు శని బాధలు తొలగుతాయని చిలకమర్తి తెలిపారు.

పుష్యమాసంలో శనివారాలు నువ్వులు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని నవగ్రహ ఆలయాలలో సమర్చించడం, పంచిపెట్టడం అలాగే ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన శని అనుగ్రహం కలుగుతుందని చిలకమర్తి తెలిపారు.

చంద్రుడు పుష్యమి నక్ష్మత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. “పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. అమ్మవారికి ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. విష్ణువునకు ఇష్టమైన మాసం మార్గశిరం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్జి పూజించేవారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఏలినాటి శని నుంచి ఉపశమనం పొందే పరిహారం

ఏలినాటి శనితో బాధపడే వారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. మానవుడు ఈనెలలో నువ్వులు సేవించి, నియమనిష్టలు పాటించిస్తే శని అనుగ్రహం పొందవచ్చు.

గరుడపురాణంలో నాభి శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికీ శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి. పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.

అలాగే సోమవారాల్లో శివుడిని మారేడుదళాలతోను ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు పూలతోను అర్చిస్తారు. శుక్ల పక్ష షష్టినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్టి, సుబ్రహ్మణ్య షష్టి ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది. ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో వచ్చే శుద్ద ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. చలితో బాధపదేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel