Elinati shani: పుష్య మాసంలో ఇలా చేస్తే ఏలినాటి శని నుంచి విముక్తి పొందుతారు-do follow these remedies to remove the elinati shani in pushya month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Elinati Shani: పుష్య మాసంలో ఇలా చేస్తే ఏలినాటి శని నుంచి విముక్తి పొందుతారు

Elinati shani: పుష్య మాసంలో ఇలా చేస్తే ఏలినాటి శని నుంచి విముక్తి పొందుతారు

HT Telugu Desk HT Telugu
Jan 13, 2024 08:00 AM IST

Elinati shani: ఏలినాటి శని నుంచి బాధపడుతున్న వాళ్ళు పుష్య మాసంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల దాని నుంచి విముక్తి లభిస్తుంది.

ఏలినాటి శని బాధలు తొలగించుకునే మార్గం
ఏలినాటి శని బాధలు తొలగించుకునే మార్గం

Elinati shani remedies: చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. 'పుష్య' అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. అమ్మవారికి ఇష్టమైన మాసం అశ్వీయుజం. విష్ణువునకు ఇష్టమైన మాసం మార్గశిరం. శివుడికి కార్తీకం, అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనీశ్వరుడిని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఏలినాటి శని నుంచి ఇలా విముక్తి పొందవచ్చు

ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుడిని భక్తితో ప్రార్ధిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్తీయకోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.

శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. మానవుడు ఈనెలలో నువ్వులు సేవించి, నియమ నిష్టలు పాటిస్తే శని అనుగ్రహం పొందవచ్చు. అంతేగాక గరుడపురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్తారు. అందుకే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికీ శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.

పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య మాసంలో విదయ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసిదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోను, ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు పూలతోను పూజిస్తారు. శుక్ల పక్ష షష్టినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్టి, సుబ్రహ్మణ్య షష్టి ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.

దానాలు ముఖ్యం

ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృ దేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్య మాసంలో వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. చలితో బాధపడే వారిని అదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సంక్రాంతి విశిష్టత

పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకొనే పండుగ భోగి. చీకటితోనే లేచి చలిమంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ అఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నులపండుగగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది.

“సంక్రాంతి” లేదా 'సంక్రమణం” అంటే చేరుట అని అర్థము. జయసింహ కల్చద్రుమం అనే గ్రంథంలో 'సంక్రాంతిని ఇలా నిర్వచించారు. “తత్ర మేషాదిషు ద్వాదశరాశి క్రమణేషు సంచరితఈః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంగక్రాంతిః.” మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశిలో ప్రవేశించడమే సంక్రాంతి లేదా సంక్రమణం. సూర్యుని రథయాత్రలో ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్నే సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు.

సంక్రాంతి లేదా సంక్రమణం నాడు రాత్రిపూట భోజనాలు చేయకూడదని పురాణాదులు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడిని ఆవు నెయ్యి, నువ్వలతో అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల సౌభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులను, వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు.

పుష్యబహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్రిలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు. సున్ని పిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం, మంచి నీటిలోను నువ్వులను కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజున చేస్తారు. ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈరోజు నదీ స్నానాదులు చేసుకొని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి.

సంక్రాంతి శోభ అంటే పల్లెటూర్లకి వెళ్ళాల్సిందే

పితృతర్పణాలు, అబ్బికాదులు ఉంటే విశేషించి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. సంక్రాంతి పండుగ శోభను తిలకించాలంటే గ్రామసీమలే ఆధారం. ప్రతి ఇల్లూ పండగ కళను సంతరించుకుంటుంది. ఇంటింటా బంతిపూల తోరణాలు దర్శనమిస్తాయి. నెల రోజులు ముందు నుంచే గొబ్బి పూజలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల మేళాలు కనువిందు చేస్తుంటాయి. నిత్య నూతనంగా ముగ్గులతో వాకిళ్ళు శోభిల్లుతూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతుంటాయి.

ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుంచి వివిధ ఆలయాల్లో అర్చకస్వాములు సూర్యోదయానికి పూర్వమే మేళతాళాలతో నదీజలాలను తీర్ధం బిందెలతో తీసుకువచ్చి అలయంలో కొలువైన స్వామికి విశేషార్చనలు జరుపుతుంటారు. తెలుగునేలపై సంక్రాంతి శోభ వెల్లివిరుస్తుంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner