Shivabhishekam: శివుడికి ఏయే పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది?
Shivabhishekam: శివుడు అభిషేకప్రియుడు అని అందరికీ తెలుసు. గంగాజలంతో అభిషేకం చేసిన పరవశించిపోతాడు. అటువంటి శివుడిని ఏయే పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం.
Shivabhishekam: విష్ణోః అలంకార ప్రియః శివ అభిషేక ప్రియః అని శాస్త్రాలు చెబుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శివుడిని అభిషేకము చేయడం వలన త్వరగా ప్రసన్నం చేసుకోచ్చని ఆయనకు అభిషేకం చాలా ఇష్టమని చిలకమర్తి తెలిపారు.
శివాభిషేకం అనేది భక్తిశద్ధలతో ఆచరించాలి. ఈ సృష్టిలో ప్రతి అణువులోను శివుడున్నాడని అంటారు. శివుడు ఇచ్చిన దానినే ఆయనకు తిరిగి భక్తితో సమర్పిస్తున్నామనే భావన మాత్రమే అభిషేకం చేసే వారి మనసుల్లో ఉండాలని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శాస్త్రం ప్రకారం శివుడిని అనేక పదార్థాలతో అభిషేకించవచ్చు. ఈ పదార్థములతో అభిషేకించేటప్పుడు భక్తిశ్రద్ధలు ముఖ్యమైనవిగా గమనించాలి. ఆడంబరాలతో చేసే పూజలు, అభిషేకాలు కన్నా భక్తితో ఆచరించే అభిషేకమే ఉత్తమమైనదని చిలకమర్తి తెలిపారు. ఎటువంటి వాటితో శివాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చిలకమర్తి తెలిపారు.
ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఏమవుతుంది?
1. శివాభిషేకం గరిక నీటితో చేయడం వలన నష్టాలు కలగవు. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు.
2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు.
3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5. ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును.
7. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12. రుద్రాక్ష జలాభిఖిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13. భస్మాఖిషేకం చేస్తే పాపాలు నశించును.
14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము, దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేస్తారు. ఆ అద్దిన అన్నాన్ని అర్బనానంతరము ప్రసాదముగా పంచిపెడతారు. అన్న లింగార్చన చూసేందుకు చాలా బాగుంటుంది.
18. ద్రాక్షా రసముచే అభిషేకం చేస్తే ప్రతి దానిలో విజయము లభించగలదు.
19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింపజేస్తుంది.
20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన కీర్తి లభించును.
22. నవరత్నోదకముతో అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘకాల వ్యాధులు నశించును.
24. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము. శుభ కార్యాలు జరుగుతాయి.
ఈ పదార్థాలతో శివాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. అయితే ఈ పదార్థాలు అందుబాటులో లేనివారు, ఈ పదార్థాలతో అభిషేకములు చేయలేనటువంటివారు పంచామృతంతో చేయవచ్చు. ఆవుపాలు, తేనె, ఆవునెయ్యి, కొబ్బరినీళ్ళు, పెరుగు వంటి వాటితో శివాభిషేకం చేసుకోవడం శుభప్రదమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఇది కూడా కుదరని పక్షంలో గంగాజలముతో శివాభిషేకం చేసుకోవడం ఉత్తమం అని చిలకమర్తి తెలిపారు.