Lord shiva abhishekam: శివుడికి ఇలా అభిషేకం చేశారంటే సర్వసంపదలు సిద్ధిస్తాయి-which materials are good to anoint lord shiva ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Shiva Abhishekam: శివుడికి ఇలా అభిషేకం చేశారంటే సర్వసంపదలు సిద్ధిస్తాయి

Lord shiva abhishekam: శివుడికి ఇలా అభిషేకం చేశారంటే సర్వసంపదలు సిద్ధిస్తాయి

Gunti Soundarya HT Telugu
Dec 09, 2023 12:04 PM IST

Shiva abhishekam: శివుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. ఏయే పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కుతాయో తెలుసుకుందాం.

శివాభిషేకం
శివాభిషేకం (PTI)

Shiva Abhishekam: విష్ణువు అలంకార ప్రియుడుఅయితే శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతాలు, పండ్ల రసాలు, విభూదితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తారు. చెంబుడు నీళ్ళు పోసినా సరే హరహర మహాదేవుడు పొంగిపోతాడు. క్షీరసాగర మథనం నుంచి వెలువడిన విషాన్ని సేవించి తన శిరస్సుని చల్లబరిచేందుకు గంగను, చంద్రుడిని తలపై ధరించాడు. శివుడికి మండుతున్న మూడో కన్ను ఉంటుంది. నిరంతరం అభిషేకం చేయడం వల్ల ఈ కన్ను చల్లబడుతుందని అంటారు.

అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం. శివాభిషేక సమయంలో రుద్ర, పురుష సూక్తం, చమకం, మహా మృత్యుంజయ మంత్రం మొదలైనవి నిర్ధిష్ట లయ క్రమంలో జపిస్తారు. సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు. శివ భక్తులు ఆరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం. అభిషేకం చేసే నీరు, ఇతర వస్తువులు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది.

అభిషేకం వీటితో చేస్తే కలిగే ఫలితాలు ఇవే

ఆవుపాలు- సర్వ సుఖాలు కలుగుతాయని నమ్మకం. దీర్ఘాయువు ఇస్తుంది.

ఆవు పెరుగు- ఆరోగ్యం, బలం సమకూరతాయి. సంతాన ప్రాప్తి లభిస్తుంది.

ఆవు నెయ్యి- ఐశ్వర్యం పెరుగుతుంది

చెరకు రసం- దుఖం తొలగిపోతుంది

తేనె- తేజస్సు పెరుగుతుంది

భస్మ జాలం- పాపాలు తొలగిపోతాయి

సుగంధోదకం- పుత్ర సంతోషం కలుగుతుంది

పుష్పొదకం- స్థిరాస్తి పెరుగుతుంది

బిల్వ జాలం- ఆనందం వెల్లివిరుస్తుంది

నువ్వుల నూనె- మృత్యు దోషం తొలగిపోతుంది

రుద్రాక్షోదకం—ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది

సువర్ణ జలం- దరిద్రం తొలగిపోతుంది

అన్నాభిషేకం- సుఖ జీవనం

ద్రాక్ష రసం—సకల కార్యాభివృద్ధి

నారికేళ జలం- సర్వ సంపద వృద్ధి చెందుతుంది

ఖర్జూర రసం- శత్రునాశనం

దూర్వోదకం( గరిక జలం)- ఆర్థికాభివృద్ధి

ధవళోదకమ్- శివుడికి దగ్గరవుతారు

గంగోదకం- సర్వ సమృద్ధి, సంపద ప్రాప్తి లభిస్తుంది

కస్తూరీ జలం- రాజసం

నేరేడు పండ్ల రసం- నిరాశ తొలగిపోతుంది

నవరత్న జలం- గృహ ప్రాప్తి కలుగుతుంది

మామిడి పండు రసం- దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి.

పసుపు, కుంకుమ- మంగళ ప్రదం

విభూది- కోటి రెట్ల ఫలితం దక్కుతుంది

ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్ర పధంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. అభిషేకం వల్ల నయం కాని రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది. సోమవారం నాడు శివాభిషేకం అత్యంత శ్రేయస్కరం.

పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి. స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది. ఆనందం పొందుతారు.

ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు

శివుడికి అభిషేకం చేయాలంటే గుడికి వెళతారు. ఇంట్లో కూడ శివలింగం ప్రతిష్టించి అభిషేకం చేయవచ్చు. పళ్ళెంలో శివలింగాన్ని పెట్టుకోవాలి. ఉత్తర ముఖంగా లింగం యోని భాగం ఉండాలి. అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపు ఉండాలి. పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు. రక్షిత శ్లోకం చెబుతున్నప్పుడు మీపై, అభిషేకం చేసేందుకు ఉపయోగించే వస్తువులపై కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలి. పూజకి ఉపయోగించే అన్ని వస్తువులు పవిత్రంగా ఉండాలి. మంత్రాలు జపిస్తూ పంచామృతాలు శివలింగం మీద అభిషేకిస్తూ ఉండాలి. పూజ చేసేటప్పుడు రుద్రాక్షని ధరించడం ఉత్తమం. చివరగా మంచి నీటితో శివలింగాన్ని అభిషేకించాలి. మీరు ఇలా చేస్తున్నప్పుడు “ఓం నమః శివాయ” అని జపించాలి.

WhatsApp channel