తెలుగు న్యూస్  /  National International  /  Kharge Vs Tharoor As Cong Set For Non-gandhi President After 24 Years

Kharge vs Tharoor: ఖర్గే వర్సెస్ థరూర్.. గెలుపెవరిది?

HT Telugu Desk HT Telugu

17 October 2022, 9:57 IST

  • Kharge vs Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నేడు జరగనున్న ఎన్నికల్లో గెలువు ఎవరిని వరించనుంది?

ఏఐసీసీ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన బాలెట్ బాక్స్
ఏఐసీసీ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన బాలెట్ బాక్స్ (ANI)

ఏఐసీసీ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన బాలెట్ బాక్స్

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక నేడు జరగనుంది. 24 ఏళ్ల అనంతరం గాంధీ - నెహ్రూ కుటుంబేతర అధ్యక్షుడిని పార్టీ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఏఐసీసీ చీఫ్‌ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌లు తలపడుతున్నారు.

9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు రహస్య బ్యాలెట్‌ విధానంలో పార్టీ చీఫ్‌ని ఎన్నుకోనున్నారు. పార్టీ 137 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష పదవి కోసం ఆరోసారి జరుగుతున్న ఈ ఎన్నికల పోటీలో ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరుగుతుంది.

పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్నారు. రాహుల్ గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో సాగుతున్న భారత్ జోడో యాత్ర శిబిరం వద్దే ఓటు వేయనున్నారు. ఆయనతో పాటు సాగుతున్న జోడో యాత్రికులు 40 మంది ప్రతినిధులు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు.

థరూర్ తిరువనంతపురంలోని కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఖర్గే బెంగళూరులోని కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయంలో ఓటు వేయనున్నారు.

మార్పు కోసం తనను గెలిపించాలని శశి థరూర్ గట్టిగానే నిలబడినప్పటికీ, సోనియా గాంధీ కుటుంబీకులకు సన్నిహితంగా ఉండటం, సీనియర్ నాయకుల మద్దతు కారణంగా ఖర్గేకు పార్టీ ప్రతినిధుల మొగ్గు కనిపిస్తోంది.