World Liver Day 2023 । ఈ అలవాట్లు ఉంటే కాలేయం ఖతమే.. ఆపై జీవితం హృదయ కాలేయమే!
19 April 2023, 12:18 IST
- World Liver Day 2023: ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీరు తరచుగా మద్యం సేవించే వారైతే లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న కుటుంబ చరిత్రను కలిగి ఉంటే, తప్పకుండా మీ కాలేయాన్ని పరీక్షించుకోవడం మంచిది.
World Liver Day 2023:
World Liver Day 2023: కాలేయం మన శరీరంలో జీర్ణక్రియ, జీవక్రియ, నిర్విషీకరణ (Detoxing) వంటి విధులను నిర్వహించడంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించే ఒక ముఖ్యమైన అవయవం. సరళంగా చెప్పాలంటే కాలేయ ఆరోగ్యమే మీ ఆరోగ్యం (Liver Health is Your Health). కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. కాలేయ ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, కాలేయ వ్యాధుల నివారణను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవంగా నిర్వహిస్తారు.
కాలేయం చెడిపోవటానికి ప్రధాన కారణం మీరు అనుసరించే జీవనశైలి. దైనందిన జీవితంలో కొన్ని అలవాట్లే కాలేయాన్ని నాశనం (Liver Damage) చేస్తాయి. మీ కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ అలవాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
అతిగా మద్యం సేవించడం
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. భోజన సమయానికి మించి ఆల్కహాల్ తాగడం వల్ల సంక్లిష్ట కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాలేయం మితమైన ఆల్కాహాల్ వినియోగాన్ని తట్టుకోగలదు. మీ కాలేయ పరిమితికి మించి తాగితే అది కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది. ఆ పరిస్థితిని ఆల్కహాలిక్ సిర్రోసిస్ అంటారు. ఇది మీ కాలేయం శాశ్వతంగా దెబ్బతిన్న పరిస్థితి.
తరచుగా బయట భోజనం చేయడం
ఇంట్లో కాకుండా ఎల్లప్పుడూ హోటెళ్లు, రెస్టారెంట్లు, పెళ్లిళ్లు, పెరంటాలు అంటూ బయట వండిన ఆహారాలు తినడం వలన మీ కాలేయం ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాలేయంలో కొవ్వు పెరిగిపోయి వాపు వస్తుంది. ఈ పరిస్థితిని సమిష్టిగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NFLD) అంటారు. అలాగే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, అధిక కేలరీల తీసుకోవడం స్థూలకాయానికి దారితీస్తుంది, ఇది కూడా నేరుగా కాలేయ వ్యాధితో ముడిపడి ఉంటుంది.
అసమయ భోజన వేళలు
వేళకు భోజనం చేయకపోవడం, క్రమరహిత ఆహార విధానాలు కలిగి ఉండటం ఊబకాయం సమస్యతో ముడిపడి ఉంటుంది, ఇది కొవ్వు కాలేయ వ్యాధికి దారితీస్తుంది. ఉదయం అల్పాహారం చేయకపోవడం, రోజులోని వేర్వేరు సమయాల్లో భోజనాలు చేయడం, అతిగా తినడం, వేగంగా తినడం, అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినడం మొదలైన అలవాట్లు మీ కాలేయాన్ని నాశనం చేయగలవు.
ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండటం
స్వచ్ఛమైన గాలి, తగినంత సూర్యకాంతి పొందడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఇది మీ కాలేయాన్ని తీవ్రమైన దుష్ప్రభావాల నుండి రక్షిస్తుంది. తగినంత సూర్యకాంతిని పొందడం వలన విటమిన్ డి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ విటమిన్ డి లోపం హెపాటిక్ వ్యాధికి దోహదం చేస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. కాబట్టి ఎప్పుడూ ఇంటికే పరిమితం కాకుండా, అప్పుడప్పుడు బయట తిరుగుతుండాలి.
ఔషధాల మితిమీరిన వినియోగం
మీకు ఏ కొద్దిగా తలనొప్పి వచ్చినా, లేదా ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే మందు గోళీలు వేసుకుంటారా? అయితే ప్రమాదంలో పడినట్లే. ఏదైనా ఔషధం లేదా డ్రగ్స్ అధిక వినియోగం మీ కాలేయాన్ని చాలా దెబ్బతీస్తుంది, ఇది కాలేయ వైఫల్యానికి దారితీయవచ్చు. మీరు తీసుకున్న ఔషధం ప్రభావం చూపాలంటే, దానిని కాలేయం విచ్చిన్నం చేయాలి. అయితే ఈ క్రమంలో కాలేయం ఆ ఔషధ ప్రభావానికి లోనవుతుంది. ఔషధాల మితిమీరిన వినియోగంతో అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
నిద్రలేమి
మీరు రోజంతా పని చేస్తూ కూడా విశ్రాంతి సమయయంలో మీ నిద్రను త్యాగం చేస్తున్నారా? అయితే ఈ అలవాటు దీర్ఘకాలంలో మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కాలేయానికి ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. సిగరెట్ స్మోకింగ్ వలన కూడా ఇలాంటి ప్రభావమే ఉంటుంది.
అసురక్షిత సెక్స్‌లో పాల్గొనడం
హెపటైటిస్ బి అనేది అసురక్షితమైన సెక్స్‌లో పాల్గొనడం ద్వారా సోకే ఒక వైరల్ ఇన్‌ఫెక్షన్, ఇది కాలేయ వైఫల్యం, కాలేయం దెబ్బతినడం వంటి ప్రాణాంతకమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఇది కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం కూడా. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలలో రెండవది ఇదే. కండోమ్ ధరించడం వలన హెపటైటిస్ బి వైరస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిరూపితమైంది.
అధికంగా చక్కెర తినడం
ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల శరీరం ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేస్తుంది, ఇది మధుమేహానికి దారితీయవచ్చు. ఇది కూడా కాలక్రమేణా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసేదే.
టాక్సిన్స్ ప్రభావం
పురుగుమందులు, ద్రావకాలు, పారిశ్రామిక కాలుష్య కారకాలు వంటి రసాయనాలు, టాక్సిన్స్ కాలేయాన్ని దెబ్బతీస్తాయి. కూరగాయలు, పండ్లను తినేముందు వాటిని ఉప్పు లేదా వెనిగర్ కలిపి నీటిలో నానబెట్టి, బాగా కడగి, ఆపై ఉపయోగించాలి.