World Liver Day 2023 । మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు ఈ పనులు చేయండి!
World Liver Day 2023: మీరు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే ముందు మీ కాలేయ ఆరోగ్యం బాగుండాలి. కాలేయ ఆరోగ్యం కోసం వైద్యులు ఎలాంటి సూచనలు చేశారో ఇక్కడ తెలుసుకోండి.
World Liver Day 2023: మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. శరీరంలోని అతిపెద్ద గ్రంథి కూడా కాలేయమే. కాలేయం మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో, రక్తం నుండి మలినాలను శుద్ధిచేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది పైత్య రసాన్ని విడుదల చేసి జీర్ణక్రియకు తోడ్పడుతుంది, శక్తి శరీర అవసరాల కోసం వినియోగిస్తుంది. కాబట్టి మీ శరీరంలోని ఇతర అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా మీ కాలేయాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి.
నేటి జీవనశైలిలో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ఎక్కువవుతుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం, ఆల్కాహాల్ సేవించడం మొదలైన వాటివలన కాలేయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నేడు చిన్న వయస్సులో కూడా కాలేయ వ్యాధులు నిర్ధారణ అవుతున్నాయని, ఇది కచ్చితంగా చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కాలేయానికి సంబంధించిన వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం (Liver Day) గా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక రోజు సందర్భంగా కాలేయాన్ని ఆరోగ్యంగా (Liver Health) ఎలా ఉంచుకోవచ్చో వైద్య నిపుణులు కొన్ని మార్గాలను సూచించారు, వారి సూచనలు ఈ కింద చూడండి.
Tips For Healthy Liver- కాలేయ ఆరోగ్యానికి చిట్కాలు
- కాలేయ వ్యాధులు ఎవరికైనా సంభవించవచ్చు, సరైన జీవనశైలిని అనుసరించటం ద్వారా కాలేయ వ్యాధులు రాకుండా నివారించడం సాధ్యపడుతుంది.
- స్థూలకాయులకు కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ, కాబట్టి వీరు తమ బరువును అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి.
- ప్రతీరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వారంలో ఐదు రోజులైనా చేయాలి.
- విటమిన్లు ఎ, బి12, డి, ఇ, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను (Liver Healthy Foods) ఎక్కువగా తీసుకోవాలి.
- మైదా వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే వేపుళ్లు, చిప్స్ వంటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి.
- మటన్ తినడం తగ్గించాలి. మటన్, బీఫ్ వంటి కఠినమైన మాంసాలు తీసుకోవడం వలన దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
- మద్యం తీసుకోవడం పరిమితం చేయండి. ఒకవేళ మద్యం తాగాల్సి వస్తే మద్యం రంగు ముదురు రంగులో కాకుండా లేత రంగులో ఉండాలి.
- సురక్షితమైన సెక్స్ ప్రాక్టీస్ చేయండి. విచ్చలవిడి శృంగారం హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.
- కాలేయ వ్యాధులైన హెపటైటిస్ A అలాగే హెపటైటిస్ B కి రక్షణగా టీకాలు తీసుకోండి.
- మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వాటిని అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
కాలేయం అనేది ఒక సంక్లిష్టమైన అవయవం, శరీరాన్ని.వివిధ వ్యాధుల నుంచే ఈ అవయవం కూడా వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్యాటీ లివర్ వ్యాధి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ , జన్యుపరమైన వ్యాధుల ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధులు మరింత తీవ్రమవుతాయి. తద్వారా సిర్రోసిస్, క్యాన్సర్, కాలేయ వైఫల్యం వంటి ప్రాణాంతక పరిస్థితులను కలిగిస్తుంది. అందువల్ల, కాలేయాన్ని కాపాడుకోవడానికి పైన పేర్కొన్న చర్యలను పాటించడం చాలా ముఖ్యం. ఇప్పటికే మీరు కాలేయ సమస్యలను లేదా లక్షణాలను ఎదుర్కొంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
సంబంధిత కథనం