Foods for Healthy Liver | కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆహారాలు తీసుకోండి!
మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం అత్యంత కీలకం. ఏ ఒక్కటి చెడిపోయినా ప్రమాదమే. ముఖ్యంగా ఆహరపు అలవాట్లు, మద్యపానం తదితర కారణాల వల్ల లివర్ చెడిపోతుంది. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల గురించి తెలుసుకోండి.
కాలేయం శరీరంలో అనేక విధులను నిర్వహిస్తుంది. శరీరంలోని మలినాల వడపోత, ఆహారం జీర్ణక్రియ, ప్రోటీన్ సంశ్లేషణ, శరీరంలో వివిధ అవసరాల కోసం విటమిన్లు, ఖనిజాల నిల్వ చేయటంలో కాలేయం ముఖ్యపాత్ర వహిస్తుంది. అయితే ప్రస్తుతం మన ఆహరపు అలవాట్లు, అనుసరించే జీవనశైలి కాలేయంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అధిక మోతాదులో ఆల్కహాల్ సేవించటం కాలేయం దెబ్బతినడానికి అతిపెద్ద కారణం. అధిక బరువు, మధుమేహం, హెపటైటిస్ బి, సి సమస్యల వలన కూడా కాలేయం పనితీరు దెబ్బతింటుంది. దీంతో ప్రోటీన్లు, కొలెస్ట్రాల్ ఉత్పత్తి నుంచి శరీరంలోని టాక్సిన్స్ తొలగింపు వరకు అనేక చర్యలు సరిగా జరగవు. మెదడు ఆరోగ్యంపైనా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ అవయవాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
అయితే మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే సరైన ఆహరం తీసుకోవటం ఎంతైనా అసవరం. కాలేయ ఆరోగ్యానికి సహకరించే కొన్ని ఆహార పదార్థాలను ఇక్కడ చూడండి.
ద్రాక్షపండ్లు
ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగా కాలేయాన్ని రక్షిస్తాయి. కాలేయ కణాలను బాగు చేయడంలో సహాయపడతాయి. అధ్యయనాల ప్రకారం, ద్రాక్షపండులోని పోషకాలు హెపాటిక్ ఫైబ్రోసిస్ సమస్యను నివారిస్తుంది. దీనివలన కాలేయానికి హాని కలిగించే కణజాలాల అభివృద్ధి జరగదు.
కొవ్వు చేపలు
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే కొవ్వు చేపలను ఆహారంలో తీసుకోవటం వలన అది కాలేయంపై కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం, కొవ్వు చేపలు కాలేయంలో కొవ్వు , ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడతాయి. కొవ్వు చేపల్లో ఉండే పోషకాలు సహజంగా కణాలను రిపేర్ చేస్తాయి. శరీరంలో మంట, వేడిని తగ్గిస్తాయి. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది.
బీట్ రూట్ జ్యూస్
ఆహారంతో పాటు బీట్ రూట్ జ్యూ తీసుకుంటూ ఉండాలి. ఇందులో బీటాలైన్స్ అని పిలిచే నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కాలేయం, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం వలన శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, శరీరంలో ఎంజైమ్‌ల ఉత్పత్తిని సహజంగా పెంచడంలో సహాయపడుతుంది, మలినాలను తొలగిస్తుంది. ఈ క్రమంలో కాలేయంపై భారం తగ్గి దాని పనితీరు మెరుగవుతుంది.
హెర్బల్ టీలు
హెర్బల్ టీలు తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది, కాలేయ కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. రోజూ బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగడం వల్ల లివర్ నుంచి ఎంజైమ్ స్రావాలు పెరుగుతాయి. లివర్ లో ఫ్యాట్ లెవల్స్ తగ్గుతాయి. ఇలాంటి టీలలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించవచ్చు, పలు రకాల క్యాన్సర్లను కూడా నివారించవచ్చు.
చివరగా.. పైన పేర్కొన్న సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహం ఉన్నా ముందుగా డాక్టరును సంప్రదించి, తదనుగుణంగా నడుకోవాలి.
సంబంధిత కథనం