Fatty Liver Disease । ముఖం ఉబ్బినట్లుగా తయారవుతుందా? ఈ వ్యాధికి సంకేతం కావచ్చు!
Fatty Liver Disease: మన శరీరంలో అంతర్గతంగా ఏదైనా సమస్య తలెత్తితే, శరీరం వివిధ సంకేతాలను పంపుతూ సమస్యను తెలియజేస్తుంది. కాలేయంలో కొవ్వు పెరిగితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో చూడండి.
Liver Health: కాలేయం మన శరీరంలోని అతిపెద్ద అవయవం, ఇది వివిధ రకాల విధులను నిర్వహిస్తుంది. శరీరంలోని హానికరమైన పదార్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. తిన్నఆహారంలోని కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తుంది. శక్తి కోసం గ్లైకోజెన్, విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలను నిల్వ చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి పిత్తాన్ని తయారు చేస్తుంది, రక్తం గడ్డకట్టడంలో సహాయపడే ప్రోటీన్‌లను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇటువంటి కీలకమైన విధులు నిర్వర్తించే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వ్యాధి సంభవిస్తుంది.
కాలేయంలో ఎక్కువ కొవ్వు ఉంటే, దానిని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. దీనినే నాన్-ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది కాలేయంపై కొవ్వుపేరుకుపోవడం వలన తలెత్తే ఒక పరిస్థితి. అధిక కేలరీలు కలిగిన ఆహారం తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.
Fatty Liver Disease Symptoms- ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు
ఊబకాయం, మధుమేహం లేదా అధిక ట్రైగ్లిజరైడ్స్ వంటి అనారోగ్య సమస్యలు కలిగిన వారికి కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. ఫ్యాటీ లివర్ వ్యాధిని సూచించే కొన్ని లక్షణాలు ఇక్కడ చూడండి
ముఖంలో వాపు
కాలేయ వ్యాధి కారణంగా కాలేయం దెబ్బతింటుంది. దీని వలన అది తగినంత ప్రోటీన్‌లను ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా శరీరంలో వివిధ అవయవాలకు రక్త ప్రసరణ, వ్యర్థాల తొలగింపులో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇది మీ ముఖంలో వాపును కలిగిస్తుంది, ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది.
మెడ చుట్టూ నలుపుదనం
ఫ్యాటీ లివర్ వ్యాధి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది, అంటే మీ శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించదు. ఇది అదనపు ఇన్సులిన్ ఏర్పడటానికి, అకాంథోసిస్ నైగ్రికన్స్ అనే చర్మ సమస్యకు దారి తీస్తుంది. మీ మెడ చుట్టూ చర్మపు మడతలు నల్లబడటం, మెడచుట్టూ నల్లటి చారలు రావడం కనిపిస్తుంది.
రోసేసియా
రోసేసియా అనేది ఒక చర్మ సమస్య. ఈ సమస్య తలెత్తినపుడు మీ ముఖంలో రక్తనాళాలు ఎర్రబడటం లేదా ముఖంపై చీముతో నిండిన చిన్న తెల్లటి గడ్డలను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ సంకేతాలు ఎల్లప్పుడూ కాలేయ వ్యాధికి సంబంధించినవి కానప్పటికీ, ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఇది కూడా ఒక సంకేతం.
నోటి చుట్టూ దద్దుర్లు
ఫ్యాటీ లివర్ వ్యాధిని కలిగి ఉన్నప్పుడు, శరీరం జింక్ వంటి కొన్ని పోషకాలను సమర్థవంతంగా గ్రహించలేకపోవచ్చు, ఇది శరీరంలో జింక్ లోపానికి దారితీస్తుంది. ఈ లోపం చర్మంలో వేడి, మంటకు కారణమవుతుంది, దీనివలన తరచుగా నోటి చుట్టూ దద్దుర్లు రావడం, గడ్డలు ఏర్పడటం జరుగుతుంది. జింక్ లోపం ఉన్న వారిలో కనిపించే లక్షణం ఇది. ఫ్యాటీ లివర్ వ్యాధి కారణంగా కూడా జింక్ లోపం ఏర్పడుతుంది.
దురద
ఫ్యాటీ లివర్ వ్యాధి వల్ల ముఖంతో సహా చర్మంపై వివిధ భాగాలలో దురద కలుగుతుంది. ఈ దురద తరచుగా శరీరంలో పిత్త లవణాలు అధికంగా ఉండటం వల్ల వస్తుంది. గోకడం వలన దురద తగ్గకపోగా, మరింత తీవ్రతరం చేస్తుంది. తరచుగా దురద ఇబ్బంది పెడుతుంటే అది ఫ్యాటీ లివర్ సంకేతం కావచ్చు.
సిర్రోసిస్
సిర్రోసిస్ అనేది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించిన చివరి దశ. ఇది కాలేయం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఈ స్థితిలో కాలేయంపై మచ్చలు ఏర్పడతాయి, ఆ మచ్చలు కాలేయం అంతా పాకుతాయి. దీనివలన కాలేయం పనితీరు దెబ్బతింటుంది. అది క్రమంగా కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. సిర్రోసిస్ దశలో ఉన్నప్పుడు, చర్మం పసుపు రంగులోకి , తరచుగా దురద పెట్టడం, సులభంగా గాయాలు అవటం జరుగుతుంది. చెడు జీవనశైలి, హైపటైటిస్, అధిక మద్యపానం ఈ ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తాయి.
కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లివర్ బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి, అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి.
సంబంధిత కథనం