తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  క్విడ్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ Renault Kwid E-tech కార్ వచ్చేసింది, ఇవీ హైలైట్స్!

క్విడ్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ Renault Kwid E-TECH కార్ వచ్చేసింది, ఇవీ హైలైట్స్!

HT Telugu Desk HT Telugu

18 April 2022, 14:11 IST

    • రెనాల్ట్ నుంచి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ క్విడ్ కారు Renault Kwid E-TECH విడుదలైంది. భద్రతాపరంగా సాలీడ్ ఫీచర్లను కలిగి ఉంది. అయితే ఓ విషయం మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. అదేంటో ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది… 
Renault Kwid E-TECH
Renault Kwid E-TECH (Renault)

Renault Kwid E-TECH

ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనో (Renault) తమ బ్రాండ్ నుంచి అత్యంత విజయవంతమైన హ్యాచ్‌బ్యాక్ అయినటువంటి క్విడ్ కారులో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది. Renault Kwid E-TECH పేరుతో విడుదలైన ఈ కార్ రెనాల్ట్ బ్రాండ్ నుంచి వచ్చిన పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ ఎంట్రీలెవెల్ మోడెల్ హ్యాచ్‌బ్యాక్. డిజైన్ పరంగా చూస్తే ఈ సరికొత్త Kwid E-TECH చాలావరకు ఇదివరకు ఉన్న క్విడ్‌ని పోలినట్లే ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికిల్ కాబట్టి కొన్ని అంశాలలో మార్పులు ఉన్నాయి. సాధారణ EVల వలె, దీని ఫ్రంట్ గ్రిల్ మూసి ఉంటుంది. అలాగే డ్యూయల్-టోన్ అల్లాయ్ రిమ్‌లు, లోపల ఇంటీరియర్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇంకా ఈ కారులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Renault Kwid E-TECH ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఫీచర్ల పరంగా క్విడ్ EVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. అంతే కాకుండా 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలాగే అన్నివైపులా పవర్ విండోలను కలిగి ఉంది.

సరికొత్త Kwid E-TECH లో 26.8kWh బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఇందులో రెండు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది నార్మల్ మోడ్‌లో 65PS ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఎకో మోడ్‌లో 44PS ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కార్ 65 హార్స్‌పవర్‌ను కలిగి ఉంది. ఇది 4.1 సెకన్లలో 0 నుంచి 50 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే 265 నుంచి 298 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణ పరిధిని అందిస్తుంది.

Kwid EV ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వచ్చింది. DC ఛార్జింగ్‌ని ఉపయోగించి కేవలం 40 నిమిషాల్లో 15 నుండి 80 శా‌ం వరకు బ్యాటరీని పెంచుకోవచ్చు. అదనంగా ఇందులో ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ కూడా ఉంది. కారు వేగంగా వెళ్తున్నపుడు బ్రేక్ వేసి వేగం తగ్గించినపుడు ఆ శక్తి బ్యాటరీలో లోడ్ అవుతుంది. ఎకో మోడ్‌లో డ్రైవ్ చేస్తే బ్యాటరీ బ్యాకప్ మెరుగ్గా ఉంటుంది.

*అయితే నిరాశపరిచే విషయం ఏమిటంటే.. ఈ Kwid E-Tech కారు ప్రస్తుతం దక్షిణ అమెరికా, బ్రెజిల్ మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియాలో ఎంతో సక్సెస్ అయిన ఈ మోడెల్ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేది కంపెనీ వెల్లడించలేదు.

ఒకవేళ ఇండియాలో కూడా క్విడ్ ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్ అయితే దాని ధర సుమారు రూ. 8 లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్ ఇండియాలో మహీంద్రా eKUV100తో పోటీపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

టాపిక్