బుల్లి ఎలక్ట్రిక్ కార్.. సొంతంగా తయారీ, ప్రయాణ ఖర్చు కేవలం రూ. 5 మాత్రమే!
07 April 2022, 20:52 IST
- ఓ 67 ఏళ్ల వ్యక్తి సొంతంగా ఎలక్ట్రిక్ కారు తయారు చేసుకున్నాడు. యానిమేషన్ కార్టూన్ చిత్రాలలో చూపించినట్లుగా ఉన్న ఈ బుల్లికారు అందరినీ ఆకర్షిస్తుంది. ఈ దృశ్యం చూడాలంటే కేరళ రాష్ట్రంలో కొల్లం నగరానికి వెళ్లాల్సిందే.
Self-made electric car
కేరళకు చెందిన ఆంటోనీ జాన్ అనే 67 ఏళ్ల వ్యక్తి లైఫ్‌స్టైల్ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. వయసు పెరిగింది ఏదో కృష్ణా రామ.. జీసస్ అంటూ కూర్చోకుండా పర్యావరణ మంచికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఒకవైపు కెరీర్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు బయో-కంపోస్టింగ్ సిస్టమ్, హైడ్రోపోనిక్ వర్టికల్ గార్డెన్ అభివృద్ధి చేయడంలాంటి పర్యావరణహితమైన పనులు చేస్తూ ముందుకుసాగుతున్నాడు.
మనం ఇటీవల కాలంగా ఎలక్ట్రిక్ వాహనాల గురించి వింటున్నాం. కానీ జాన్ ఆంటోనీ 16 సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్నారు అంటే నమ్ముతారా? ఇదేక్రమంలో ఆయన తన సొంత పరిజ్ఞానంతో తనకు తానుగా ఒక ఎలక్ట్రిక్ కారును కూడా రూపొందించుకున్నాడు. ఇప్పుడు ఈ కార్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
తుప్పు పట్టని జపాన్ షీట్ ఉపయోగించి వాహనం బాడీని సిద్ధం చేశారు. కారుకు ఆటోరిక్షా టైర్లను, అలాగే నానో కార్ నుంచి స్టీరింగ్, అవసరమయ్యే మరికొన్ని వస్తువులను తీసుకొని అమర్చారు. ఇంజన్ కోసం ఎలక్ట్రిక్ కాంపోనెంట్సును దిల్లీ నుంచి ఆర్డర్ చేసుకున్నారు, ఆ తర్వాత కారుకు 52 ఏహెచ్ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీని కనెక్ట్ చేశారు. అంతే తన కార్ సిద్ధం అయింది. ఈ కార్ రూపొందించడానికి ఆయన సుమారు ఒక సంవత్సర కాలం పాటు శ్రమించారట. దీనికోసం రూ. 4 లక్షలు ఖర్చు చేసినట్లు జాన్ ఆంటోనీ తెలిపారు. అంటే ఎలక్ట్రిక్ కార్ కోసం ఈ ఖర్చు ఎంతో తక్కువ అని చెప్పొచ్చు.
ఇక, ఈ కార్ ఎంత నాణ్యమైనదంటే దీని బ్యాటరీ ఫైర్ రెసిస్టెంట్ అంటే మంటలు కాదు. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 16 కిలోమీటర్లు ఉన్న తన ఆఫీసుకు వెళ్లి రావడానికి కేవలం ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుందట. ఆ ఒక్క యూనిట్ ఖర్చు రూ. 5 మాత్రమే. అంటే కేవలం 5 రూపాయల్లో సుమారు 30 కిమీ దూరం ప్రయాణించవచ్చు. మండుతున్న పెట్రో డీజిల్ బాధలు ఆంటోనీకి ఏమాత్రం లేవు.
ఈ బుల్లి కారు ట్రాఫిక్, ఇరుకైన సంధుల్లో కూడా చొచ్చుకొని దూసుకుపోతుంది. అంతేకాకుండా దీనికి ఎలాంటి నిర్వహణ ఖర్చులు కూడా లేవు. పార్కింగ్ కోసం అవసరమయ్యే స్థలం కూడా తక్కువే. అదీ సంగతి.
టాపిక్