ఎండలో వాహనం పార్క్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
12 April 2022, 17:47 IST
- ఎండలో వాహనం పార్క్ చేస్తున్నపుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. కలర్ షేడ్ అవుతుంది, ఇంటీరియర్ దెబ్బతింటుంది. ఈ టిప్స్ పాటించండి.
Vehicle parking tips in hot summer
మనకు ఎండాకాలంలో విపరీతమైన ఉక్కపోత, వేడిగాలులు ఉంటాయి. చెట్ల ఆకులు రాలిపోతాయి, నీడ అనేది కరువు అవుతుంది. ఈ క్రమంలో మనకు వచ్చిన మరో పెద్ద సమస్య పార్కింగ్. మన కార్ లేదా వాహనం ఏదైనా ఈ మండుటెండలో ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కాదు. అయితే చేసేదేం లేదని నిర్లక్ష్యంగా ఎండలోనే వదిలేస్తే కఠినమైన సూర్యకిరణాల కారణంగా వాహనం కలర్ తగ్గిపోతుంది, షైనింగ్ తగ్గిపోతుంది. ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌పై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇంజన్ ఆగిపోవచ్చు, ఏసీ సరిగ్గా పనిచేయకపోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా దెబ్బతింటుంది. మీరు నేరుగా వచ్చి వాహనంలో కూర్చుంటే సుర్రుమంటుంది. వేసవి వేడి లక్షలు ఖర్చు చేసి కొన్న వాహనం తొందరగా పాతదైపోయేలా, పాడైపోయేలా చేస్తుంది.
ఇవే కాదు, ఎండవేడికి రోడ్లు కరుగుతాయి, టైర్లు పగులుతాయి లేదా టైర్లలోని గాలి అవిరైపోతుంది. కాబట్టి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఈ వేసవిలో తలెత్తే అన్ని సమస్యలను అధిగమించవచ్చు.
నీడలో పార్క్ చేయండి
ఎండాకాలంలో మీ వాహనాన్ని వీలైనంత వరకు నీడలోనే పార్క్ చేసే ప్రయత్నం చేయండి. మీ వాహనం పైభాగం, అలాగే క్యాబిన్ భాగాలపై ప్రత్యక్ష సూర్యకాంతిని నివారించండి. విపరీతమైన వేడి మీ వాహనంలోని విలువైన భాగాలను దెబ్బతీస్తుంది. అందుకు మళ్లీ ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తపడటం అవసరం. సూర్యకాంతిని అడ్డుకునే మందమైన కవర్ లేదా కవచంతో వాహనాన్ని కప్పి ఉంచండి.
ఇంటీరియర్ కప్పి ఉంచండి
ఎండలో పార్క్ చేసినపుడు వాహనం లోపలి ప్లాస్టిక్, రెగ్జీన్ లేదా లెదర్ ఇంటీరియర్‌లు వేడిని సంగ్రహిస్తాయి. అందుకే మనం నేరుగా వచ్చి తాకితే చాలా వేడిగా అనిపిస్తాయి. కాబట్టి వీటిపై ఎండపడకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ వాహనంలోని సీట్లు, ఇతర విలువైన ఇంటీరియర్ భాగాలను ఏదైనా చల్లగా ఉంచడానికి తగిన మెటీరియల్ లేదా ఏదైనా గుడ్డతో కప్పండి.
సోలార్ పవర్డ్ ఫ్యాన్
వాహనం లోపల అమర్చేందుకు ఇప్పుడు మార్కెట్లో ఎన్నో సోలార్ ఆధారంగా పనిచేసే ఫ్యాన్లు వచ్చాయి. ఇవి సువాసనలు కూడా వెదజల్లుతాయి. కాబట్టి ఎండలో పార్క్ చేసినపుడు ఈ సోలార్ ఫ్యాన్లు వాటంతటవే తిరుగుతూ లోపల క్యాబిన్ భాగంలో వేడిని తొలగించేందుకు కొంత ఉపకరిస్తాయి. నిరంతరంగా జరిగే గాలి ప్రసరణ మీ వాహనం లోపల మొత్తం ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.
విండో టిన్టింగ్
వాహనంలోపల అద్దాల నుంచి ఎండ నేరుగా లోపలపడుతుంది. కాబట్టి కఠినమైన కిరణాలను లోపలికి రాకుండా నివారించేందుకు మీ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కొన్ని నగరాల్లో ఈ బ్లాక్ ఫిల్మ్ పెట్టుకుంటే పోలీసులు తొలగిస్తున్నారు కాబట్టి, లేత రంగులు ఉన్న ఉన్న లేయర్లు వేసుకోవడం ద్వారా లేదా ఏదైనా అడ్డుగా పెట్టుకోవడం ద్వారా ఇంటీరియర్ చల్లబడుతుంది.
టెంపరేచర్ గేజ్ చూడండి
కొన్నివాహనాల్లో ఉష్ణోగ్రతను సూచించే ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. వాహనం నడుపుతున్నప్పుడు బయటి వాతావరణంలో ఉష్ణోగ్రత ఎంతమేర పెరిగిందో రీడింగ్ చూడండి. ఇంజన్ నడుస్తున్నపుడు మామూలుగానే వేడి ఉత్పన్నమవుతుంది, దానికి బయటి ఉష్ణోగ్రత తోడైతే యాంత్రిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఉష్ణోగ్రత పెరిగినపుడు ఏదైనా చల్లని, సురక్షిత ప్రదేశంలో వాహనం ఆపి.. ఇంజన్ కొద్దిసేపు నిలిపివేయాలి.
కూలెంట్ చెక్ చేయండి
వాహనంలోని కూలెంట్ లెవెల్ ఎంత ఉందో పరిశీలించాలి. ముఖ్యంగా వేసవిలో కూలెంట్ ను తిరిగి నింపడం చాలా కీలకం. వేడి వాతావరణంలో కూలెంట్ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఇంజన్ చల్లగా ఉన్నపుడు దీనిని తెరిస్తేనే ఇబ్బందులు ఉంటాయి, ఇంజన్ వేడెక్కినపుడు వాల్వ్ తెరిస్తే తీవ్రమైన గాయాలు అవ్వొచ్చు.
ఇక చివరగా చెప్పేదేంటంటే.. ఎండలో పెట్టిన తర్వాత తిరిగి నేరుగా వాహనంలోకి వెళ్లి కూర్చోకుండా ముందు వాహనం మొత్తం కిటికీలు తెరవండి. దీంతో లోపల ఉన్న వేడి వెళ్లిపోతుంది. అవసరమైతే ఇంట్లో నుంచి ఒక టేబుల్ ఫ్యాన్ లాంటిది తీసుకొచ్చి ముందు మొత్తం చల్లబరచండి. కేవలం ఎండాకాలంలోనే కాదు ఏ కాలంలోనైనా వాహనంలోని చెడు గాలిని తీసేయడానికి మొత్తం తెరిచిపెడితే చాలా మంచిది. ఏసీ కూడా త్వరగా, సమర్థవంతంగా పనిచేస్తుంది.
టాపిక్