తెలుగు న్యూస్  /  Lifestyle  /  Mixed Vegetable Palak Khichdi A Healthy Rice Lentil Recipe For Lunch Or Dinner

Vegetable Palak Khichdi । పోషకాలు నిండిన పాలకూర ఖిచ్డీ.. తింటే పరవశించి పోతారు!

HT Telugu Desk HT Telugu

11 March 2023, 13:43 IST

    • Mixed Vegetable Palak Khichdi: పాలకూరలో పోషకాలు పుష్కలం, ఖిచ్డీ ఆరోగ్యకరమైన ఆహారం. ఈ రెండింటిని కలిపి రుచికరమైన వంటకం ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Mixed Vegetable Palak Khichdi:
Mixed Vegetable Palak Khichdi: (Unsplash)

Mixed Vegetable Palak Khichdi:

ఆకుపచ్చని కూరగాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి, వీటిలో ఆకుకూరలు కంటిచూపుకు మంచివి. ముఖ్యంగా పాలకూర అత్యంత పోషకమైన ఆకు కూరలలో ఒకటి ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కళ్ల ఆరోగ్యానికి మంచిది, విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి, ఎముకల నిర్మాణానికి అవసరం, విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, శరీరం ఇనుమును గ్రహించడంలోనూ తోడ్పడుతుంది. ఇన్ని పోషకాలు ఉన్న పాలకూరను మీ ఆహారంలో తరచుగా తీసుకోవాలి. మీకోసం ఇక్కడ పాలకూరతో చేసే ఒక రెసిపీని అందిస్తున్నాం.

ఖిచ్డీ ఎంతో ఆరోగ్యకరమైన వంటకం, మీరు ఈ వంటకాన్ని లంచ్‌లో తినవచ్చు, డిన్నర్ సమయంలో తినవచ్చు, ఉదయం అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. ఖిచ్డీ తయారు చేయడం కూడా చాలా సులభం, నిమిషాల్లోనే సిద్ధం అయిపోతుంది, మీ ఆకలిని తీర్చుతుంది. మీ అందరికీ ఇష్టమైన ఖిచ్డీని పాలకూరతో మరింత పోషకభరితంగా మార్చవచ్చు. మిక్డ్స్ వెజిటబుల్- పాలక్ ఖిచ్డీ రెసిపీ ఈ కింద ఉంది, మీరు ఈ వంటకాన్ని తప్పకుండా చేసుకొని తినండి. మీ ఆరోగ్యానికి ఇది చాలా మంచి ఆహారం.

Mixed Vegetable Palak Khichdi Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు సోనా మసూరి బియ్యం
  • 1/4వ కప్పు పెసరిపప్పు
  • 1 ఉల్లిపాయ
  • 1 కప్పు మిశ్రమ కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, బఠానీలు, క్యాబేజీ)
  • 1 కప్పు నిండా తరిగిన పాలకూర
  • ½ స్పూన్ జీలకర్ర
  • 1 అంగుళం అల్లం
  • ¼ టీస్పూన్ మిరియాల పొడి
  • 1/2 టీస్పూన్ ధనియాల పొడి
  • ¼ టీస్పూన్ పసుపు
  • 2-3 పచ్చిమిర్చి
  • 1-2 రెమ్మల కరివేపాకు, పుదీనా ఆకులు
  • 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి
  • రుచికి తగినంత ఉప్పు

మిక్డ్స్ వెజిటబుల్ పాలక్ ఖిచ్డీ తయారు చేసే విధానం

ముందుగా బియ్యంను కడిగి నానబెట్టండి, పెసరిపప్పును కూడా కడిగి 10 నిమిషాలు నీటిలో నానబెట్టండి.

ఈలోపు కుక్కర్‌లో నెయ్యి వేడి చేయండి, అందులో జీలకర్ర, కరివేపాకు వేసి వేయించండి.

ఆపైన ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలను వేసి వేయించండి.

ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి.

ఇప్పుడు తరిగిన కూరగాయల ముక్కలతో పాటు పాలకూర, పుదీనా వేసి, ఒక నిమిషం పాటు వేయించాలి.

అనంతరం కొన్ని నీళ్లు చిలకరించి మూత పెట్టి ఒక నిమిషం పాటు సిమ్‌లో ఉడికించాలి.

ఆ తర్వాత నానబెట్టిన బియ్యం, పెసరిపప్పు వేసి, వాటిపైన మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

అనంతరం 2½ కప్పుల నీరు పోసి, రుచికి తగినంత ఉప్పు వేసి, మూతపెట్టండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఆవిరిలో ఉడికించాలి.

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, మూత తీసి చూస్తే ఘుమఘుమలాడే మిక్డ్స్ వెజిటబుల్ పాలక్ ఖిచ్డీ రెడీ. పెరుగు లేదా రైతాతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.