Dal Khichdi Recipe | దాల్ ఖిచ్డీ.. ఫాస్ట్‌గా చేసుకునే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కంటే చాలా బెస్ట్!
08 November 2022, 21:33 IST
- కేవలం 15 నిమిషాల్లో రుచికరమైన భోజనం తయారు చేసుకోండి. Dal Khichdi Recipe చూస్తూ వెంటనే తినేయండి. ఇది సూపర్ ఫాస్ట్ గా చేసుకునే ఫుడ్, బయట లభించే ఫాస్ట్ ఫుడ్ కంటే చాలా ఆరోగ్యకరమైనది.
Dal Khichdi Recipe
చంద్ర గ్రహణం, పండుగలు, ప్రయాణాలు, లేటుగా ఇంటికి రావటం వంటి సందర్భాల్లో చాలా ఆలస్యం అవుతుంది, ఆకలి కూడా అవుతుంది. ఇలాంటి సందర్భంలో సులభంగా ఏదైనా వండుకొని తింటే చాలనిపిస్తుంది. త్వరగా ఏదైనా వండుకొని కడుపునిండా తినాలనుకుంటే అందుకు బెస్ట్ ఆప్షన్ ఖిచ్డీ. అన్నం, పప్పు, కూరగాయలు, మసాలా దినుసులు కలగలిసిన ఖిచ్డీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాత్రి భోజనంలో తీసుకుంటే తేలికగా జీర్ణం అవుతుంది, ఎంతో రుచికరంగానూ ఉంటుంది.
ఇక్కడ పెసరిపప్పుతో చేసుకునే దాల్ ఖిచ్డీ త్వరగా, రుచికరంగా ఎలా చేసుకోగలమో తెలియజేస్తున్నాం. ఈ దాల్ ఖిచ్డీ కోసం మీకు నచ్చిన పప్పు ధాన్యాలను ఎంచుకోవచ్చు, నచ్చిన కూరగాయలను కలుపుకోవచ్చు. అయితే వెంటనే ఉడికిపోయి, త్వరగా వంటకం సిద్ధం చేయడం కోసం ఇక్కడ పెసరిపప్పుతో తయారు చేసుకోగలిగే దాల్ ఖిచ్డీ రెసిపీని అందిస్తున్నాం, ఇక్కడ చూస్తూ 15-20 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. దాల్ ఖిచ్డీ వండటం కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఈ కింద చూడండి.
Dal Khichdi Recipe కోసం కావలసిన పదార్థాలు
- 1 కప్పు బియ్యం
- 1 కప్పు పెసరిపప్పు
- 1 ఉల్లిపాయ
- 1 టమోటా
- 4 పచ్చిమిర్చి
- 1 టీస్పూన్ జీలకర్ర
- 1 బిర్యానీ ఆకు
- 2-3 యాలకులు
- 2-3 లవంగాలు
- 1/4 టీస్పూన్ ఇంగువ
- 1/2 టీస్పూన్ కారం
- 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 టేబుల్ స్పూన్ నెయ్యి
- 1 టేబుల్ స్పూన్ ఉప్పు
- 2 టీస్పూన్ నూనె
- కరివేపాకు
- కొత్తిమీర
- అవసరానికి తగినంత నీరు
దాల్ ఖిచ్డీ రెసిపీ- తయారీ విధానం
- ముందుగా కొన్ని నిమిషాల పాటు బియ్యం, పెసరిపప్పు కలిపి ఒక గిన్నెలో నానబెట్టండి. ఈలోపు కూరగాయలు కట్ చేసుకోండి, మసాలా దినుసులు సిద్ధం చేసుకోండి.
- ప్రెషర్ కుక్కర్ లో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర, లవంగాలు, యాలకులు, ఇంగువ, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి వేయించాలి.
- ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, అనంతరం అల్లంవెల్లుల్లి పేస్ట్, ఆపై టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి.
- ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఇందులో నానబెట్టిన బియ్యం, పప్పు వేసి తగినంత నీరు పోయండి.
- ఆపై నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించండి. 2-3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకోండి.
అంతే, ఘుమఘుమలాడే దాల్ ఖిచ్డీ సిద్ధమైనట్లే. పెరుగు లేదా అవకాయ కలుపుకొని తింటూ దీని రుచిని ఆస్వాదించండి.