Red Rice Khichdi | నోరూరించే రెడ్ రైస్ ఖిచ్డీ.. వద్దనకుండా తినేస్తారు ఎగబడి!
రాత్రికి భోజనానికి ఏం తినాలి? ఏం చేసుకోవాలి? అనే ఆలోచనలో ఉంటే సులభంగా రెడ్ రైస్ ఖిచ్డీ చేసుకోండి. అర్ధగంటలో రుచికరమైన వంటకం రెడీ అవుతుంది. తేలిగ్గా ఉంటుంది, కడుపు నిండుతుంది, తగినన్ని పోషకాలు లభిస్తాయి. రెసిపీని ఇక్కడ చూడండి..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఏదో ఒకటి చేసేస్తాం, మధ్యాహ్నం లంచ్ పుష్టిగా తింటాం. కానీ, రాత్రయ్యే సరికి ఇప్పుడు ఏం తినాలి? అనే ఆలోచన చాలా మందికి కలుగుతుంది. అల్పాహారంపై, మధ్యాహ్న భోజనంపై ఒక క్లారిటీ ఉంటుంది కానీ రాత్రి భోజనం విషయంలో ఆ క్లారిటీ ఉండదు. అన్నం తినాలా? అల్పాహారం తినాలా? ఇలా రకరకాల ఆలోచనలు వచ్చినపుడు బెస్ట్ ఆప్షన్ ఖిచ్డీ.
ఈ ఖిచ్డీ తేలికగా ఉంటుంది, పోషకాలతో నిండి ఉంటుంది, కడుపు నిండుగా కూడా అనిపిస్తుంది. మీరు బ్యాచిలర్స్ అయినా లేదా ఇంట్లో ఒకరిద్దరే ఉన్నపుడు ఖిచ్డీని సులభంగా చేసుకోవచ్చు.
మీకోసం రెడ్ రెస్ ఖిచ్డీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. నెయ్యిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించి.. ఆలూ, పచ్చిబఠానీ వేసి ఎర్ర బియ్యంతో ఖిచ్డీ చేసుకోవాలి. అది చూస్తేనే నోరూరుతుంది. కేవలం 30 నిమిషాల్లోనే రెడీ అయిపోయే ఈ రెడ్ రైస్ ఖిచ్డీని పెరుగుతో లేదా ఊరగాయతో కలుపుకొని, నిమ్మరసం పిండుకొని, ఉల్లిపాయ నంజుకొని తింటే ఉంటుందీ.. స్వర్గం అంచుల ద్వాకా వెళ్లిపోతారంటే నమ్మండి.
మరి ఆలస్యం చేయకుండా ఈ రెడ్ రైస్ ఖిచ్డీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకొనే విధానాన్ని తెలుసుకొని త్వరత్వరగా మీరూ ఈ వంటకాన్ని చేసేయండి..
కావాల్సిన పదార్థాలు
- 1/4 కప్పు పెసరపప్పు (పాలిష్ చేయనిది రుచి బాగుంటుంది)
- 100 గ్రాముల ఎర్ర బియ్యం
- 1 పచ్చిమిర్చి
- 3-4 మిరియాలు
- 1/2 అంగుళం దాల్చిన చెక్క
- 1/2 చిటికెడు ఇంగువ
- ఉప్పు తగినంత
- 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి
- 1 బంగాళాదుంప
- 1/2 టీస్పూన్ జీలకర్ర
- 2-3 లవంగాలు
- 1 ఎండు మిరపకాయ
- 3-4 కరివేపాకు రెమ్మలు
- 1.5 కప్పు నీరు
తయారీ విధానం
- ముందుగా స్టవ్ వెలిగించి, మీడియం మంట మీద ప్రెజర్ కుక్కర్‌ను ఉంచి అందులో నెయ్యి వేసి వేడి చేయండి.
- నెయ్యి వేడయ్యాక ఎండు మిరపకాయ, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఈ పోపులో బియ్యం వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు కొన్ని నీరు పోసుకొని అందులో పచ్చిమిర్చి, ఉప్పు వేసి మరిగించాలి.
- ఇప్పుడు ఆ మరిగే నీటిలో ఆలుగడ్డ ముక్కలు, పచ్చి బఠానీ వేసి కుక్కర్ మూత పెట్టేయాలి.
- రెండు విజిల్స్ వచ్చేంత వేచి చూసి తర్వాత మంట తగ్గించి మరో 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఆవిరి పోయాక మూత తీసి చూస్తే ఘుమఘుమలాడే రెడ్ రైస్ ఖిచ్డీ రెడీ అయింది. దీనిని ఇద్దరు తినవచ్చు. ప్లేట్లలోకి వడ్డించుకొని తినండి. ఆహా అనేలా ఉంటుంది.
సంబంధిత కథనం